logo

బేతుపల్లి రెవెన్యూలో భూమాయ

బేతుపల్లి రెవెన్యూలో అక్రమ భూ బదలాయింపులు ఒక్కొక్కటిగా బహిర్గతమవుతున్నాయి. రెవెన్యూ పరిధిలోని 133 సర్వే నంబర్‌లో దాదాపు 3వేల ఎకరాలకు పైచిలుకు వ్యవసాయ భూములకు అంతకుమించి పాసుపుస్తకాలు ఉండటంతో సమస్య జటిలంగా మారింది.

Published : 07 Feb 2023 04:44 IST

తవ్వినకొద్దీ వెలుగుచూస్తున్న అక్రమ బదలాయింపులు

గంగారంలో విచారిస్తున్న ఆర్డీఓ సూర్యనారాయణ

సత్తుపల్లి, న్యూస్‌టుడే: బేతుపల్లి రెవెన్యూలో అక్రమ భూ బదలాయింపులు ఒక్కొక్కటిగా బహిర్గతమవుతున్నాయి. రెవెన్యూ పరిధిలోని 133 సర్వే నంబర్‌లో దాదాపు 3వేల ఎకరాలకు పైచిలుకు వ్యవసాయ భూములకు అంతకుమించి పాసుపుస్తకాలు ఉండటంతో సమస్య జటిలంగా మారింది. గతంలో ఇక్కడ పనిచేసిన రెవెన్యూ అధికారులతో కొందరు కుమ్మక్కై భూమి లేకుండానే తమపేరిట ధరణిలో నమోదు చేయించుకుని కొత్త పాసుపుస్తకాలు పొందారు. అసలు భూములున్న రైతులు తమ పేరిట రికార్డుల్లో ఎక్కించి పాసుపుస్తకాలు ఇవ్వాలని ఏళ్లుగా రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు.

భూమి ఒకచోట... సరిహద్దులు మరోచోట

వేరే సర్వే నంబర్‌లోని మిగులు భూమిని తప్పుడు మార్గంలో కొందరు రికార్డుల్లోకి మార్చుకుని తమకు అవసరమైన ప్రాంతాల్లో సరిహద్దులను చూపుతుండటంతో వివాదాలు నెలకొంటున్నాయి. పెద్దమనిషి ముసుగులో ఓవ్యక్తి ఇదే అదునుగా రూ.కోట్ల భూముల సరిహద్దులను మిగులు సర్వే నంబర్‌లోని రికార్డుల్లో చూపుతూ దర్జాగా వ్యాపారాలు సాగిస్తున్నారు.అనుమతులు లేకుండా వెంచర్లు వేసి బేరం పెట్టి ప్లాట్లు అమ్ముతుండటంతో పంచాయతీ అధికారులు నోటీసులను సైతం జారీ చేశారు. అక్రమ లేఅవుట్లపై ఇటీవల ‘న్యూస్‌టుడే’లో కథనం ప్రచురితమవడంతో డీటీసీపీ అధికారులు సదరు ప్లాట్లను పరిశీలించి వారంలోగా అనుమతులు పొందాల్సిందేనని ఆదేశాలు జారీచేశారు. ఆ తర్వాత ముత్తా వెంకటేశ్వరరావు అనే రైతు బేతుపల్లి రెవెన్యూ 133/164/4 సర్వే నంబర్‌లోని తన రెండెకరాల భూమిని సదరు పెద్దమనిషి రిజిస్ట్రేషన్‌ చేసి మోసగించారంటూ ఫిర్యాదుచేయడంతో ఆర్డీఓ విచారణ చేపట్టారు.

లోతైన విచారణ...

ఇటీవల సత్తుపల్లిలో కలెక్టర్‌ గౌతమ్‌ పర్యటించగా పలువురు బాధితులు ఆయన్ను కలిసి బేతుపల్లి రెవెన్యూలోని తమ భూ సమస్యలను వెల్లడించారు. దీనిపై విచారణ చేసి నివేదికను ఇవ్వాలని కలెక్టర్‌ ఆదేశించడంతో ఆర్డీవో లోతైన విచారణ చేపట్టారు. ఇప్పటివరకు ఏడుగురు బాధితులు వివిధ భూ సమస్యలపై ఫిర్యాదులు చేయడంతో క్షేత్రస్థాయిలో తప్పులు ఎలా జరిగాయని ఆరా తీస్తున్నారు. ధరణిలోని కొన్ని లొసుగులను రెవెన్యూ సిబ్బంది ద్వారా తెలుసుకున్న అక్రమార్కులు కొత్తరకం దందాకు తెరలేపి దండుకుంటుండటంతో విచారిస్తున్న అధికారులు సైతం నివ్వెరపోతున్నారు. ఈ వ్యవహారాన్ని ఆర్డీవో పకడ్బందీగా విచారిస్తున్నారు. ఎవరెఎవరి మిగులు భూముల్లో ఎంతమందిపై రిజిస్ట్రేషన్లు చేశారు. సదరు భూముల లింకు డాక్యుమెంట్లు ఎవరిపేరిట ఉన్నాయి? ఇందులో ఎవరెవరి పాత్ర ఉంది? భూముల్లేకుండా పాసు పుస్తకాలను దక్కించుకున్నది ఎంతమంది? అసలు సదరు పెద్దమనిషికి ఏ విధంగా రిజిస్ట్రేషన్లు చేశారు.. ఇలా వివిధ కోణాల్లో అధికారులు విచారిస్తున్నారు.

అక్రమాలపై సీఐడీ విచారణ?

ప్రధానంగా ఇతర గ్రామంలోని పాసుపుస్తకాల్లో సర్వే నంబర్లలోని మిగులు భూమిని రూ.కోట్ల విలువైన భూముల సర్వేనంబర్లున్న చోటు సరిహద్దులు చూపుతూ అక్రమదందాకు తెరలేపిన అంశాన్ని విచారణలో అధికారులు గుర్తించారు. అక్రమాలపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి కలెక్టర్‌కు రెండు రోజుల్లో నివేదికను సమర్పిస్తామని ఆర్డీఓ తెలిపారు. ఈఅంశంపై సీఐడీ విచారణ కూడా జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని