logo

ఇల్లెందు మున్సిపల్‌ ఛైర్మన్‌పై అసమ్మతి గళం

ఇల్లెందు మున్సిపల్‌ ఛైర్మన్‌ దమ్మాలపాటి వెంకటేశ్వరరావుపై పలువురు కౌన్సిలర్లు అసమ్మతి గళం విప్పారు. ఛైర్మన్‌ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, తమను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు.

Updated : 07 Feb 2023 06:08 IST

కలెక్టరేట్‌ వద్ద ఇల్లెందు పురపాలిక కౌన్సిలర్లు

కొత్తగూడెం కలెక్టరేట్, ఇల్లెందు: ఇల్లెందు మున్సిపల్‌ ఛైర్మన్‌ దమ్మాలపాటి వెంకటేశ్వరరావుపై పలువురు కౌన్సిలర్లు అసమ్మతి గళం విప్పారు. ఛైర్మన్‌ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, తమను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. బినామీ పేర్లతో కాంట్రాక్టులు చేస్తున్నారని విమర్శించారు. ఆయనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు అనుమతివ్వాలని 15 మంది కౌన్సిలర్ల సంతకాలతో పదకొండు మంది కౌన్సిలర్లు కలెక్టరేట్‌కు సోమవారం వచ్చారు. కలెక్టర్‌ను కలిసేందుకు అధికారులు ఐదుగురిని మాత్రమే అనుమతించారు. కౌన్సిలర్లు ఇచ్చిన ఫిర్యాదు చెల్లదని, అవిశ్వాస తీర్మాన సమావేశం ఏర్పాటుచేయడం సాధ్యపడదని కలెక్టర్‌ బదులిచ్చినట్లు సమాచారం.  తమ సమస్య ఏంటో కలెక్టర్‌ తెలుసుకునే ప్రయత్నం చేయలేదని, కనీసం దరఖాస్తు తీసుకోకుండా అగౌరపరిచారంటూ మహిళా కౌన్సిలర్లు కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన చేపట్టారు. పోలీసులు జోక్యం చేసుకుని అక్కడి నుంచి పంపించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లు చీమల సుజాత, పత్తి స్వప్న, కొండపల్లి సరిత, గిన్నారపు రజిత, తోట లలిత శారద, కడగంచి పద్మ, సంద బింధు, సిలివేరు అనిత, పాబోలు స్వాతి, తార, కొక్కు నాగేశ్వరరావు మాట్లాడుతూ మున్సిపల్‌ ఛైర్మన్‌ తమ పట్ల దురుసుగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. ఇల్లెందు పురపాలికలో 24 వార్డులుండగా 16 మంది కౌన్సిలర్లు కలెక్టరేట్‌కు వచ్చామన్నారు. ఛైర్మన్‌పై ప్రభుత్వం చర్యలు తీసుకునే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.  

భగ్గుమన్న బొగ్గుట్ట పురపాలిక

ఇల్లెందు: బొగ్గుట్ట(ఇల్లెందు) పురపాలిక భగ్గుమంది. పాలకవర్గం ఏర్పడి మూడేళ్లు పూర్తయిన క్రమంలో ఛైర్మన్‌పై అసమ్మతి కౌన్సిలర్లు అవిశ్వాసానికి పూనుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్‌, ఇతర కౌన్సిలర్ల మధ్య ఏడాది నుంచి జరుగుతున్న రగడ తెలిసిందే. ఛైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు గతంలోనే కొంత మంది కౌన్సిలర్లు రహస్యంగా సంతకాలు సేకరించారు. రాష్ట్ర స్థాయి నాయకుల జోక్యంతో వెనక్కి తగ్గారు. భారాసలో ఉంటూనే ఎమ్మెల్యే బానోత్‌ హరిప్రియ, ఏఎంసీ మాజీ ఛైర్మన్‌ హరిసింగ్‌నాయక్‌కు ప్రీతిపాత్రులుగా ఉన్న కౌన్సిలర్లు అధికార పార్టీ ఛైర్మన్‌పై అవిశ్వాస తీర్మాసానికి ఆమోదం తెలిపాలంటూ కలెక్టర్‌ను ఆశ్రయించటం గమనార్హం. అసమ్మతి కౌన్సిలర్లకు అధికార పార్టీలోని పెద్దల అండదండలున్నాయనే ప్రచారం జరుగుతోంది. అసమ్మతి వర్గానికి వైస్‌ ఛైర్మన్‌ జానీపాషా, కౌన్సిలర్‌ మడత రమ మద్దతు తెలపుతున్నట్లు సమాచారం. అసమ్మతి కౌన్సిలర్లు కలెక్టరేట్‌ నుంచి రహస్య క్యాంపునకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. వారితో ఎమ్మెల్యే ఫోన్‌లో మాట్లాడి హైదరాబాద్‌కు రావాలని సూచించారని, సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని ఆమె భర్త ఏఎంసీ మాజీ ఛైర్మన్‌ తెలిపారు.

చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు

ఛైర్మన్‌పై అవిశ్వాసం పెట్టాలంటూ తాము సంతకాలు చేయలేదని 20, 23వ వార్డుల కౌన్సిలర్లు మొగిలి లక్ష్మి, కుమ్మరి రవీందర్‌ తెలిపారు. సంతకం పెట్టాలని సోమవారం ఉదయం 5గంటలకు కౌన్సిలర్లు భర్తలు, అనుచరులు రూ.10లక్షలు తెచ్చినా నిరాకరించామన్నారు. కొండపల్లి గణేష్‌, సిలివేరు సత్యనారాయణ,పి.కిరణ్‌పై చర్యలు తీసుకోవాలని సీఐ బాణోత్‌ రాజుకు ఫిర్యాదు చేసినట్లు కౌన్సిలర్లు లక్ష్మి, కటకం పద్మావతి, యలమందల వీణ, వార రవి, ఆజాం, నవీన్‌ తెలిపారు. తమ సంతకాలను దుర్వినియోగం చేయటంపై కలెక్టర్‌, ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశామన్నారు. అవిశ్వాసానికి మద్దతివ్వాలని ఎన్డీ పార్టీకి చెందిన 9వ వార్డు కౌన్సిలర్‌ రేళ్ల నాగలక్ష్మిని పలువురు సంప్రదించినా ఆమె ఒప్పుకోలేదని తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని