logo

వివాదాల నిలయం.. ఆ కార్యాలయం

పంచాయతీల అభివృద్ధే ధ్యేయంగా పనిచేయాల్సిన మండల పరిషత్‌ అధికారులు, కార్యదర్శుల మధ్య సమన్వయం కొరవడి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.

Published : 07 Feb 2023 04:44 IST

పినపాక, న్యూస్‌టుడే

పంచాయతీల అభివృద్ధే ధ్యేయంగా పనిచేయాల్సిన మండల పరిషత్‌ అధికారులు, కార్యదర్శుల మధ్య సమన్వయం కొరవడి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. పినపాక మండలంలో నిత్యం ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటూ అభివృద్ధిని పూర్తిగా విస్మరిస్తున్నారు. గ్రూపులుగా ఏర్పడి కార్యాలయాన్ని వివాదాలకు నిలయంగా మార్చారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఒకరిపై ఒకరు..

పంచాయతీల్లో విధులు సక్రమంగా నిర్వహించడం లేదని, ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపిస్తూ ఎంపీవో ఇటీవల పలువురు కార్యదర్శులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. విధుల్లో నిర్లక్ష్యానికి సంబంధించిన చిత్రాలను సైతం బహిర్గతం చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే తాను పంచాయతీల్లో పర్యటించి విధులు సక్రమంగా నిర్వహించని వారిపై చర్యలకు సిద్ధపడినట్లు పేర్కొన్నారు.

ఎంపీవో తమను కావాలనే ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని కార్యదర్శులు ఆరోపిస్తున్నారు. సమయం సందర్భంగా లేకుండా సమావేశానికి హాజరు కావాలంటూ మహిళా కార్యదర్శులను సైతం ఇబ్బంది పెడుతున్నారన్నారు. ఎంపీడీవో, ఎంపీవోపై చర్యలు తీసుకోవాలంటూ స్థానిక ఎంపీపీ, ఎంపీటీసీ సభ్యులతో కలిసి ఇటీవల తీర్మానం చేశారు.

* తనకు సంబంధం లేకుండా తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్న ఎంపీడీవో.. కార్యాలయంలో విధుల పట్ల కార్యదర్శులు, ఎంపీవో, సీనియర్‌ సహాయకుడు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రత్యారోపణ చేశారు. సమాచారం లేకుండా విధులకు గైర్హాజరవుతున్న సీనియర్‌ అసిస్టెంట్‌ మోహన్‌రెడ్డిని విధుల నుంచి తొలగిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు.

ఆ శ్రద్ధ.. విధుల్లో లేకపాయే

కార్యాలయంలో పైనుంచి కింది స్థాయి ఉద్యోగుల వరకు సమన్వయం లోపం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రతి పనిలో వివాదాన్ని వెతికే బదులు విధులపై శ్రద్ధ పెడితే నూరు శాతం అర్హులకు న్యాయం జరుగుతుందనటంలో సందేహం లేదు. గతంలో నూతన పింఛన్ల వ్యవహారంలో అనర్హులకే పెద్దపీట వేసిన యంత్రాంగం నూతన సర్క్యులర్‌ ద్వారా అర్హులైన వృద్ధుల దరఖాస్తులు తీసుకోవాలని సూచించినప్పటికి పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. వృద్ధ జంటలో ఎవరో ఒకరు మరణిస్తే.. వేరొకరికి పింఛను రావడం లేదని, తమ దరఖాస్తు స్థితి పరిశీలించాలని వేడుకునేందుకు రోజుకు పదుల సంఖ్యలో కార్యాలయానికి వస్తున్నా వారి గోస వినే నాథుడే కరవయ్యాడు.

ఉన్నతాధికారుల  దృష్టికి ఫిర్యాదులు

ఎంపీడీవో కార్యాలయంలో వివాదాల తతంగం ఉన్నతాధికారుల దృష్టికి సైతం చేరింది. ఎవరివారు ప్రత్యేకంగా వారి సమస్యలను అధికారుల వద్దకు తీసుకెళ్లారు. పంచాయతీ కార్యదర్శులు తమ సమస్యలను డీపీవోకు నివేదిక రూపంలో అందజేశారు. ఏదిఏమైనా ఉన్నతాధికారులు స్పందించి పరిస్థితిని చక్కదిద్దాలని స్థానికులు కోరుతున్నారు.


ఎంపీడీవో, ఎంపీవోపై కార్యదర్శులు జిల్లా పాలనాధికారి అనుదీప్‌కు వినతి అందజేసినట్లు తెలిసింది. సీనియర్‌ సలహాదారు, కార్యాలయ సిబ్బంది వివాదాలకు సంబంధించి సైతం కలెక్టరు దృష్టి సారించారు. వారి ఆదేశాల మేరకు విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటాం.

విద్యాలత, జడ్పీ సీఈవో


‘‘కార్యాలయంలో జరుగుతున్న వివాదాలకు సంబంధించి పలువురు కార్యదర్శులు వినతి అందజేశారు. విషయాన్ని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లి ఆయన ఆదేశానుసారం చర్యలు తీసుకుంటాం. బాధ్యతలు విస్మరిస్తే కార్యదర్శులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం.’’

లక్ష్మీరమాకాంత్‌, డీపీవో         

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని