logo

సౌర కాంతులు

స్వయం సహాయక సంఘాల సభ్యులకు సౌర విద్యుత్తు యూనిట్లను అందించాలని ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది. టీఎస్‌ రెడ్‌కోతో ఈ మేరకు ఒప్పందం చేసుకుంది.

Published : 07 Feb 2023 04:44 IST

- ఖమ్మం సంక్షేమవిభాగం, న్యూస్‌టుడే

డీఆర్డీవో విద్యాచందనతో చర్చిస్తున్న టీఎస్‌ రెడ్‌కో డీఎం ఉమాకాంత్‌, స్త్రీనిధి ఆర్‌ఎం రవీంద్రనాయక్‌ (పాత చిత్రం)

స్వయం సహాయక సంఘాల సభ్యులకు సౌర విద్యుత్తు యూనిట్లను అందించాలని ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది. టీఎస్‌ రెడ్‌కోతో ఈ మేరకు ఒప్పందం చేసుకుంది. 200 నుంచి 300 యూనిట్ల వరకు విద్యుత్తును గృహ అవసరాలకు వినియోగించే సంఘం సభ్యులకు, ఎన్‌పీఏ తక్కువ ఉంటే దీనికి ఎంపిక చేస్తారు. వీరి ఇళ్లలో సౌర విద్యుత్తు యూనిట్లను ఏర్పాటు చేసుకునేలా చైతన్యం చేయనున్నారు.

కసరత్తు ప్రారంభం

స్త్రీనిధి నుంచి రుణాలను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సభ్యులు 60 నెలల్లో నెలవారీ వాయిదాల పద్ధతిలో చెల్లించాలి. 11 శాతం వడ్డీ కలిపి కట్టాలి. దీనిపై జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి విద్యాచందనతో టీఎస్‌ రెడ్‌కో డీఎం ఉమాకాంత్‌, స్త్రీనిధి ఆర్‌ఎం రవీంద్రనాయక్‌ ఇటీవల చర్చించారు. యూనిట్ల ఏర్పాటు, సబ్సిడీ, దరఖాస్తులు, సభ్యుల వాటాధనం తదితర వివరాలపై చర్చించారు. ఇప్పటికే ఎంపిక చేసిన మండలాల్లో సభ్యులను గుర్తించేందుకు చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ఇందుకు స్వయం సహాయక సంఘాల సభ్యులకు అవగాహన కల్పించారు.

* భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 1200 మంది సభ్యులు సౌర విద్యుత్తు యూనిట్ల మంజూరుకు అర్హత కలిగి ఉన్నారు. వారిలో మొదటి విడత 385 యూనిట్లకు ఎంపిక చేయనున్నారు.

పథకానికి ఎంపికైన మండలాలు

ఖమ్మం: చింతకాని, ఎర్రుపాలెం, ముదిగొండ, సత్తుపల్లి గ్రామీణం, ఖమ్మం గ్రామీణం, కొణిజర్ల మండలాలతో పాటు మెప్మాలో సత్తుపల్లి ప్రియదర్శిని, మధిర సరస్వతి, ఖమ్మంలోని కస్తూరి సంఘాలను ఎంపిక చేశారు.

భద్రాద్రి కొత్తగూడెం : భద్రాచలం, అశ్వారావుపేట, అన్నపురెడ్డిపల్లి, ఆళ్లపల్లి, దుమ్ముగూడెం, గుండాల, లక్ష్మీదేవిపల్లి, సుజాతనగర్‌, పాల్వంచ, పినపాక మండలాలను ఎంపిక చేశారు.

* ఒక్కో మండలంలో 35 యూనిట్లను మంజూరు చేయనున్నారు. మెప్మాలోనూ 35 మంది సభ్యులను ఎంపిక చేయనున్నారు.

ఉత్పత్తి ఇలా..

టీఎస్‌ రెడ్కో సహకారంతో గృహాలపై ఫైనాన్సింగ్‌ గ్రిడ్‌ కనెక్టెడ్‌ రూఫ్‌ టాప్‌ సోలార్‌ యూనిట్లను ఏర్పాటు చేస్తారు. ప్రతి ఇంటికీ 2 నుంచి 3 కిలోవాట్ల పవర్‌ యూనిట్లను ఏర్పాటు చేసుకుంటే ప్రతిరోజు 2 నుంచి 12 యూనిట్ల వరకు విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. సోలార్‌ విద్యుత్తు యూనిట్ల ఏర్పాటుకు సబ్సిడీపై అందించే పరికరాలకు 25 ఏళ్లపాటు గ్యారెంటీ ఉంటుంది. ఉత్పత్తి చేసిన విద్యుత్తును గృహ వినియోగానికి ఖర్చు చేయగా మిగిలింది గ్రిడ్‌కు విక్రయించవచ్చు. అందుకు యూనిట్‌కు రూ.4.20 ఇస్తారు.


సోలార్‌ విద్యుత్తు యూనిట్ల ఏర్పాటు సభ్యులకు ఎంతో ఉపయోగపడుతుంది. అందుకోసం వారికి అవగాహన కల్పిస్తాం. ఎంపిక చేసిన మండలాల్లో సభ్యులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి.

ఎం.విద్యాచందన, డీఆర్డీవో

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని