logo

పాలేరు దంగల్‌

రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో వామపక్షాలతో పొత్తులకు భారాస సంకేతాలిస్తోంది. ఖమ్మం జిల్లాలో మాత్రం అధికార పార్టీ, వామపక్షాల మధ్య రాజకీయ వేడి రాజుకుంటోంది.

Updated : 26 Mar 2023 04:12 IST

పొత్తులా.. కత్తులా..?

ఈటీవీ- ఖమ్మం: రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో వామపక్షాలతో పొత్తులకు భారాస సంకేతాలిస్తోంది. ఖమ్మం జిల్లాలో మాత్రం అధికార పార్టీ, వామపక్షాల మధ్య రాజకీయ వేడి రాజుకుంటోంది. రాష్ట్రంలోనే తమకు పాలేరు నియోజకవర్గం అత్యంత ప్రాధాన్యమని.. ఈసీటు కోసం ముఖ్యమంత్రితో గట్టిగా పట్టుబడతామని సీపీఎం ప్రకటించగా.. కమ్యూనిస్టులకు ఓట్లేసే రోజులు పోయాయని సిట్టింగ్‌ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి వ్యాఖ్యానించటం గమనార్హం.

అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తున్న నేపథ్యంలో భారాస- వామపక్షాల పొత్తులపై ఆసక్తి నెలకొంది. మునుగోడు ఉపఎన్నిక నాటి నుంచే వీటి మధ్య మిత్రబంధం ఏర్పడింది. ఖమ్మంలో భారాస ఆవిర్భావ సభ తర్వాత మరింత బలపడింది. జిల్లాలో సీపీఎం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జన చైతన్య యాత్రకు భారాస ముఖ్యనేతలు సంఘీభావం ప్రకటించారు. కూసుమంచిలో జనచైతన్య యాత్ర వేదికను ఎమ్మెల్యే కందాళ శుక్రవారం పంచుకున్నారు. ఈసందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ.. పాలేరు స్థానాన్ని సీపీఎంకు కేటాయించాలని సీఎం కేసీఆర్‌ను గట్టిగా పట్టుబడతామన్నారు. ఒకవేళ భారాసకే సీటు కేటాయిస్తే.. తమ భుజాలపై పెట్టుకుని కందాళను గెలిపిస్తామని తెలిపారు. ఈ పరిణామాలపై ఎమ్మెల్యే ఉపేందర్‌రెడ్డి శనివారం దీటుగా స్పందించారు. కమ్యూనిస్టులకు ప్రజలు ఓట్లేసే రోజులు పోయాయని వ్యాఖ్యానించడమే కాకుండా.. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా తానే పోటీచేసి గెలుస్తానన్నారు. పాలేరులో ‘వార్‌ వన్‌ సైడ్‌’ అని ప్రకటించడంతో రాజకీయంగా కాక పుట్టిస్తోంది.


చర్చనీయాంశం..

పాలేరు నియోజకవర్గం నుంచే బరిలో నిలుస్తానని వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఇప్పటికే ప్రకటించారు. ఈ నెలాఖరులో పాలేరు నుంచి బస్సు యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. భారాస నుంచి ఈసారి టికెట్‌ తనదేనంటూ మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆశాభావంతో ఉన్నారు. 2018 ఎన్నికల్లో ఆయన పోటీచేసి ఓటమి పాలయ్యారు. ఇక్కడ సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న కందాళ ఉపేందర్‌రెడ్డి.. కాంగ్రెస్‌ నుంచి భారాసలో చేరారు. అధికార పార్టీలో టికెట్‌ పోరు తారస్థాయికి చేరింది. ఇప్పుడు సీపీఎం సైతం ఇక్కడ పోటీ చేస్తామనటం చర్చనీయాంశమవుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు