logo

అర్హులైన ప్రతి కార్యకర్తకు గృహలక్ష్మి పథకం: మంత్రి

అర్హులైన ప్రతి కార్యకర్తకు గృహలక్ష్మి పథకాన్ని అందించేందుకు కృషి చేస్తానని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు.

Published : 27 Mar 2023 04:02 IST

ఆత్మీయ సమావేశానికి హాజరైన నాయకులు, కార్యకర్తలు

ఖమ్మం బుర్హాన్‌పురం, న్యూస్‌టుడే: అర్హులైన ప్రతి కార్యకర్తకు గృహలక్ష్మి పథకాన్ని అందించేందుకు కృషి చేస్తానని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. ఖమ్మం నగరంలోని దోరేపల్లి ఫంక్షన్‌ హాలులో ఆదివారం నిర్వహించిన భారత్‌ రాష్ట్ర సమితి రెండో పట్టణ ఆత్మీయ సమ్మేళనంలో ఎంపీ నామా నాగేశ్వరరావుతో కలిసి ఆయన పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ ఎమ్మెల్యేగా తన గెలుపు పార్టీ కార్యకర్తలదేనని వారు లేకుండా ఏమీ చేయలేమన్నారు. కార్యకర్తలను ఆదుకునేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు.

బూత్‌ ఓటింగ్‌పై అంతర్గతంగా చర్చిస్తా: బూత్‌ల వారీగా గత ఎన్నికల్లో వచ్చి ఓట్లు, ఏఏ చోట తప్పిదాలు జరిగాయి, ఓట్లు ఎక్కడ తగ్గాయన్న విషయాలకు సంబంధించి వివరాలు తన వద్ద ఉన్నాయని, వాటన్నింటిపై మంత్రితో అంతర్గతంగా చర్చించనున్నట్టు ఎంపీ నామా నాగేశ్వరరావు చెప్పారు. ఇకముందు లోపాలు జరగకుండా పార్టీని పటిష్టంగా ఉంచుకోవాలన్నారు. తెలంగాణలో ఓటు అడిగే హక్కు ఒక్క భారాసకే ఉందని, మాయ మాటలు చెప్పేందుకు కొంతమంది బయలుదేరారని వారితో అప్రమత్తంగా ఉండాలన్నారు. మంత్రి అజయ్‌కుమార్‌ బాధ్యతలు చేపట్టిన నుంచి రూ.1200 కోట్లతో నగరాన్ని అభివృద్ధి చేశారని, ఇతర రాష్ట్రాల వారు, జిల్లాల వారు వచ్చి అభివృద్ధి పనులు పరిశీలించడమే దీనికి నిదర్శనమన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. శీలంశెట్టి వీరభద్రం అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మేయర్‌ పునుకొల్లు నీరజ, సుడా ఛైర్మన్‌ బచ్చు విజయ్‌కుమార్‌, మార్కెట్‌ కమిటీ ఛైర్‌పర్సన్‌ దోరేపల్లి శ్వేత, ఉప మేయర్‌ ఫాతిమాజోహ్రా, భారాస నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, నాయకులు కర్నాటి కృష్ణ, గుండాల కృష్ణ, బత్తుల మురళీప్రసాద్‌, రాంమూర్తి, కిషోర్‌ కార్పొరేటర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సీపీఆర్‌పై అవగాహన: గుండెపోటుకు గురైన వారిని ప్రాణాపాయం నుంచి కాపాడేందుకు వైద్య ఆరోగ్యశాఖ చేపట్టిన సీపీఆర్‌పై కార్యకర్తలకు, నాయకులకు మంత్రి అజయ్‌కుమార్‌ అవగాహన కల్పించారు.

నవ్వులు పూయించిన మహిళ: ఆత్మీయ సమ్మేళనంలో ఓ మహిళా కార్యకర్త లేచి ‘అజయ్‌కుమార్‌ సారూ.. స్థానిక అభివృద్ధి గురించి అందరూ ఒకటే చెబుతున్నారు. నువ్వు ఒక్కడివే మాట్లాడితే మేమందరం వింటాం. తొందరగా మాట్లాడయ్యా’ అని కోరడంతో సమావేశంలో నవ్వులు విరిశాయి. మంత్రి మాట్లాడుతూ.. సమావేశంలో పాల్గొన్న ప్రతి ఆడబిడ్డకు తానే భోజనాలు వడ్డిస్తానని, ఆదివారం ఎన్నో పనులు వదులుకొని వచ్చిన మహిళలకే ముందు అందించాలన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని