logo

చేతిపంపుల మరమ్మతులకు పైసలేవి

వేసవి వచ్చిందంటే కొన్ని గ్రామాల్లో తాగునీటికి ఇబ్బందులు తప్పటం లేదు. గతంలో ఎండాకాలం సమీపిస్తున్న తరుణంలో తాగునీటి ఎద్దడి పరిష్కారానికి ప్రణాళికలు తయారుచేసేవారు.

Published : 27 Mar 2023 04:02 IST

కొణిజర్ల, ఏన్కూరు, న్యూస్‌టుడే

తల్లాడలో నిరుపయోగంగా ఉన్న చేతిపంపు

వేసవి వచ్చిందంటే కొన్ని గ్రామాల్లో తాగునీటికి ఇబ్బందులు తప్పటం లేదు. గతంలో ఎండాకాలం సమీపిస్తున్న తరుణంలో తాగునీటి ఎద్దడి పరిష్కారానికి ప్రణాళికలు తయారుచేసేవారు. ప్రస్తుతం ఆ ఊసే లేదు. మిషన్‌ భగీరథ నీరు అన్ని గ్రామాలకు సరఫరా చేస్తున్నామని అధికారులు చెబుతుండటంతో ప్రణాళికల్ని పూర్తిగా పక్కనపెట్టేశారు. కానీ క్షేత్ర స్థాయిలో భగీరథ నీరు అందని గ్రామాలు ఉభయ జిల్లాల్లో చాలా ఉన్నాయి. అలాంటిచోట ప్రధాన నీటి వనరు చేతిపంపులే. పరోక్షంగా అధికారులు దీన్ని అంగీకరిస్తూనే చేతిపంపుల బాధ్యతను పంచాయతీలకు అప్పగించారు. పంచాయతీ నిధులతో మరమ్మతులు చేయించాలని ఆదేశాలైతే ఇచ్చారు కానీ ఖజానాలో డబ్బుల్లేవనే సంగతిని మరిచారు.

ర్‌డబ్ల్యూఎస్‌ శాఖ ఉన్నప్పుడు గ్రామాల్లో చేతిపంపు నిర్వహణకు ప్రత్యేక ప్రణాళిక ఉండేది. వాటికి సంబంధించిన సామగ్రి మొత్తం ప్రభుత్వం నుంచి వచ్చేవి. వేసవి రాగానే మెకానిక్‌లతో పనులు చక్కబెట్టేవారు. మిషన్‌ భగీరథ పట్టాలెక్కిన తర్వాత బోర్ల నిర్వహణను గాలికొదిలేశారు. పంచాయతీలకు బాధ్యత అప్పగించారు. ప్రతి మండలంలో 250 నుంచి 550 వరకు చేతిపంపులున్నాయి. వాటికి సంబంధించిన హ్యాండిల్‌, పైపులు, ఇతరత్రా సామగ్రి ధరలు గణనీయంగా పెరిగాయి. నిధులు లేకపోవడంతో నెలలుగా కొనుగోలు చేసే పరిస్థితి లేదు. ఎక్కువగా ఉపయోగించే ప్రాంతంలో మాత్రం కొంతవరకు నిధులు ఖర్చుచేస్తున్నారు. ఇంకోపక్క భగీరథ నీరు అందడం లేదని మండల పరిషత్తు సమావేశాల్లో సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తల్లాడ మండలం కుర్నవల్లిలో భగీరథ నీరు సరిపడా రాకపోవడంతో పంచాయతీ బోరుపైనే  ఆధారపడుతున్నారు.

కొణిజర్ల మండలం విక్రమ్‌నగర్‌, ఉప్పలచెలక, కాచారం గ్రామాలకు సక్రమంగా మిషన్‌ భగీరథ నీరు సరఫరా కావటం లేదు. దీనిపై ఇటీవల మండల పరిషత్తు సమావేశంలో అధికారులను సర్పంచులు పలుమార్లు నిలదీశారు.

పాఠశాలల్లో ఉన్న చేతిపంపులు పనిచేయకపోవడంతో మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థులు అనేకచోట్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

మధిర, కూసుమంచి, బోనకల్లు, తిరుమలాయపాలెం, ఇతర మండలాల్లోనూ మిషన్‌ భగీరథ నీరు అందని సమయంలో చేతిపంపులపైనే ఆధారపడుతున్నారు.


రూ.2-5 వేల ఖర్చు

పంచాయతీల్లో నిధులు నిండుకున్నాయి. డబ్బుల్లేకుండా చేతిపంపుల మరమ్మతులు ఎలా చేయాలో అర్థంకాక సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు. ఇంటి పన్నులు వసూలు చేస్తే వచ్చే జనరల్‌ ఫండ్‌ను చిన్నచిన్న అవసరాలకు ఉపయోగించుకుంటున్నారు. రాష్ట్రం, కేంద్రం ఇచ్చే నిధులు ఆరు నెలల నుంచి రావడంలేదు. కేంద్రం అడపాదడపా నిధులిస్తే అవి గతంలో చేసిన పనులకు సరిపోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు నెలకు పంచాయతీ జనాభా బట్టి రూ.1.50లక్షల నుంచి రూ.6లక్షల వరకు వస్తుంటాయి. కేంద్రం కూడా అంతే మొత్తంలో అందించాల్సి ఉండగా అరకొర నిధులతో సరిపెడుతుంది. పంచాయతీలో జమ అయినట్లు కనపడుతున్నా వాస్తవానికి ఆ పరిస్థితి ఉండటం లేదు. ఒక్కో చేతిపంపునకు మరమ్మతులు చేయాలంటే రూ.2వేల నుంచి రూ.5వేల వరకు ఖర్చవుతుంది.


50శాతానికి పైగా..

ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహణ లేక 50శాతం చేతిపంపులు మూలనపడ్డాయి. వేసవి వస్తే నీరు అడుగంటిన బోర్లను గుర్తించి గతంలో ఫ్లషింగ్‌ చేసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడంతో ప్రజలే స్వచ్ఛందంగా డబ్బులు వేసుకుని మరమ్మతులు చేయించుకుంటున్నారు. ఎప్పుడైనా మిషన్‌ భగీరథ నీరు నిలిచిపోతే  వీటిపైనే ఆధారపడుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు