logo

రైతు వేదికలతో ఎరువులు చేరువ

అన్నదాతలకు ఎరువులను చేరువ చేసేందుకు రైతు వేదికలను వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వానాకాలం సీజన్‌ నుంచే జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీ (డీసీఎంఎస్‌)ల ఆధ్వర్యంలో.

Published : 27 Mar 2023 04:02 IST

ఖమ్మం వ్యవసాయం, న్యూస్‌టుడే

న్నదాతలకు ఎరువులను చేరువ చేసేందుకు రైతు వేదికలను వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వానాకాలం సీజన్‌ నుంచే జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీ (డీసీఎంఎస్‌)ల ఆధ్వర్యంలో రైతు వేదికల్లో ఎరువులు విక్రయించేందుకు సన్నాహాలు చేస్తోంది. రైతు వేదికల వారీగా ఎరువుల అవసరాల వివరాలు సేకరించే పనిలో నిమగ్నమైంది. పంటలకు కావాల్సిన ఎరువుల్లో 50శాతం వరకు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ఆగ్రోస్‌ రైతు సేవా కేంద్రాలు, డీసీఎంఎస్‌ల ద్వారా ప్రభుత్వమే నిర్ణీత ధరలకు సరఫరా చేస్తుంది. మిగిలిన 50 శాతం ప్రైవేటు డీలర్లకు కేటాయిస్తుంది.  

ఇక్కట్లు తప్పినట్లే..!

కర్షకులకు మెరుగైన సేవలందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతి 5వేల ఎకరాలకు ఒక క్లస్టర్‌ ఏర్పాటుచేసి అక్కడ రైతు వేదికలు నిర్మించింది. వాటిలో ఏఈవోలను నియమించింది. వేదికల్లో వారంలో ఆరు రోజులు వ్యవసాయానికి సంబంధించిన సదస్సులు నిర్వహిస్తోంది. వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలతో రైతులకు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తోంది. ఇక నుంచి జిల్లా సహకార మార్కెటింగ్‌ సంస్థ(డీసీఎంఎస్‌) ఎరువులను కొని రైతు వేదికలకు పంపిస్తుంది. ఏఈవో ఆధ్వర్యంలో వాటిని రైతులకు విక్రయిస్తారు. ఎరువుల నిల్వ, భద్రతకు సంబంధించిన విషయాలను డీసీఎంఎస్‌ పర్యవేక్షిస్తుంది. దీనివల్ల రైతులు ఎరువుల కోసం ఇబ్బంది పడే అవకాశం ఉండదు.


డీసీఎంఎస్‌ ద్వారా ఎరువులు విక్రయించాలనే ప్రభుత్వం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. రైతులకు తక్కువ ధరకే నాణ్యమైన ఎరువులు సరఫరా చేస్తాం. గతంలోనూ వీటిని పంపిణీ చేసిన చరిత్ర సంస్థకు ఉంది. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే ఉభయ జిల్లాల్లో ఏర్పాట్లు మొదలుపెడతాం.

రాయల వెంకటశేషగిరిరావు, డీసీఎంఎస్‌ ఛైర్మన్‌

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు