logo

కారుణ్య నియామకాలు.. తిరకాసు పర్వాలు

రాష్ట్రంలోని 11 సింగరేణి ఏరియాల్లో రెండు రకాల పేర్లు సమస్యగా మారాయి. పేర్లు తప్పులతో సుమారు 550 నుంచి 600 మంది కార్మికులు, వారి కుటుంబ సభ్యులు అవస్థలు పడుతున్నారు.

Published : 27 Mar 2023 04:02 IST

సింగరేణిలో రెండు రకాల పేర్లు సమస్య
ఇల్లెందు, న్యూస్‌టుడే

ఇల్లెందు ఏరియా జీఎం కార్యాలయం

రాష్ట్రంలోని 11 సింగరేణి ఏరియాల్లో రెండు రకాల పేర్లు సమస్యగా మారాయి. పేర్లు తప్పులతో సుమారు 550 నుంచి 600 మంది కార్మికులు, వారి కుటుంబ సభ్యులు అవస్థలు పడుతున్నారు. కారుణ్య నియామకాలు, పింఛను తీసుకొనే సమయంలో సమస్య వారిని వేధిస్తోంది. కార్మికులకు సింగరేణి సర్వీసు రికార్డుల్లో ఒక పేరు ఉండటం, వారి ఇంటి వద్ద ఆధార్‌కార్డు తదితర చదువుకొనే పత్రాల్లో మరో పేరు ఉంటుంది. ఈక్రమంలో కారుణ్య నియామకాల కోసం దరఖాస్తు చేసుకున్న కార్మికుల వారసులకు సర్వీసు రికార్డులో ఉన్న పేరు కాకుండా, ఇంటి వద్ద ఉన్న(కార్మికుని) పేరుతో ఆధార్‌ తదితర విద్యా, కుల ధ్రువీకరణ పత్రాలు ఉంటున్నాయి. దీంతో పేర్లలో తేడా ఉన్నాయని సాకు చూపిస్తూ కార్మికుల వారసులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు అధికారులు ససేమీరా అంటున్నారు.

ఇవీ ఉదాహరణలు

పట్టణంలోని ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీకి చెందిన ఓ కార్మికుడు ఏడాదిన్నర క్రితం గుండెపోటుతో మృతి చెందాడు. ఆయన పేరు సింగరేణి రికార్డులో ఒకటి, ఇంటి వద్ద మరోటి వేరుగా ఉంది. ఆయన కుమార్తె కారుణ్య నియామకానికి దరఖాస్తు చేసుకున్నారు. అధికారులు గనిలో, వారు నివసించే ప్రాంతంలో పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. ఆ కార్మికుడి కుమార్తెగా నిర్ధారించుకున్నారు. కానీ పేరు వేర్వేరుగా ఉందనీ ఇల్లెందు ఏరియా సింగరేణి అధికారులు 6 నెలల నుంచి ఆమెకు ఉద్యోగం ఇవ్వకుండా ఆపుతున్నారు. కార్మికుడు మృతి చెంది ఉద్యోగం రాక కార్మికుడి భార్య, కుమార్తె ఆవేదన చెందుతున్నారు.

ఒక కార్మికుడు ఉద్యోగంలో చేరే క్రమంలో పేరు తప్పుగా నమోదైంది. కులం పేరును ఇంటి పేరుతో కలపి నమోదు చేశారు. అదే పేరుతో కార్మికుడు ఉద్యోగం చేసుకుంటూ వచ్చాడు. కానీ కార్మికుని పిల్లలు మాత్రం వారి అసలైన ఇంటి పేరుతోనే చదువు కొనసాగించారు. ఆ కార్మికుడి వారసుడికి ఉద్యోగం ఇచ్చే క్రమంలో పేర్లు తప్పులు ఉన్నాయని ఉద్యోగం ఇవ్వకుండా అధికారులు నిలిపివేస్తున్నారు.


సంస్థ నిబంధనల ప్రకారం ఉద్యోగాలిస్తాం

జీవీ మోహన్‌రావు, డీజీఎం పర్సనల్‌

సింగరేణి సంస్థ నిబంధనల ప్రకారం సర్వీస్‌ రికార్డుల్లో ఉన్న కార్మికుల పేరు ఆధారంగా కారుణ్య నియామకాల్లో వారి వారసులకు ఉద్యోగాలు ఇస్తాం. కార్మికుని ఇంటి పేరు, అసలు పేరుకు సంబంధం లేకుండా ఉన్న వారు దరఖాస్తు చేసుకుంటే ఉద్యోగం ఇవ్వలేం. రెండు పేర్లకు సంబంధించి వన్‌టైం సెటిల్‌మెంట్‌ అనుమతి ఇంకా సంస్థలో రాలేదు.


వన్‌టైం సెటిల్‌మెంట్‌కు అవకాశం కల్పించాలి

ఎస్‌.రంగనాథ్‌, తెబొగకాసం ఏరియా ఉపాధ్యక్షులు

రెండు పేర్ల సమస్యతో గత కొన్నేళ్ల నుంచి కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. రెండు పేర్లు, పేర్ల తప్పులపై వన్‌టైం సెటిల్‌మెంట్‌కు అవకాశం కల్పించాలని మా సంఘం రాష్ట్ర నాయకులు పలుమార్లు యాజమాన్యానికి వినతులు ఇచ్చారు. ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి అవకాశం కల్పిస్తే కారుణ్య నియామకాల సమయంలో కార్మికుల వారసులు ఇబ్బందులు తొలగుతాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు