logo

పంట నష్టం అర్హుల గుర్తింపు ప్రక్రియ ప్రారంభం

ఖమ్మం జిల్లాలో పంట నష్టం సర్వేను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు అధికారులు ప్రారంభించారు

Published : 30 Mar 2023 04:56 IST

ఖమ్మం వ్యవసాయం, న్యూస్‌టుడే: ఖమ్మం జిల్లాలో పంట నష్టం సర్వేను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు అధికారులు ప్రారంభించారు. క్షేత్రస్థాయిలో వ్యవసాయ విస్తరణ అధికారి(ఏఈవో)తో పాటు వీఆర్‌ఏ కలిసి దెబ్బతిన్న పొలాలను సర్వే చేసి అందుకు అనుగుణంగా రైతుల పేర్లను నమోదు చేస్తున్నారు. కౌలు రైతుల వివరాలను   నమోదు చేస్తున్నారు. సర్వే నంబరు ఆధారంగా దెబ్బతిన్న పొలాలను పరిశీలించి ఎంత మేరకు నష్టం జరిగిందనే విషయం గురించి రైతుల సమక్షంలోనే నమోదు చేస్తున్నారు. కలెక్టర్‌ ఆదేశానుసారం పంట నష్టం అర్హుల జాబితాలను గ్రామ పంచాయతీల్లో, రైతు వేదికల్లో ప్రదర్శిస్తారు. డీఏవో ఎం.విజయనిర్మల చింతకాని మండలంలోని మత్కేపల్లి, నాగులవంచ గ్రామాల్లో బుధవారం పర్యటించి పంట నష్టం నమోదు అంశాన్ని పరిశీలించారు.  మధిర ఏడీఏ కొంగర వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది ఎలా పనిచేస్తున్నారనే విషయం గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సర్వేకు సంబంధించిన అంశాలను వారికి వివరించారు,  

సర్వేకు అదనపు సిబ్బంది...

జిల్లాలో పెద్ద ఎత్తున పంట నష్టం జరిగిన బోనకల్లు, చింతకాని, వైరా, కొణిజర్ల మండలాలకు అదనపు సిబ్బందిని కేటాయించారు. పంట నష్టం జరగని మండలాలకు చెందిన సుమారు 40 మంది వ్యవసాయ విస్తరణ అధికారులను డిప్యుటేషన్‌పై నియమించారు. దీని వల్ల పంట నష్టం అర్హుల సర్వే త్వరితగతిన పూర్తయ్యే అవకాశం ఉంది. మొత్తంగా మరో వారం రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసి పూర్తి నివేదికను రాష్ట్ర వ్యవసాయశాఖకు నివేదించనున్నారు. ఆ తర్వాత ప్రభుత్వం అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో ఎకరాకు రూ.10 వేల చొప్పున జమ చేస్తుంది.

రెండు రోజుల్లో భద్రాద్రి జిల్లాలో..

ప్రస్తుతం భద్రాద్రి జిల్లా ఉన్నతాధికారులంతా శ్రీరామనవమి వేడుకల్లో నిమగ్నమయ్యారు. ఒకటి, రెండు రోజుల్లో ఈ జిల్లాలోనూ పంట నష్టం అర్హుల వివరాలను నమోదు చేసే అవకాశం ఉంది. ఖమ్మం జిల్లాతో పోలిస్తే ఈ జిల్లాలో పంట నష్టం తక్కువగానే ఉంది. సుమారు 3 వేల ఎకరాల్లో మాత్రమే దెబ్బతిన్నందున కొద్ది రోజుల్లోనే సర్వే పూర్తి చేసే అవకాశం కనిపిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని