logo

మురిసిన ముల్లోకాలు..

చూచువారలకు చూడముచ్చటైంది.. కలడు అన్నవారి కనులెదుట రాముడు సాక్షాత్కరించాడు. మణిబాసికం నుదుటన కట్టి పారాణిని పాదాలకు పెట్టి పెళ్లికూతురైన సీతమ్మను చూసి భక్తులు తరించారు.

Published : 31 Mar 2023 03:46 IST

వైభవంగా సీతారాముల కల్యాణం

స్వామివారి తలంబ్రాల ఘట్టం. చిత్రంలో చిన జీయర్‌స్వామి

భద్రాచలం, న్యూస్‌టుడే: చూచువారలకు చూడముచ్చటైంది.. కలడు అన్నవారి కనులెదుట రాముడు సాక్షాత్కరించాడు. మణిబాసికం నుదుటన కట్టి పారాణిని పాదాలకు పెట్టి పెళ్లికూతురైన సీతమ్మను చూసి భక్తులు తరించారు. ఎంతో విశిష్టమైన తలంబ్రాల వేడుక ప్రతి మదిని పునీతం చేసింది. అక్షతలు జానకి దోసిట కెంపుల పోగయ్యాయి. రాముడి దోసిట పడి నీలపు రాసైన అక్షతలు మెరవడంతో భక్తకోటి మురిసింది. జగదేకవీరుడైన రామయ్యకు జగన్మాత సీతమ్మకు జరిగిన కల్యాణ మహోత్సవం భూలోకమంతా పండగైంది. భక్తులు బ్రహ్మానందభరితులయ్యారు. ఎక్కడ చూసినా లోక కల్యాణ ఏర్పాట్లే. ఏ నోట విన్నా సీతారాముల జంట గురించిన ముచ్చట్లే.. దాంపత్యానికి ప్రతీకలైన సీతారాముల వారి వార్షిక కల్యాణం కమనీయమైంది. అన్ని క్యూలైన్లతో పాటు భద్రాచలం పట్టణం భక్తులతో రద్దీగా మారింది.


ఏనోము ఫలమో రామచంద్రా..

వేడుకను తిలకించేందుకు వస్తున్న హరియాణా గవర్నర్‌ దత్తాత్రేయ, భద్రాద్రి కలెక్టర్‌ అనుదీప్‌, ఎస్పీ వినీత్‌  

రామాలయం సమీపంలోని యాగశాలలో గురువారం శ్రీరామాయణ మహాక్రతువు ఘనంగా నిర్వహించి సామూహిక పారాయణాలు సాగించారు. బ్రహ్మోత్సవాల్లో బ్రహ్మాండమైన వేడుక శ్రీరామనవమి. ఈ వేడుకలను వీక్షించినవారు భక్తి పారవశ్యంలో తేలియాడారు. తెల్లవారుజాము 2 గంటలకు ఆలయం తలుపులు తెరవగానే శ్రీరామ నామాలు మార్మోగాయి. కౌసల్యా సుపుత్రుడికి సుప్రభాతం పలికి ఆరాధించి మూలవరులకు అభిషేకం చేశారు. సంప్రదాయబద్ధంగా ధ్రువమూర్తుల కల్యాణం నిర్వహించారు. ఆ సమయంలో సాగిన మంత్రోచ్ఛారణతో భద్రగిరి పులకించింది. కల్యాణమూర్తులను అత్యంత సుందరంగా అలంకరించి జయజయ నీరాజనాల మధ్య మాడవీధిలో ఊరేగింపుగా మిథిలా మండపానికి తీసుకొచ్చారు. ఆసమయంలో స్వామివారి పల్లకిని తాకేందుకు అమితాసక్తి కనబర్చారు. మిథిలా ప్రాంగణం నుంచి వీనులకు విందు చేస్తున్న వ్యాఖ్యానాలు, ప్రవచనాలు తన్మయులను చేశాయి.


ప్రతి ఘట్టం మధురాతి మధురం

ఆశీస్సులు అందుకుంటున్న మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీలు రవిచంద్ర, కవిత, ఎమ్మెల్సీ మధుసూదన్‌ తదితరులు

సీతారాముల కల్యాణం లోక కల్యాణం. చక్కని సీతమ్మ చల్లని రామయ్య కల్యాణం ప్రతి ఒక్కరికీ ఆనందదాయకమని చేసిన ప్రవచనం ఓలలాడించింది. కల్యాణమూర్తులు మిథిలా మండపంలోకి వేంచేయడంతో ఈ ప్రాంగణానికి సరికొత్త శోభ వచ్చింది. ఉదయం 10 గంటలకు చేరుకోవాల్సి ఉండగా 20 నిమిషాలు ముందుగానే మండపానికి దేవుడు వచ్చాడు. శ్రీమన్నారాయణుడికి అత్యంత ఇష్టమైన విష్వక్సేనుల వారిని ఆరాధించారు. పుణ్యాహ వాచనం చేసి పుండరీకాక్ష మంత్రం పఠించారు. జగదానందకారకుడి జగమంత కుటుంబం మనం అంటూ సుభాషించారు. కన్యావరుణ జరిపి సీతమ్మకు యోక్త్రధారణ నిర్వహించి రాముడికి యజ్ఞోపవీత ధారణ చేశారు. ప్రవరను పఠించారు. గోత్ర నామాల విశిష్టతను వివరించి శ్రీరామ నామాలు పఠించారు. అభిజిత్‌ లగ్నంలో సీతారాముల వారి శిరస్సులపై జీలకర్ర బెల్లాన్ని ఉంచారు. ఈ మహత్కార్యం భక్తులను పులకింపజేసింది. జగమంతా ఎదురుచూస్తుండగా మూడు ముళ్ల బంధం నిర్వహించారు. సమస్త మంగళ వాయిద్యాలు మార్మోగుతుండగా మాంగళ్యధారణ జరిగింది. భక్త రామదాసు చేయించిన మూడో మంగళ పతకం ఈకల్యాణంలో ప్రత్యేకతను చాటింది. ఎప్పటికీ శాశ్వతంగా ఉండేది అక్షత. ఈ తలంబ్రాల వేడుక నయనానందకరంగా సాగింది. ముత్యాలతో కలిపి ఉన్న తలంబ్రాలు స్వామివారి మీద పడగానే ప్రాంగణంలో ఉన్నవారంతా పెద్దపెట్టున జైశ్రీరాం అంటూ తమ సంతోషాన్ని చాటారు. ఈ తలంబ్రాలను ఎలాగైనా తీసుకోవాలన్న తహతహ భక్తుల్లో కనిపించింది. కల్యాణం తర్వాత స్వామివారు దేవాలయానికి చేరుకున్నాక రాజభోగం చేసి ఆరాధన నిర్వహించారు. తిరువీధి సేవలో నూతన దంపతులకు అడుగడుగునా హారతులు అందించారు. ఈ జంట చూచువారలకు చూడముచ్చటైంది.  ఏర్పాట్లను ఈవో రమాదేవి పర్యవేక్షించారు.


దేవదేవుడికి కానుకల వెల్లువ

తెలంగాణ ఏర్పడిన తర్వాత రెండు పర్యాయాలు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముత్యాల తలంబ్రాలను తీసుకొచ్చారు. ఆతర్వాత రావడం లేదు. ఈసారి వస్తారని అనుకున్నా మళ్లీ నిరాశే మిగిలింది. ప్రభుత్వం తరఫున దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, కమిషనర్‌ అనిల్‌కుమార్‌ ఈ సంప్రదాయాన్ని కొనసాగించారు. సీతారాముల వారికి చిన జీయర్‌స్వామి పట్టువస్త్రాలు అందించారు. భక్త రామదాసు పదోతరం వారసుడు కంచర్ల శ్రీనివాస్‌ పట్టువస్త్రాలను సమర్పించారు. శృంగేరీ పీఠంతో పాటు వివిధ చోట్ల నుంచి దేవదేవుడికి వస్త్ర, కనక, నగదు రూపేణా కానుకలు వెల్లువెత్తాయి. చిన జీయర్‌స్వామి సమక్షంలో సాగిన క్రతువు ఆద్యంతం భక్తులను రససాగరంలో ముంచెత్తింది. స్థానాచార్యుడు స్థలసాయి, ప్రధానార్చకులు సీతరామానుజాచార్యులు, విజయరాఘవన్‌, వేద పండితులు మురళీకృష్ణమాచార్యులు, హనుమత్‌శాస్త్రి, ఉప ప్రధానార్చకులు రామస్వరూప్‌ పర్యవేక్షించగా ఆచార్య బ్రహ్మ రుత్విక్‌లు క్రతువు కొనసాగించారు. స్వామివారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.


నేడు పట్టాభిషేకం.. గవర్నర్‌ రాక

భద్రాచలం, న్యూస్‌టుడే: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో నేడు పట్టాభిషేకం నిర్వహించనున్నారు. ఇందులో పాల్గొనేందుకు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ రానున్నారు. ఆమె పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను అధికారులు గురువారం ప్రకటించారు. రాత్రి సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ నుంచి రైలులో బయల్దేరి శుక్రవారం ఉదయం 4.15కి కొత్తగూడెం చేరుకుంటారు. రోడ్డు మార్గంలో 4.50కి బూర్గంపాడు మండలం సారపాకలోని ఐటీసీ అతిథి గృహానికి చేరుకుంటారు. కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని అల్పాహారం తర్వాత 9.40కి భద్రాచలం రామాలయాన్ని చేరుకుంటారు. మిథిలా మండపంలో నిర్వహిస్తున్న పట్టాభిషేకాన్ని మధ్యాహ్నం 12.30 వరకు వీక్షిస్తారు. అనంతరం ఐటీసీ అతిథి గృహం వద్దకు చేరుకుని భోజనం అనంతరం 3.45 గంటలకు దుమ్ముగూడెం మండలం పర్ణశాల రామాలయంలో స్వామివారిని దర్శించుకుంటారు. సాయంత్రం 5 గంటలకు పర్ణశాల నుంచి బయల్దేరి ఐటీసీ అతిథి గృహానికి వెళ్తారు. రాత్రి భోజనం అనంతరం కొత్తగూడెం వెళ్లి రైలులో హైదరాబాద్‌ పయనమవుతారు.


ఖమ్మంలో ఘనంగా తెప్పోత్సవం

లకారంలో నెమలి వాహనంపై సీతారాముల విహారం

ఖమ్మం కార్పొరేషన్‌: ఎటు చూసినా భక్తజన సందోహం... స్వామివారి ఊరేగింపును తిలకించేందుకు బారులుదీరిన జనం... వేద మంత్రాలు.. మంగళ వాయిద్యాల నడుమ నెమలి వాహనంపై శ్రీసీతారాముల తెప్పోత్సవం గురువారం రాత్రి నేత్రపర్వంగా సాగింది. తొలుత ఖమ్మంలోని పర్ణశాల రామాలయం నుంచి లకారం వరకు నిర్వహించిన శోభాయాత్ర ఆద్యంతం కోలాటాలు... విభిన్న వేషధారణలు.. యువత కేరింతలు.. బాణసంచా చప్పుళ్లతో కనులపండువగా సాగింది. లకారం వద్ద కలెక్టర్‌ వీపీ గౌతమ్‌, సీపీ విష్ణు ఎస్‌.వారియర్‌, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్‌, మేయర్‌ పునుకొల్లు నీరజ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని నెమలి వాహనం పైకి చేర్చి లకారంలో తెప్పోత్సవం నిర్వహించారు. తెప్పోత్సవంలో భాగంగా చెరువు చుట్టూ స్వామివారిని తిప్పుతూ బాణసంచా కాల్చడంతో ఆ ప్రాంతం దేదీప్యమానమైంది. అనంతరం ‘లవ్‌ యూ రామ్‌’ చిత్ర యూనిట్‌ సందడి చేసింది.  కమిషనర్‌ ఆదర్శ్‌ సురభి, శిక్షణ కలెక్టర్‌ రాధికాగుప్తా, డీసీసీబీ ఛైర్మన్‌ కూరాకుల నాగభూషయ్య, సుడా ఛైర్మన్‌ విజయ్‌కుమార్‌, కార్పొరేటర్లు కర్నాటి కృష్ణ, చావా మాధురి, బిక్కసాని ప్రశాంతలక్ష్మి, తహసీల్దార్‌ శైలజ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని