logo

బార్‌ అసోసియేషన్‌ ఎన్నికలు నేడే

ఖమ్మం జిల్లా న్యాయవాద సంఘం(బార్‌ అసోసియేషన్‌) ఎన్నికలు శుక్రవారం జరగనున్నాయి.

Published : 31 Mar 2023 03:46 IST

ఖమ్మం న్యాయవిభాగం, న్యూస్‌టుడే: ఖమ్మం జిల్లా న్యాయవాద సంఘం(బార్‌ అసోసియేషన్‌) ఎన్నికలు శుక్రవారం జరగనున్నాయి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 వరకు పోలింగ్‌ నిర్వహించి సాయంత్రం 4 గంటలకు ఓట్ల లెక్కింపు చేపడతారు. రాత్రి 8 గంటలకల్లా తుది ఫలితాలు ప్రకటించనున్నట్లు ఎన్నికల అధికారి సోమశేఖరశర్మ తెలిపారు. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా బార్‌ అసోసియేషన్‌లో దాదాపు 1,100 మంది న్యాయవాదులు ఉండగా అందులో ఈసారి 884 మంది ఓటుహక్కు కలిగి ఉన్నారు. ఓటర్లు తెలంగాణ బార్‌ కౌన్సిల్‌ లేదా ఖమ్మం జిల్లా బార్‌ అసోసియేషన్‌ జారీ చేసిన గుర్తింపు కార్డు వెంట తీసుకువచ్చి తమ ఓటుహక్కు వినియోగించుకోవాలని అధికారులు ప్రకటించారు.


అధ్యక్ష బరిలో ఆరుగురు!

ఈసారి ఖమ్మం జిల్లా బార్‌ అసోసియేషన్‌ అధ్యక్ష పదవి బరిలో మొత్తం ఆరుగురు అభ్యర్థులు ఉన్నారు. ప్రభుత్వ న్యాయవాది(జి.పి) దిరిశాల కృష్ణారావుతోపాటు రాజ్‌పుత్‌ సుధీర్‌సింగ్‌, నేరెళ్ల శ్రీనివాసరావు, చిలుకూరి స్వర్ణకుమారి, ఎంఏ.తౌఫీక్‌, మల్లెంపాటి అప్పారావు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అధ్యక్షుడి తర్వాత ప్రధాన కార్యదర్శి పదవి కీలకమైంది. ఈసారి ఈ పదవికి ముగ్గురు అభ్యర్థులు రంగంలోకి దిగినా వ్యక్తిగత కారణాలతో ఒకరు మధ్యలోనే విరమించుకున్నారు. దీంతో మిగిలిన చింతనిప్పు వెంకటేశ్వర్లు, మన్నేపల్లి బస్వయ్య మధ్య పోరు నువ్వా-నేనా అన్నట్లు మారింది. జాయింట్‌ సెక్రటరీ పదవికి అయ్యదేవర విజయరాఘవ, కండె వెంకటేశ్వర్లు పోటీ పడుతుండగా క్రీడలు-సాంస్కృతిక కార్యదర్శి పదవికి పెరుమాళ్లపల్లి జానయ్య, రావుల వెంకటేశ్వర్లు పోటీ చేస్తున్నారు.


నాలుగు పదవులు ఏకగ్రీవం..

ఉపాధ్యక్షుడిగా మాదిరాజు లక్ష్మీనారాయణ, కోశాధికారిగా మిరియాల జ్యోతి ప్రవీణ్‌, లైబ్రరీ సెక్రటరీగా గాజుల అమరనాథ్‌, మహిళా ప్రతినిధిగా కె.వి.వి.లక్ష్మి ఇప్పటికే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల అనంతరం ఈసీ సభ్యులను నియమిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని