logo

పద్యపూరణల్లో రికార్డులు

తాము పాఠశాలల్లో బోధించిన సబ్జెక్టులు వేరైనా తెలుగుపై తరగని అభిమానం పెంచుకున్నారు. కవితలు, వ్యాసాలు రచించారు.

Updated : 31 Mar 2023 06:43 IST

ఇద్దరు విశ్రాంత ఉపాధ్యాయుల ప్రత్యేకత

తాము పాఠశాలల్లో బోధించిన సబ్జెక్టులు వేరైనా తెలుగుపై తరగని అభిమానం పెంచుకున్నారు. కవితలు, వ్యాసాలు రచించారు. మాతృభాషలో పట్టుసాధించి పద్యపూరణల్లో ప్రత్యేకత చాటుతూ పురస్కారాలు పొందుతున్నారు. ఇటీవల వినూత్న పద్ధతిలో పద్యాలలో సమస్యా పూరణలు చేస్తూనే చెరో 108 సమస్యలు పద్య పాదాలుగా కూర్చుకుని వాటిని రెండు శతకాలుగా రాసి పద్య పఠనం చేశారు. దీంతో తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ను సొంతం చేసుకున్నారు సత్తుపల్లికి చెందిన ఇద్దరు విశ్రాంత ఉపాధ్యాయులు ఆర్‌వి.రమణమూర్తి, పీవీఎస్‌ మల్లికార్జునరావులు.. సత్తుపల్లిలో ఇటీవల ఒకేరోజు ఇద్దరు ఆ పురస్కారాలు అందుకున్నారు.

సత్తుపల్లి, న్యూస్‌టుడే


రాయడం అభిరుచిగా ఆరంభమై..
పీవీఎస్‌ మల్లికార్జునరావు

రాయడం అభిరుచిగా ఆరంభమై అలవాటుగా మారిందని పీవీఎస్‌ మల్లికార్జునరావు అన్నారు. సత్తుపల్లి మండలం సదాశివునిపాలెంలో ఉపాధ్యాయుడిగా పని చేస్తూ ఉద్యోగ విరమణ చేసిన ఆయన పద్య రచనతోపాటు కవితలు కూడా రాస్తుంటారు. సాహిత్య కవులు కన్నెగంటి వెంకటయ్య, సత్యనారాయణరెడ్డి, మధుసూదనరాజు, మడుపల్లి భద్రయ్యలు కవిత్వ రచనలో ప్రోత్సహించడంతో పద్య కవిత్వంలో మెలకువలు నేర్చుకున్నారు. రామిశెట్టి మాట అనే శతకాన్ని రచించి పుస్తకాన్ని విడుదల చేసిన ఆయన వినూత్న పద్ధతిలో పద్య పూరణలు చేసి తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ను అందుకున్నారు. పద్య పూరణల శతక పుస్తకంతోపాటు మరికొన్ని కవిత్వాలు, చరణాల పుస్తకాలను త్వరలో ముద్రించనున్నట్లు మల్లికార్జునరావు తెలిపారు. 


వచన కవితలతో మొదలై...
ఆర్‌.వి.రమణమూర్తి

వచన కవితలతో తన ప్రయాణం మొదలై రచనా వ్యాసంగం పద్య కవిని చేసిందని ఆర్‌.వి.రమణమూర్తి తెలిపారు. కిష్టారం ఉన్నత పాఠశాలలో పని చేస్తూ అక్కడే ఉద్యోగ విరమణ చేసిన తనకు తండ్రి కామేశ్వరరావు నుంచే మాతృ భాషాభిమానం సంక్రమించిందని చెప్పారు. హైదరాబాదులోని ఈనాడు జర్నలిజం స్కూల్‌లో అతిథి ఉపన్యాసకులుగా పని చేస్తున్న ప్రముఖ కవి ఎర్రాప్రగడ రామమూర్తి ప్రోత్సాహమే తనలో పద్య కవిత్వం వైపు మళ్లించిందని తెలిపారు. ‘తెలుగువెలుగు’ పుస్తకంలో సమస్యా పూరణ శీర్షికలో పద్యాలు రాసేలా ఆయన ప్రోత్సహించారన్నారు. తర్వాత రేడియోకు కూడా తాను పద్య పూరణలు పంపానని గుర్తు చేశారు. సామాజిక మాధ్యమాల్లో పద్య, కవితా రచనలు చేస్తున్నా.. ఇటీవల సృజన సాహితీ సమాఖ్య ప్రోత్సాహంతో పద్య పూరణల శతక రచన పూర్తి చేసి తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ను అందుకోవడం సంతోషంగా ఉందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని