logo

ఆశలు అడియాసలేనా.. దాతలు స్పందిస్తారా..?

ఆశలు అడియాసలేనా..? దాతలు ఎవరైనా స్పందిస్తారా? అని ఎదురుచూస్తోందీ నిరుపేదల కుటుంబం.

Updated : 31 Mar 2023 06:51 IST

మనోవేదనలో దివ్యాంగురాలి కుటుంబ సభ్యులు  

తల్లి తిరుపతమ్మతో దివ్యాంగురాలు భవానీ

భద్రాచలం పట్టణం, న్యూస్‌టుడే: ఆశలు అడియాసలేనా..? దాతలు ఎవరైనా స్పందిస్తారా? అని ఎదురుచూస్తోందీ నిరుపేదల కుటుంబం. కడు పేదరికంలో సైతం దాతల సహాయంతో ఎంతో కష్టపడి సాధించిన పరీక్ష ఫలితాలు రద్దవడంతో ఆ నిరుపేద దివ్యాంగులైన భవానీ ఎంతో ఆవేదన చెందుతున్నారు. వివరాల్లోకి వెళితే.. భద్రాచలం శాంతినగర్‌ కాలనీలో నివాసం ఉంటున్న బాసిపోగు మల్లయ్య తిరపతమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమార్తె భవానీ దివ్యాంగురాలు. వినికిడి శక్తితో పాటు మాటలు సరిగా రావు. తండ్రి మల్లయ్య కూలి పనులు చేస్తూ, తల్లి తిరుపతమ్మ ఇళ్లలో పనులు చేస్తూ, ఓ దాత దయతో అద్దె లేకుండా ఇచ్చిన ఇంట్లో వారు నివాసం ఉంటూ జీవనం సాగిస్తున్నారు.

* వీరి చిన్న కుమార్తె భవానీ దాతల చేయూతతో కష్టపడి చదివి గ్రూపు-1 పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. 60 శాతం దివ్యాంగురాలైన భవానీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడంతో ఆ నిరుపేద కుటుంబం ఎంతో సంతోషానికి గురైంది. ఏదో ఒక ప్రభుత్వ కొలువు వస్తే తమ కష్టాలు తీరతాయని అంతా భావించారు. ఇటీవల పేపర్‌ లీకేజీ ఘటనలతో ప్రభుత్వం గ్రూపు-1 పరీక్షా ఫలితాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఆ నిరుపేద కుటుంబం కలలు కల్లలుగా మారిపోయాయి. అసలే అంతంత మాత్రంగా ఉండి పూటగడవని ఆ కుటుంబానికి కుమార్తె మళ్లీ మరో సారి పరీక్షలు రాయాలంటే ఆర్థిక భారమే. దీంతో భవానీ కుటుంబం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది. తమ కుటుంబానికి మంచి రోజులు వచ్చాయని భావించిన తరుణంలో తమకు మళ్లీ దేవుడు ఇలాంటి అగ్ని పరీక్షపెట్టాడని వాపోతున్నారు. భవానీ పరీక్షలకు హాజరయ్యేలా ప్రభుత్వం ఆదుకోవాలని, ఆర్థిక సహకారం అందించాలని లేదా దాతలు స్పందించాలని వేడుకుంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని