logo

నువ్వు లేక నేనుండలేను.. భర్త మరణాన్ని జీర్ణించుకోలేక భార్య మృతి

మనుషులు వేరు మనసు ఒకటే.. పరిస్థితులు వేరు ప్రతిస్పందన ఒకటే.. బంధువులు వేరు కానీ బాంధవ్యం ఒక్కటే.

Published : 17 Apr 2023 08:35 IST

శ్యాంపురి భాస్కర్‌రావు,     బాయమ్మ దంపతులు

మనుషులు వేరు మనసు ఒకటే.. పరిస్థితులు వేరు ప్రతిస్పందన ఒకటే.. బంధువులు వేరు కానీ బాంధవ్యం ఒక్కటే. ముఖం చూసినంతనే ఒకరి ఆలోచనల్ని ఇంకొకరు అర్థం చేసుకోవటం.. మాటలో కరకుదనం పరిస్థితుల ప్రభావం అని తమాయించుకోవటం, అర్ధాంతర మౌనం ఒత్తిడి ప్రభావమని భావించటం, జీవించటం.. ఇవన్నీ ఆదర్శ దంపతుల లక్షణాలు. మూడు ముళ్ల బంధం మొదలవగానే భర్త/భార్య, పిల్లలు, కుటుంబాన్ని బంధంగా ఒకరు, బాధ్యతగా ఇంకొకరు జీవితాంతం వారు భావిస్తుంటారు. అన్ని విషయాల్లో ఈ ‘ఏకతా సూత్రం’ దూరం కావటమే ఆధునిక కాలంలో భార్యాభర్తల మధ్య దూరాన్ని పెంచుతోంది. క్షణికావేశం, ‘నేను’ అనే చట్రంలో ఇరుక్కపోవటం, ఎదుటి వ్యక్తి బాధల్ని, భావావేశాల్ని, ఆలోచనల్ని అర్థం చేసుకోకపోవటం ఇలాంటివన్నీ ఇళ్లలో విభేదాల నెగళ్లు రగులుస్తున్నాయి.. తరచూ వెలుగుచూస్తున్న ఇలాంటి వార్తలకు భిన్నంగా పాల్వంచ మండలంలో ఎడబాటును తట్టుకోలేక దంపతులిద్దరూ 24 గంటల వ్యవధిలో కన్నుమూసిన ఘటన వెలుగు చూసింది..

భద్రాద్రి జిల్లా పాల్వంచ పట్టణ పరిధిలోని కరకవాగుకు చెందిన శ్యాంపురి భాస్కర్‌రావు(70), బాయమ్మ(60)లు నాలుగు దశాబ్దాల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కులాలు వేరైనా వారిద్దరూ పెద్దలను ఎదిరించి ఒకటయ్యారు. ఆ బంధాన్ని ఆసాంతం సాగించారు. ఎంతలా అంటే ఒకరిని విడిచి మరొకరు ఉండవారు కాదు. ఎక్కడికెళ్లాలన్నా కలిసే వెళ్లేవారు. వారికి ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి. అందరికీ పెళ్లిళ్లు జరిగాయి. మనవళ్లు, మనవరాళ్లూ ఉన్నారు. కేటీపీఎస్‌లో పనిచేసిన భాస్కర్‌రావు ఉద్యోగ విరమణ అనంతరం పట్టణంలోని నవభారత్‌లో ఇల్లు నిర్మించుకున్నారు. కుటుంబ బాధ్యతలు తీర్చుకున్న వృద్ధ దంపతులిద్దరూ ప్రశాంత జీవనం సాగిస్తున్నారు. వారి అన్యోన్యతను చూడలేని విధికి కన్నుకుట్టిందో ఏమో.. గుండెపోటు రూపాన భార్యాభర్తలిద్దరూ మృత్యుఒడికి చేరారు. శుక్రవారం సాయంత్రం భాస్కర్‌రావుకు పక్షవాతం లక్షణాలు కనిపించడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స తర్వాత అదేరోజు రాత్రి ఇంటికి వచ్చారు. అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో మళ్లీ గుండెపోటు రాగా కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లేలోపు మృతి చెందాడు. చనిపోయే ముందు భార్యను చూడడానికి తాపత్రయపడ్డాడని, కుటుంబ సభ్యులు తెలిపారు.


అన్నపానీయాలు మాని..

భర్త ఎడబాటును తట్టుకోలేని బాయమ్మ రోజంతా విలపించింది. తీవ్రంగా కుంగిపోయింది. మానసిక బాధతో శనివారం అర్ధరాత్రి 1.30 గంటల గుండెపోటుతో మృతి చెందింది. 24 గంటల వ్యవధిలోనే తల్లిదండ్రులు అనంతలోకాలకు చేరడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఆ వృద్ధ దంపతుల అన్యోన్యత తెలిసిన పలువురు కన్నీరుమున్నీరయ్యారు.

పాల్వంచ గ్రామీణం, న్యూస్‌టుడే

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు