logo

అడవి బిడ్డల కష్టాలు తీరేనా..?

భద్రాచలం ఐటీడీఏ పరిధిలో 32 మండలాలు ఉండటం ప్రత్యేకతను సంతరించుకుంది. భద్రాద్రి జిల్లాలోని 23 మండలాలే కాకుండా ములుగు జిల్లా (వాజేడు, వెంకటాపురం), మహబూబాబాద్‌ జిల్లా (గార్ల, బయ్యారం), ఖమ్మం జిల్లా (కామేపల్లి, కారేపల్లి, ఏన్కూరు మండలాలు పూర్తిగాను, సత్తుపల్లి, పెనుబల్లి మండలాలు పాక్షికంగా)లో ఐటీడీఏ పరిధిలోకి వస్తాయి.

Updated : 26 May 2023 06:41 IST

భద్రాచలం, న్యూస్‌టుడే

భద్రాచలం ఐటీడీఏ పరిధిలో 32 మండలాలు ఉండటం ప్రత్యేకతను సంతరించుకుంది. భద్రాద్రి జిల్లాలోని 23 మండలాలే కాకుండా ములుగు జిల్లా (వాజేడు, వెంకటాపురం), మహబూబాబాద్‌ జిల్లా (గార్ల, బయ్యారం), ఖమ్మం జిల్లా (కామేపల్లి, కారేపల్లి, ఏన్కూరు మండలాలు పూర్తిగాను, సత్తుపల్లి, పెనుబల్లి మండలాలు పాక్షికంగా)లో ఐటీడీఏ పరిధిలోకి వస్తాయి. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ వంటి వారు గిరిజనులతో మమేకమవుతున్నారు. ఆచార, సంప్రదాయాలు తెలుసుకుని అడవి బిడ్డల కష్టాలు వింటున్నారు. ఈపరిస్థితుల్లో పీఓలు కార్యాలయానికి పరిమితం కాకుండా అన్ని మండలాలను సందర్శించాల్సి వస్తోంది. ప్రాజెక్ట్‌ అధికారులుగా విధులు నిర్వర్తించే ఐఏఎస్‌లు దీన్ని భారంగా భావించనప్పటికీ నాలుగు జిల్లాల్లో క్షేత్ర పర్యటనలు చేయటం ఆషామాషీ కాదని విశ్లేషకులు చెబుతున్నారు. పైగా ప్రతి సోమవారం దర్బారులో పీఓ ఉండాలి.

ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని వేడుకోలు

తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాలకు ఏర్పాట్లు   జరుగుతున్నాయి. పాలనా ఫలాలు అట్టడుగున ఉన్నవారికీ అందాలనే లక్ష్యంతో రాష్ట్రంలోని పది జిల్లాలను 33 జిల్లాలుగా మార్చారు. గ్రామపంచాయతీల సంఖ్య పెరిగింది. మండలాలను విభజించారు. ఐటీడీఏల విభజన అంశం కేంద్రం పరిధిలో ఉండటంతో దీని జోలికి ఎవరూ పోవడం లేదు. సంబంధిత ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చొరవ చూపాలని గిరిజనులు కోరుతున్నారు. జడ్పీ సమావేశాలపై ఉన్న ఆసక్తిని ఐటీడీఏ సమీక్షలపైనా కనబరచాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఐటీడీఏని  విభజిస్తే..

* రాష్ట్రంలో భద్రాచలం, మన్ననూరు, ఉట్నూరు, ఏటూరు నాగారం ఐటీడీఏలు గిరిజనులకు సేవలందిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా గిరిజనులు 31.77 లక్షల మంది నివసిస్తుండగా భద్రాద్రి జిల్లాలో 3.53 లక్షల మంది గిరిజనులున్నారు.

* నాలుగు జిల్లాలను పరిగణనలోకి తీసుకుంటే గిరిజనుల శాతం పెరుగుతుంది. ఇంతమందిపై ఐటీడీఏ ప్రత్యేక శ్రద్ధ చూపాలి. సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించాలి. రెండు దశాబ్దాల చరిత్ర కలిగిన గిరిజన బీఈడీ కళాశాలకు ప్రిన్సిపల్‌ పోస్టును రెగ్యులర్‌ పద్ధతిలో భర్తీ చేయడం లేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. పలు కీలక హోదాలు ఇన్‌ఛార్జిలతో కొనసాగుతున్నాయి.

* ములుగు జిల్లాలో కలిసిన వెంకటాపురం గిరిజనులు ఐటీడీఏ పథకాలకు భద్రాచలం రావాలంటే అవస్థలు పడుతున్నారు. అక్కడి అధికారుల ద్వారా దరఖాస్తు చేసుకుంటున్నారు. కొన్ని పథకాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రాతిపదికనే మంజూరవుతున్నాయి. ఈనేపథ్యంలో 32 మండలాల పరిధి వల్ల ఒనగూరే ప్రయోజనం   ఏంటన్నది అంతుచిక్కడం లేదు.

* కొవిడ్‌ ఉద్ధృతి, గోదావరి వరదల తరుణంలో వివిధ ఆదివాసీ ఆవాస ప్రాంతాలు దెబ్బతిన్నాయి. బాధితులను ఉన్నతాధికారులు సకాలంలో పరామర్శించలేదన్న ఆరోపణలున్నాయి.

* ఏజెన్సీ మండలాలు తక్కువ కలిగిన జిల్లాలో మినీ ఐటీడీఏలను ఏర్పాటు చేయవచ్చుననే ప్రతిపాదనలు ఉన్నప్పటికీ కార్యరూపం దాల్చటం లేదు. ఐటీడీఏల విభజన అసాధ్యమనుకుంటే ఆ స్థాయిలో నిధులు, విధులు ఉండేలా పర్యవేక్షణ సాగాలని గిరిజనులు కోరుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు