logo

జిల్లాలో తిరుగులేని శక్తిగా భారాస: మంత్రి

జిల్లాలో భారాస తిరుగులేని శక్తిగా ఎదిగిందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. సీఎం కేసీఆర్‌ హయాంలో చరిత్రలో ఎన్నడూ ఎరుగని అభివృద్ధిని తొమ్మిదేళ్లలో సాధించామని పేర్కొన్నారు.

Published : 01 Jun 2023 03:01 IST

చిమ్మపూడి సభలో బీమా చెక్కు అందజేస్తున్న మంత్రి అజయ్‌కుమార్‌

రఘునాథపాలెం, న్యూస్‌టుడే: జిల్లాలో భారాస తిరుగులేని శక్తిగా ఎదిగిందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. సీఎం కేసీఆర్‌ హయాంలో చరిత్రలో ఎన్నడూ ఎరుగని అభివృద్ధిని తొమ్మిదేళ్లలో సాధించామని పేర్కొన్నారు. చిమ్మపూడిలో బుధవారం నిర్వహించిన భారాస ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి మాట్లాడారు. గత ఎన్నికల్లో ఐదు సీట్లు తీసుకుని ఒక్కటంటే ఒక్కటి గెలిపించుకోలేకపోయిన వ్యక్తి కేసీఆర్‌ను గద్దె దించుతామని ఉత్తర కుమార ప్రగల్బాలు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు. ఖమ్మం ప్రజల ఆత్మాభిమానాన్ని డబ్బుతో కొనలేరని, అభివృద్ధి చేస్తే అభిమానం గుండెల్లోనుంచి వస్తుందన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో భాజపాకు స్థానం లేదని, కాంగ్రెస్‌కు రాష్ట్రంలో 60కి పైగా సీట్లలో పోటీ చేసేందుకు అభ్యర్థులు కరవయ్యారన్నారు. కర్ణాటకలో భాజపా విఫలం కావడంతో ప్రత్యామ్నాయం లేక కాంగ్రెస్‌ను ఆదరించారే తప్ప మరొకటి కాదన్నారు. జిల్లాలో భాజపాకు కనీసం డిపాజిట్ కూడా దక్కదని జోస్యం చెప్పారు. ప్రధానిగా రెండుసార్లు కరెన్సీ నోట్లు రద్దుపరచి మోదీ చరిత్ర సృష్టించారని ఎద్దేవా చేశారు. ఎన్నికలకు కేవలం ఐదు నెలల సమయం ఉందని, గ్రామాల్లో నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేసి పార్టీ విజయానికి పాటుపడాలని పిలుపునిచ్చారు. ఖమ్మం నియోజకవర్గంలో గెలుపు నల్లేరు మీద నడకేనని, ఉమ్మడి జిల్లాలోని మిగిలిన తొమ్మిది స్థానాల్లోనూ భారాసను గెలిపించుకోవాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. భారాసకు అతిపెద్ద సైన్యం ఉందని, వచ్చే ఎన్నికల్లో సత్తా చూపించాలని కోరారు. అంతకుముందు ఎద్దుల బండిపై గ్రామంలో ఊరేగారు. కోలాట బృందం నృత్యాలు ఆకట్టుకున్నాయి. భారాస కార్యకర్తలు ఇద్దరు ఇటీవల మృతి చెందగా బాధిత కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున బీమా చెక్కులను మంత్రి అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ భూక్యా గౌరి, వైస్‌ ఎంపీపీ గుత్తా రవికుమార్‌, భారాస మండల అధ్యక్షుడు అజ్మీరా ఈరూనాయక్‌, ఏఎంసీ మాజీ ఛైర్మన్‌ మద్దినేని వెంకటరమణ, ఆత్మ ఛైర్మన్‌ భూక్యా లక్ష్మణ్‌నాయక్‌, కుర్రా భాస్కరరావు, పిన్ని కోటేశ్వరరావు, కొంటెముక్కల వెంకటేశ్వర్లు, మాదంశెట్టి హరిప్రసాద్‌, గొర్రె కృష్ణవేణి, కొర్లపాటి రామారావు, దొంతు సత్యనారాయణ, గొర్రె శ్రీనివాసరావు, చెన్నబోయిన సైదులు, ఉయ్యూరు వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని