logo

పోక్సో కేసులో... బాధిత కుటుంబాలకు సత్వర న్యాయం

 జిల్లాలో పోక్సో కోర్టు ఏర్పాటుతో ఆయా కేసుల సత్వర పరిష్కారానికి మార్గం సుగమమైంది. కొత్తగూడెంలో ఇన్‌ఛార్జి న్యాయమూర్తి స్థానంలో ప్రత్యేక సేవలు 2016 నుంచి తొలుత అందుబాటులోకి తెచ్చారు.

Published : 01 Jun 2023 03:29 IST

కొత్తగూడెం న్యాయవిభాగం, న్యూస్‌టుడే: జిల్లాలో పోక్సో కోర్టు ఏర్పాటుతో ఆయా కేసుల సత్వర పరిష్కారానికి మార్గం సుగమమైంది. కొత్తగూడెంలో ఇన్‌ఛార్జి న్యాయమూర్తి స్థానంలో ప్రత్యేక సేవలు 2016 నుంచి తొలుత అందుబాటులోకి తెచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 2021 మార్చిలో సుప్రీంకోర్టు ఆదేశాలతో ‘గూడెం’లోనూ పూర్తిస్థాయిలో పోక్సో కోర్టు ప్రారంభమైంది.  బాలికలపై అఘాయిత్యాలు పెరిగిపోతుండటంతో పోలీసుల సైతం కేసులు పటిష్ఠంగా నమోదు చేసి, న్యాయాధికారుల సహాయంతో అన్ని ఆధారాలను న్యాయస్థానానికి పకడ్బందీగా సమర్పిస్తున్నారు. మహిళా  వాలంటీర్ల ఆధ్వర్యంలో బాధితుల్లో ఆత్మస్థైర్యాన్ని పెంచుతూ నిందితులకు శిక్ష పడటంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. కోర్టు ఏర్పాటైన తర్వాత జిల్లాలోని పలు కేసుల్లో సత్వరమే సంచలన తీర్పులు వెలువడ్డాయి. ‘సత్వర శిక్ష’ పడుతుందనే భయం నేర ప్రవృత్తి ఉన్నవారిలో మార్పునకు కారణమవుతోందని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. బాలికలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తల్లిదండ్రులు, కుటుంబీకులు, విద్యాలయాల్లో సందర్భోచితంగా వివరించాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. ఎవరు? ఎలా ప్రవర్తిస్తారనే విషయాలపై కిశోర బాలికలకు అవగాహన తప్పనిసరి అని చెబుతున్నారు. బయటకు వెళ్లిన సందర్భాల్లో ఎలా నడుచుకోవాలో తెలియజెప్పాలని.. ఏ విషయం జరిగినా కన్నవాళ్లతో పంచుకోవాలనే ఆలోచన కలగజేయాలని సూచిస్తున్నారు. తెలిసిన వాళ్లు నమ్మించి నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకెళ్లినప్పుడు ఎలా స్పందించాలి? అక్కడ్నుంచి సమయస్ఫూర్తితో ఎలా బయటపడాలి? సమీప వ్యక్తుల సహాయాన్ని ఎలా పొందాలో అవగాహన కల్పించాలని చెబుతున్నారు.

ప్రత్యేక కోర్టుకు కేసులు (మే, 2021 నుంచి..)
కోర్టుకు వచ్చినవి: 148
ఇప్పటి వరకు తీర్పువెలువరించినవి: 115
విచారణ, పలు దశల్లో ఉన్నవి: 33


శిక్షలు పడిన కేసుల వివరాలు

* 2019లో కొత్తగూడెం ఒకటో పట్టణ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నమోదైన కేసులో 40 ఏళ్ల వ్యక్తికి పాతికేళ్ల జైలు శిక్ష, రూ.13 వేల జరిమానా విధించారు.

* 2018లో దుమ్ముగూడెం పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన మరో కేసులో 38 ఏళ్ల ముద్దాయికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష పడింది.

* 2016లో ఏడూళ్లబయ్యారం స్టేషన్‌ పరిధిలో నమోదైన కేసులో ముగ్గురు ముద్దాయిలకు 20 ఏళ్ల చొప్పున జైలు శిక్ష ఖరారైంది.  

* లక్ష్మీదేవిపల్లి మండలంలో పలువురు బాలికలపై అఘాయిత్యానికి పాల్పడి, వారి అనారోగ్యానికి కారణమైన ఓ కీచక ఉపాధ్యాయుడిపై ‘కొత్తగూడెం’ ప్రత్యేక పోక్సో కోర్టు తొలిసారి సంచలన తీర్పు వెలువరించింది. 2021 ఆగస్టు 27న న్యాయమూర్తి తీర్పునిస్తూ.. ముద్దాయికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.10 వేల జరిమానా విధించారు.

* ఆళ్లపల్లి మండలానికి చెందిన మరో ముద్దాయికి 20 ఏళ్ల జైలుశిక్ష, రూ.30 వేల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. ఓ గ్రామానికి చెందిన బాలిక(15)ను స్థానిక యువకుడు ప్రేమ పేరిట శారీరకంగా లోబర్చుకున్నాడు. పెళ్లి చేసుకోవాలని అడగడంతో అందుకు నిరాకరించాడు. మానసిక ఆవేదనతో ఆ బాలిక 2020 సెప్టెంబరు 23న ఇంట్లో పురుగు మందుతాగింది. అదే ఏడాది అక్టోబరులో చికిత్స  పొందుతూ మృతిచెందింది. పోలీసులు పక్కా ఆధారాలతో ఛార్జిషీట్‌ దాఖలు చేయగా    న్యాయస్థానం వేగంగా తీర్పునిచ్చింది.


పోక్సో కేసుల్లో ఎక్కువ శాతం మంది నిందితులు పరిచయస్థులే కావడం గమనార్హం. పిల్లల పట్ల తెలిసిన వారి ప్రవర్తన ఎలా ఉంటోందో తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలి. ఎంత దగ్గరివారైనా ఓ కంట కనిపెట్టాల్సిందే. ఎదుటి వ్యక్తుల్లోని దురాలోచనలు ఎలా పసిగట్టాలనే విషయాలపై బాలికలకు పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. ఒకవేళ అనర్థం జరిగితే భయపడకుండా వెంటనే చైల్డ్‌లైన్‌, స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయాలి. వారి సహాయం తీసుకోవాలి. ప్రేమ అనే ఆకర్షణతో ఇద్దరు మైనర్లు ఒక్కటైనా అది చట్టప్రకారం చెల్లదు. ఏమాత్రం తేడా వచ్చినా ఇద్దరి జీవితాలు అంధకారం అవుతాయి. పోక్సో కేసుల్లో 20 ఏళ్లకు తగ్గకుండా కఠిన శిక్షలు విధించే అవకాశం ఉంది.

పీవీడీ లక్ష్మి, అడిషనల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌, పోక్సో కోర్టు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని