logo

పల్లెపల్లెన.. ప్రగతి చాటేలా..

తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాలను వైభవోపేతంగా నిర్వహించేందుకు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. జూన్‌ 2 నుంచి 21 రోజుల పాటు వేడుకలు జరిపేందుకు కార్యాచరణ రూపొందించింది.

Published : 01 Jun 2023 03:31 IST

రేపటి నుంచి తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాలు

ఈటీవీ- ఖమ్మం, న్యూస్‌టుడే, ఖమ్మం వ్యవసాయం: తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాలను వైభవోపేతంగా నిర్వహించేందుకు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. జూన్‌ 2 నుంచి 21 రోజుల పాటు వేడుకలు జరిపేందుకు కార్యాచరణ రూపొందించింది. పల్లె నుంచి జిల్లా స్థాయి వరకు పొరపాట్లకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు గడిచిన తొమ్మిదేళ్లలో ప్రభుత్వం అమలుపరుస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించనున్నారు.

నాడు- నేడు.. అభివృద్ధిని చూడు..

రైతు, విద్యుత్తు, పారిశ్రామిక, సాగునీరు, సంక్షేమం, పరిపాలన, సాహిత్యం, ఆధ్యాత్మికం, వైద్యారోగ్యం, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, తదితర రంగాల్లో గడిచిన తొమ్మిదేళ్లలో సాధించిన ప్రగతిని ఊరూరా చాటిచెప్పేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. జిల్లాల వారీగా ప్రగతి నివేదికలు విడుదల చేయడంతోపాటు పల్లెల వారీగా ప్రభుత్వం చేసిన అభివృద్ధిని గ్రామసభలు, సమావేశాల ద్వారా చాటిచెప్పనుంది. రాష్ట్రావతరణకు ముందు, ఆతర్వాత పరిస్థితులను కళ్లకు కట్టేలా వివరించనుంది. ఇప్పటికే ఆత్మీయ సమ్మేళనాల పేరిట మూడు నెలలుగా అధికార పార్టీ నాయకులు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రైతులతో చెరువు కట్టలపై సహపంక్తి భోజనాలు చేయనున్నారు.

3న రైతు వేదికల్లో వేడుకలు

జూన్‌ 3న ’రైతు దినోత్సవాన్ని’ రైతు వేదికల్లో అట్టహాసంగా నిర్వహించనున్నారు. ఆయా పంచాయతీ కార్యాలయాల నుంచి ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లను అలంకరించుకొని డీజే శబ్దాలతో రైతువేదికల వరకు ర్యాలీగా వెళ్లనున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. వ్యవసాయంలో రాణిస్తున్న ముగ్గురు చొప్పున కర్షకులను రైతువేదికల్లో సన్మానిస్తారు. వారితో విజయగాథలు చెప్పిస్తారు. వేడుకలకు హాజరైన రైతులకు అధికారులు భోజనం సమకూరుస్తారు.

ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్‌ రేగా  

కొత్తగూడెం కలెక్టరేట్: కొత్తగూడెంలో జూన్‌ 2న ప్రారంభమయ్యే రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్‌ రేగా కాంతారావు హాజరవుతారని కలెక్టర్‌ అనుదీప్‌  తెలిపారు. శుక్రవారం ఉదయం 8.30 గంటలకు కొత్తగూడెం ప్రగతి మైదానంలో అమర వీరుల స్తూపం వద్ద నివాళి అర్పిస్తారన్నారు. అక్కడ్నుంచి కలెక్టరేట్‌కు చేరుకుని ఉదయం 9.00 గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారని తెలిపారు. గ్రామాలు, పట్టణాల్లోని కూడళ్లను విద్యుద్దీపాలతో అలంకరించి వేడుకలు ఘనంగా నిర్వహించాలని అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు.  


ఉభయ జిల్లాల్లో దశాబ్ది ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తాం. పల్లె నుంచి జిల్లా వరకు తొమ్మిదేళ్లలో జరిగిన అభివృద్ధిని తెలియజేస్తాం. భారాస శ్రమ, సీఎం కేసీఆర్‌ దార్శనికతతోనే దేశానికి ఆదర్శంగా రాష్ట్రం నిలుస్తోంది. అదేమాదిరిగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల రూపురేఖలను మార్చగలిగాం.

పువ్వాడ అజయ్‌కుమార్‌, రవాణా శాఖ మంత్రి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని