logo

రాష్ట్రావతరణ దశాబ్ది వేడుకల ఏర్పాట్ల పరిశీలన

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణకు కలెక్టరేట్‌ ముస్తాబైంది. ఏర్పాట్లను కలెక్టర్‌ అనుదీప్‌ గురువారం పరిశీలించారు.

Published : 02 Jun 2023 04:08 IST

కలెక్టరేట్‌లో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న కలెక్టర్‌ అనుదీప్‌, అధికారులు

కొత్తగూడెం కలెక్టరేట్, న్యూస్‌టుడే: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణకు కలెక్టరేట్‌ ముస్తాబైంది. ఏర్పాట్లను కలెక్టర్‌ అనుదీప్‌ గురువారం పరిశీలించారు. శుక్రవారం ప్రారంభ వేడుకలకు ప్రభుత్వ విప్‌ రేగా కాంతారావు ముఖ్య అతిథిగా హాజరవుతారని పేర్కొన్నారు. ఉదయం 8.30 గంటలకు ప్రగతి మైదానంలో అమరవీరుల స్తూపం వద్ద నివాళి అర్పించిన అనంతరం కలెక్టరేట్‌కు చేరుకొని.. 9 గంటలకు జాతీయ పతాకం ఎగురవేస్తారన్నారు. అనంతరం జిల్లా ప్రగతి నివేదిక సమర్పిస్తారన్నారు. డీఆర్వో అశోక చక్రవర్తి, ఏఓ గన్యా, జిల్లా ఉపాధి కల్పనాధికారి విజేత పాల్గొన్నారు.

రైతు వేదికల్లో పండుగ వాతావరణం ఉట్టిపడాలి

కొత్తగూడెం కలెక్టరేట్: రైతు వేదికలను మామిడి తోరణాలు, విద్యుత్తు దీపాలతో అలంకరించాలని, పండుగ వాతావరణం ఉట్టిపడేలా తీర్చిదిద్దాలని కలెక్టర్‌ అనుదీప్‌ ఆదేశించారు. రైతు దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించాలన్నారు. కలెక్టరేట్‌ నుంచి వివిధ శాఖల అధికారులతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అధిక దిగుబడులు సాధించిన రైతులను సన్మానించేందుకు జాబితా సిద్ధం చేయాలని సూచించారు. సామూహిక భోజనాలకు ఏర్పాట్లు చేయాలన్నారు. జూన్‌ 8న జరిగే ‘ఊరూరా చెరువుల పండగ’ ఏర్పాట్ల గురించి జలవనరుల శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. మహిళలు బతుకమ్మలతో వస్తారని, నిమజ్జన కార్యక్రమంలో ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. 4న జిల్లాలోని సంక్షేమ శాఖ అధికారులతో సమీక్ష ఉంటుందన్నారు. దశాబ్ది వేడుకల్లో లోటుపాట్లు లేకుండా చూసుకోవాలన్నారు. అదనపు కలెక్టర్‌ కె.వెంకటేశ్వర్లు, అధికారులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ అనుదీప్‌ బాధ్యతలు చేపట్టి రెండేళ్లు  

కొత్తగూడెం కలెక్టరేట్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తిచేసుకున్న దురిశెట్టి అనుదీప్‌నకు కార్యాలయ అధికారులు, సిబ్బంది పుష్పగుచ్ఛం అందించి గురువారం శుభాకాంక్షలు తెలిపారు.  కార్యక్రమంలో డీఆర్వో అశోక చక్రవర్తి, ఏఓ గన్యా, ఎన్నిక విభాగం పర్యవేక్షకులు సురేష్‌, కలెక్టరేట్‌ అధికారులు శ్రీనివాసరావు, రాజేంద్రప్రసాద్‌, అనంత రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనుదీప్‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను అధికారులు, సిబ్బంది ఘనంగా నిర్వహించాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని