logo

కష్టానికి విజయం దాసోహం

‘మహారాష్ట్రలోని షోలాపూర్‌కు వంద కిలోమీటర్ల దూరంలో మిరే గ్రామం మాది... జనాభా 900 మంది. నేను అక్కడే పుట్టి పెరిగా. పాఠశాల మా ఊరికి 10 కిలోమీటర్ల దూరంలోని ఆమ్లస్‌లో ఉండేది.

Updated : 03 Jun 2023 06:26 IST

భారత మహిళా క్రికెటర్‌ కిరణ్‌ప్రభు నవ్గిరె

‘మహారాష్ట్రలోని షోలాపూర్‌కు వంద కిలోమీటర్ల దూరంలో మిరే గ్రామం మాది... జనాభా 900 మంది. నేను అక్కడే పుట్టి పెరిగా. పాఠశాల మా ఊరికి 10 కిలోమీటర్ల దూరంలోని ఆమ్లస్‌లో ఉండేది. చదువు కోసం రోజూ రానూపోనూ 20 కిలో మీటర్లు సైకిల్‌పై ప్రయాణించాను. శ్రమించడం చిన్నతనం నుంచే అలవాటైంది. శ్రమ, సాధనలే నన్ను భారత క్రికెట్‌ జట్టులో నిలబెట్టాయి’ అని మహిళా క్రికెటర్‌ కిరణ్‌ ప్రభు నవ్గిరె చెప్పారు. ఖమ్మంలో జరుగుతున్న టీ-20 మహిళా క్రికెటర్ల ఆహ్వానం మేరకు ఖమ్మం నగరానికి వచ్చారు. ఈ సందర్భంగా ‘న్యూస్‌టుడే’తో శుక్రవారం కాసేపు ముచ్చటించింది. ఆ వివరాలు మీ కోసం..

న్యూస్‌టుడే: పలు అంతర్జాతీయ మ్యాచులు, ముఖ్యంగా ఆసియా కప్‌లో మన జట్టులో కీలకంగా వ్యవహరించారు. ఓపెనర్‌, ఆల్‌ రౌండర్‌గా పేరుంది. మీ క్రికెట్‌ ప్రస్థానం ఎలా మొదలైంది?

కిరణ్‌: మాది సాధారణ వ్యవసాయ కుటుంబం. ఏ అవసరం వచ్చినా 20 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. పాఠశాల దశ నుంచి ఆరేళ్ల కిందటి వరకు నేను ఓ అథ్లెట్‌ను.. జాతీయ పతకాలు సాధించా. నన్ను అంతర్జాతీయ అథ్లెట్‌గా చూడాలన్నది నా తండ్రి కల. అందుకు దగ్గరగానే వచ్చాను. మా అమ్మ నన్ను క్రికెట్‌ వైపు ఎందుకు వెళ్లకూడదు.. ఇటీవల నువ్వు సరదాగా ఆడిన మ్యాచుల్లో బాగా ప్రతిభ చూపించావని ప్రోత్సహించింది. శిక్షణ కోసం పుణే వచ్చా. తర్వాత మ్యాచులు ఆడా. అప్పుడే నాగాలాండ్‌లో మహిళా క్రికెటర్‌ కావాలనే ప్రకటన చూసి అక్కడికి వెళ్లాను. మొదటి మ్యాచ్‌లోనే 160 పరుగులు చేశాను. ఆ రాష్ట్ర క్రికెట్‌ చరిత్రలో అదే రికార్డ్‌ అయింది. అక్కడి ప్రదర్శన బీసీసీఐ దృష్టికి వెళ్లింది. ఆనాటి నుంచి ఇక వెనుదిరిగి చూడలేదు.

న్యూ: క్రికెట్‌ శిక్షణ ఎలా ఉంటుంది. క్రీడాకారుల ఆహారపు నియమాలు చెప్పండి.

కిరణ్‌:ఉదయం 4 గంటల నుంచి సెషన్‌ ప్రారంభం అవుతుంది. ముందుగా గంటన్నర యోగా, తర్వాత ధ్యానం చేయాలి. కొద్ది విరామం తర్వాత మైదానంలో కసరత్తులు ఉంటాయి. ట్రైనర్‌ సమక్షంలో 3 గంటలు సాధన చేస్తాం. అల్పాహారంలో ఉడికించిన గుడ్లు, ఇడ్లీ, బ్రెడ్‌, సలాడ్స్‌, పాలు ఉంటాయి. మధ్యాహ్న విరామం తర్వాత భోజనంలో ఉడకబెట్టిన చికెన్‌, పప్పు, ఆకుకూరలు, అన్నం, రొట్టెలు, సాయంత్రం జ్యూస్‌, బిస్కెట్లు, రాత్రికి ఇవే ఉంటాయి. నేను మాత్రం జొన్నరొట్టెలు, పసుపు కలిపిన పాలు తీసుకున్నాను. సాయంత్రం 4 గంటల నుంచి నెట్స్‌లో సాధన చేయిస్తారు. మైదానంలో పరుగు సాధన ఉంటుంది.

న్యూ: నేటితరం యువత ఆర్థికంగా త్వరగా స్థిరపడేందుకు క్రికెట్‌ను ఎంచుకుంటున్నారు. మరి మీరు?

కిరణ్‌:డబ్బు ఒకటే కాదు పేరూ వస్తుంది. డబ్బు కోసం నేను క్రికెట్‌ను ఎంచుకోలేదు. నేను పడిన కష్టానికి క్రికెట్లో మంచి ఫలితం వచ్చింది. ఏదో మారుమూల గ్రామాల్లో సైకిల్‌పై తిరిగే నేను, ఖరీదైన బైకులు, కార్లు కొన్నాను. కొద్దిపాటి వ్యవసాయంపై ఆధారపడిన నా కుటుంబానికి ఇప్పుడక్కడ ఎంతో పేరు. ఇదంతా క్రికెట్‌ ఇచ్చిందే కదా.

న్యూ: బాలికలకు మీరు చెప్పే క్రికెట్‌ పాఠాలు ఏమైనా ఉన్నాయా?

కిరణ్‌:నేను ఒక్కటే చెబుతాను. శారీరక కష్టానికి అలవాటు పడండి. మేము బాలికలం, మహిళలం, సున్నితం, తెరచాటునే ఉంటాము అంటే మీ జీవితం తెరచాటునే ముగిసిపోతుంది. ముందుకు రండి. వచ్చిన వారికే విజయాలు వరిస్తాయి. నేను ఓ మైనార్టీ కళాశాలలో శిక్షణ ఇచ్చిన సందర్భంలో అక్కడి బాలికలు, మహిళలు హిజబ్‌ ధరించి క్రికెట్‌ ఆడేందుకు ముందుకు వచ్చారు. అంతెందుకు నేను పుట్టిన ఊరిలో ఇప్పుడు వందమంది బాలికలు మైదానాలకు వచ్చి సాధన చేస్తున్నారు. నా ప్రేరణతో మా ఊరు ఆలోచనే మారింది.

న్యూ: క్రికెట్‌లో రాణించాలంటే ముఖ్యంగా బాలికలు ఏ   వయస్సులో సాధన మొదలుపెట్టాలి?

కిరణ్‌:ఏవయస్సులోనైనా సాధన మొదలు పెట్టొచ్చు. తమపై తమకు నమ్మకం ఉండాలి. నేను నా 20 ఏట క్రికెట్‌ సాధన మొదలుపెట్టా. చిన్ననాటి నుంచి శారీరక దృఢత్వం ఉంది. అది ఎంతో ఉపకరించింది. మూడేళ్ల వ్యవధిలో భారత జట్టులోకి వచ్చా. అంతకుముందు నాగాలాండ్‌, మహారాష్ట్ర, యూపీ ఐపీఎల్‌ జట్లకు ఆడాను. పీఈటీ కావాలనుకొని బీపీఈడీలో చేరాక అక్కడ క్రికెట్‌కు చేరవయ్యాను. మహారాష్ట్రలోని ఓ మైనార్టీ కళాశాలలో శిక్షకురాలిగా పనిచేశాను.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని