logo

స్వర్ణ కవచాల అలంకారంలో రామయ్య దర్శనం

భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి ఆలయంలో శుక్రవారం స్వర్ణ కవచాలంకారంలో దేవదేవుడు దర్శనమిచ్చాడు. ఈ రూపంలో ఉన్న అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడికి అర్చకులు సుప్రభాతం పలికి ఆరాధించారు.

Published : 03 Jun 2023 03:32 IST

జెండాకు వందనం చేస్తున్న ఈఓ రమాదేవి తదితరులు

భద్రాచలం, న్యూస్‌టుడే: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి ఆలయంలో శుక్రవారం స్వర్ణ కవచాలంకారంలో దేవదేవుడు దర్శనమిచ్చాడు. ఈ రూపంలో ఉన్న అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడికి అర్చకులు సుప్రభాతం పలికి ఆరాధించారు. క్షేత్ర విశిష్టతను ప్రవచనం చేసిన తీరు మంత్రముగ్ధులను చేసింది. వైష్ణవ సంప్రదాయంలో విష్వక్సేన పూజ పుణ్యాహ వాచనం నిర్వహించారు. మాంగళ్య ధారణ తలంబ్రాల వేడుక సంతోషాన్ని చాటింది. దర్బారు సేవ తన్మయత్వాన్ని నింపింది. ఐదు రోజులపాటు సాగిన శ్రీ నమ్మాళ్వార్‌ తిరు నక్షత్ర ఉత్సవాలను ఘనంగా ముగించి స్నపన తిరుమంజనం విశేష భోగ నివేదన చేశారు. జ్యేష్ఠాభిషేకం పూజలకు నేడు అంకురార్పణ చేస్తారు. 4న జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా అభిషేకం ఉంటుంది. ఈ సందర్భంగా నిత్య కల్యాణం పవళింపు సేవ ఉండదు.

ఘనంగా సంధ్యా హారతి: భద్రాచలం, న్యూస్‌టుడే: భద్రాచలం రామాలయంలో శుక్రవారం సంధ్యా హారతి పూజ ఘనంగా నిర్వహించారు. ధూపదీపాలను సమర్పించారు. అర్చన చేస్తు నామాలను పఠించారు. హారతులను అందించి వాటి విశిష్టతను ప్రవచనం చేశారు. వారానికి ఒకసారి నిర్వహించే ఉత్సవంలో భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సాయంత్రం సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. ప్రముఖ కళాకారులు ఆలపించిన కీర్తనలు అలరించాయి. భక్తులకు బెల్లం పొంగలి ప్రసాదాన్ని ఉచితంగా అందించారు.

* రాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకుని బంగారు పుష్పాల పూజ సుదర్శన హోమం నిర్వహించారు. దేశం సుభిక్షంగా ఉండాలని ఈ క్రతువును వైదిక పెద్దలు భక్తిశ్రద్ధలతో కొనసాగించారు. రామాలయ కార్యాలయాన్ని నిర్వహిస్తున్న తానీషా కల్యాణ మండపం వద్ద జాతీయ జెండాను ఈవో రమాదేవి ఎగుర వేశారు. తెలంగాణ ఆవిర్భావానికి సంబంధించిన విశేషాలను వివరించారు. నాయకుల చిత్ర పటాలను పూజించి నివాళులు అర్పించారు. పనితీరులో ప్రతిభ కనబర్చిన సిబ్బందికి ప్రశంసా పత్రాలను అందించి అభినందించారు. ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని