logo

రైతు సంక్షేమానికి పెద్దపీట

రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని కలెక్టర్‌ అనుదీప్‌ అన్నారు.

Published : 04 Jun 2023 02:23 IST

మాట్లాడుతున్న కలెక్టర్‌ అనుదీప్‌, పక్కన ఎమ్మెల్యే వనమా, కంచర్ల తదితరులు

కొత్తగూడెం కలెక్టరేట్, న్యూస్‌టుడే: రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని కలెక్టర్‌ అనుదీప్‌ అన్నారు. రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా లక్ష్మీదేవిపల్లి మండలం లోతువాగులో శనివారం నిర్వహించిన రైతు దినోత్సవానికి కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుతో కలిసి కలెక్టర్‌ హాజరయ్యారు. స్థానిక రైతు వేదికలో జరిగిన వేడుకలో కలెక్టర్‌ మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్ని లాభదాయకంగా మార్చేందుకు ప్రభుత్వం జిల్లాలో సీతమ్మసాగర్‌, సీతారామ ఎత్తిపోతల పథకాలు నిర్మిస్తోందన్నారు. తద్వారా లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. అన్నదాతలు ఆయిల్‌పాం, కోకో వంటి వాణిజ్య పంటలు సాగు చేసేందుకు ముందుకు రావాలని సూచించారు. తొమ్మిదేళ్ల భారాస పాలనలో అన్నదాతలు ఎంతో సంతోషంగా ఉన్నారని ఎమ్మెల్యే వనమా అన్నారు. రైతు పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వమే గిట్టుబాటు ధర చెల్లించి కొనుగోలు చేస్తోందన్నారు. ‘రైతుబంధు’, ‘రైతు బీమా’ పథకాలతో అన్నదాతల కుటుంబానికి భరోసా కల్పించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం అందించే వ్యవసాయ రాయితీలు, యంత్ర పరికరాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఉత్తమ రైతులను కలెక్టర్‌ అనుదీప్‌, ఎమ్మెల్యే వనమా సన్మానించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు రైతులతో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. అంతకు ముందు వేడుకలకు పలు గ్రామాల నుంచి అన్నదాతలు ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లపై వేదికకు ర్యాలీగా తరలివచ్చారు. లక్ష్మీదేవిపల్లి ఎంపీపీ భూక్యా సోనా, జడ్పీ వైస్‌ ఛైర్మన్‌ కంచర్ల చంద్రశేఖర్‌రావు, అన్వర్‌పాషా, జక్కుల సుందర్‌, తాటి పద్మ, ప్రజాప్రతినిధులు, కార్యదర్శులు పాల్గొన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు