logo

సూరీడు సుర్రు..మీటరు గిర్రు

కొత్తగూడెం పట్టణానికి చెందిన విశ్రాంత ఉద్యోగి కె.సత్యనారాయణ గృహ కనెక్షన్‌ బిల్లు 2022, ఏప్రిల్‌లో రూ.855 వచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో బిల్లు రూ.959కి పెరిగింది.

Published : 07 Jun 2023 03:51 IST

* కొత్తగూడెం పట్టణానికి చెందిన విశ్రాంత ఉద్యోగి కె.సత్యనారాయణ గృహ కనెక్షన్‌ బిల్లు 2022, ఏప్రిల్‌లో రూ.855 వచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో బిల్లు రూ.959కి పెరిగింది. 2022, మేలో రూ.1,035 బిల్లు రాగా.. ఈ ఏడాది మే నెలలో రూ.1,365 బిల్లు వచ్చింది. రోజంతా కూలర్లు, ఏసీ వినియోగించడంతో బిల్లు పెరిగిందని సదరు వినియోగదారుడు పేర్కొంటున్నారు.

* లక్ష్మీదేవిపల్లి మండలానికి చెందిన ఎస్‌.పద్మావతి నివాస కనెక్షన్‌కు గత సంవత్సరం మేలో రూ.820, ఈ ఏడాది అదే నెలలో ఏకంగా రూ.2,523 బిల్లు వచ్చింది. వేడి, ఉక్కపోత తాళలేక మూడు బెడ్‌రూంలలో ఉన్న మూడు ఏసీలనూ వినియోగించక తప్పని పరిస్థితి వచ్చిందని.. దీంతో బిల్లు అధికంగా నమోదైనట్లు ఆమె తెలిపారు.

కొత్తగూడెం గ్రామీణం, కొత్తగూడెం కలెక్టరేట్, న్యూస్‌టుడే : ఉభయ జిల్లాల్లో భానుడు ఠారెత్తిస్తున్నాడు. కొన్ని ప్రాంతాల్లో నిలకడగా 45 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెంలో 11 చోట్ల 45కి పైగా జూలూరుపాడు, పాల్వంచ మండలంలోని యానంబైలు, సీతారామపట్నంలో 46.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఖమ్మం జిల్లాలో ఈ నెల 3న ఆటోమేటిక్‌ వెదర్‌ స్టేషన్లలో శనివారం సాయంత్రం 5 గంటల వరకు నమోదైన పగటి ఉష్ణోగ్రతల ప్రకారం  ఖమ్మం ఖానాపురం హవేలి పోలీస్‌ స్టేషన్‌ 45.9, సత్తుపల్లి 45.5, ముదిగొండ 45.4, తిరుమలాయపాలెం, మధిర, మధిర మండలం సిరిపురం, కామేపల్లి మండలం లింగాల 45.1, కొణిజర్ల మండలం పెద్దగోపతి 45.0 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై రెడ్‌ జోన్‌ పరిధిలో చేరాయి. దీంతో వేడి, ఉక్కపోత ధాటికి గృహ విద్యుత్తు వినియోగం అంతకంతకూ పెరిగింది. మీటర్లు గిర్రుమంటుండగా, ఛార్జీలు మోతమోగిస్తున్నాయి. గత సంవత్సరం ఏప్రిల్‌, మే నెలలతో పోలిస్తే భద్రాద్రి, ఖమ్మం జిల్లాల్లో వేసవి ఎండల ప్రభావం అధికంగా ఉంది. గ్రామాల్లో సైతం ఫ్యాన్లు, కూలర్లు నిరంతరం వినియోగిస్తున్నారు. పట్టణాల్లో ఏసీ ఉపశమనం పొందుతున్నారు. వ్యాపారులు దుకాణాలను ఉదయం, సాయంత్రం చల్లటి వాతావరణం ఉన్నంతసేపే తెరిచే పరిస్థితి నెలకొంది. గత వారం పదిరోజులుగా భానుడి ప్రతాపం జనజీవనాన్ని హడలెత్తిస్తోంది. మరికొద్దిరోజులు ఎండల ప్రభావం ఇలాగే కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబతున్నారు. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు పాటించడంతో పాటు, బయటకు వెళ్లిన సమయాల్లో వడదెబ్బకు గురవకుండా చూసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని