logo

ముందస్తు సాగుతో ముప్పు తప్పినట్టే..!

‘ఈనాడు’తో ఖమ్మం జిల్లా వ్యవసాయశాఖ అధికారి విజయనిర్మల యాసంగి సీజన్‌లో ఈదురుగాలులతో కూడిన అకాల వర్షాలు అన్నదాతలకు తీవ్రనష్టాలు మిగిల్చాయి. ప్రకృతి విపత్తుతోనే సంకట పరిస్థితి ఎదురైందన్న ఉద్దేశంతో ప్రభుత్వం పంటల సాగు కాలాన్ని ముందుకు తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రచిస్తోంది.

Updated : 07 Jun 2023 04:33 IST

‘ఈనాడు’తో ఖమ్మం జిల్లా వ్యవసాయశాఖ అధికారి విజయనిర్మల

యాసంగి సీజన్‌లో ఈదురుగాలులతో కూడిన అకాల వర్షాలు అన్నదాతలకు తీవ్రనష్టాలు మిగిల్చాయి. ప్రకృతి విపత్తుతోనే సంకట పరిస్థితి ఎదురైందన్న ఉద్దేశంతో ప్రభుత్వం పంటల సాగు కాలాన్ని ముందుకు తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఈ విధానం వల్ల రైతులకు ఒనగూరే ప్రయోజనాలు, వ్యవసాయ శాఖ సన్నద్ధతపై ‘ఈనాడు’తో జిల్లా వ్యవసాయశాఖ అధికారిణి(డీఏఓ) విజయనిర్మల ముచ్చటించారు. ఆ వివరాలు మీ కోసం..

ఈటీవీ, ఖమ్మం

యాసంగిలో అకాల వర్షాల వల్ల చేతికందే దశలో వరి, మొక్కజొన్న పంటలకు నష్టం వాటిల్లింది. వాతావరణ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో పంటల సాగు కాలాన్ని ముందుకు జరిపేలా కార్యాచరణ చేపట్టాం. వానాకాలంలో మే చివరి నుంచి జూన్‌ 15 వరకు వరి, మిరప నార్లు పోసుకొని, మొక్కజొన్న విత్తుకుంటే అక్టోబరులోనే పంట చేతికొస్తుంది. నవంబర్‌లో యాసంగి పంటల సాగుకు పూనుకోవచ్చు. అప్పుడు మార్చి ఆఖరు నాటికి వరి, మొక్కజొన్న పంటలు కోత దశకు వస్తాయి. ఉష్ణోగ్రతల తీవ్రత పెరిగే సమయానికి కోతలు పూర్తికావాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. పంటకాలాన్ని ముందుకు తీసుకురావడం వల్ల యాసంగిలో కోతల సమయంలో అకాల వర్షాల ముప్పు తప్పుతుంది. ముందస్తు యాసంగి వరి సాగుతో నూక సమస్యకూ పరిష్కారం లభించినట్టే. చీడపీడలు తాకిడి తక్కువగా ఉంటుంది. నీటి లభ్యత  కలిగిన అన్నదాతలు ముందస్తు సాగుకు పూనుకోవాలి. వర్షాధారంపై ఆధారపడిన కర్షకులు.. నైరుతి రుతుపవనాలు అనుకూలించిన తర్వాతే వ్యవసాయ పనులు చేపట్టాలి.

నష్టాలను గుర్తెరిగి మసలుకోవాలి..

ప్రతి సీజన్‌లో ఒకే సమయంలో పంటలు సాగు చేసుకోవడం రైతులకు అలవాటుగా మారింది. రూ.లక్షల పెట్టుబడులు పెట్టినా తీరా చేతికొచ్చే దశలో పంటలు దెబ్బతిని తీవ్రంగా నష్టపోతున్న విషయాన్ని అన్నదాతలు గుర్తెరగాలి. ముందస్తు పంట సాగు విధానాన్ని అవలంబిస్తే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఈమేరకు క్లస్టర్ల వారీగా రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. దీర్ఘకాలిక పంటలను ముందు విత్తుకోవాలని, స్వల్పకాలిక పంటలను ఆలస్యంగా సాగుచేసుకోవాలని సూచిస్తున్నాం. ముందస్తు సాగుతో రెండు పంట కాలాల నడుమ పొలానికి అధికంగా విశ్రాంతి ఇచ్చినట్లు అవుతుంది. దీనివల్ల దిగుబడులు పెరిగే ఆస్కారముంది.

పంట మార్పిడితో అధిక దిగుబడులు

జిల్లాలో ప్రధానంగా వరి, పత్తి, మిర్చి పంటలు సాగవుతాయి. మంచి దిగుబడుల కోసం రైతులు సీజన్‌ మొదటి నుంచి అప్రమత్తంగా ఉండాలి. వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారుల సలహాలు, సూచనలు పాటించాలి. తెగుళ్లు సోకకుండా విత్తనశుద్ధి చేసుకోవాలి. మూడేళ్లకోసారి లోతు దుక్కులు దున్నాలి. పంట మార్పిడితో అధిక దిగుబడులు సాధించవచ్చు. వ్యవసాయ శాఖ తరఫున వారానికి రెండురోజులు రైతు వేదికల ద్వారా ఆధునిక పద్ధతులు, సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పిస్తున్నాం. జిల్లాలో ఇప్పటివరకు 10 వేల నమూనాలు సేకరించి భూసార పరీక్షలు నిర్వహించాం. రఘునాథపాలెం, సత్తుపల్లిలో భూసార పరీక్ష కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి.

ఆన్‌లైన్‌లో విత్తనాలు కొనొద్దు

కొన్నేళ్లుగా మార్కెట్‌లోకి నకిలీ విత్తనాలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఈసారీ అప్రమత్తంగా ఉన్నాం. ఇప్పటికే విత్తన విక్రయ దుకాణాల్లో తనిఖీలు చేపట్టాం. జిల్లా, డివిజన్‌, మండల స్థాయిలో ప్రత్యేక బృందాలను నియమించాం. నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు. రైతులు సైతం జాగరూకతతో మెలగాలి. అధీకృత డీలర్ల వద్దే విత్తనాలు కొనాలి. వాటికి సంబంధించిన బిల్లులను భద్రపరచుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆన్‌లైన్‌లో విత్తనాలు కొనొద్దు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని