logo

వనితా విజయం...స్ఫూర్తిదాయక పయనం

ఫుట్‌బాల్‌ క్రీడ... ఇప్పటి వరకు యువకులే ఆడలేక చతికిలబడుతున్నారు. ‘పూర్తిస్థాయి మైదానంలో ఆడలేక హ్యాండ్‌బాల్‌, వాలీబాల్‌ కోర్టుల్లో ఆడుకుంటున్నారు..’

Published : 07 Jun 2023 03:51 IST

రాష్ట్రస్థాయి పోటీల్లో ఛాంపియన్‌గా నిలిచిన జట్టు

ఖమ్మం క్రీడలు, న్యూస్‌టుడే : ఫుట్‌బాల్‌ క్రీడ... ఇప్పటి వరకు యువకులే ఆడలేక చతికిలబడుతున్నారు. ‘పూర్తిస్థాయి మైదానంలో ఆడలేక హ్యాండ్‌బాల్‌, వాలీబాల్‌ కోర్టుల్లో ఆడుకుంటున్నారు..’ లాంటి వ్యంగ్యాస్త్రాలు ఫుట్‌బాల్‌ రంగం చుట్టూ తిరుగుతున్నాయి. ఈ తరుణంలో జిల్లా మహిళా జట్టు ఏకంగా రాష్ట్ర ఛాంపియన్‌షిప్‌ సాధించింది. దీంతో సూటిపోటి మాటలు, విమర్శలకు గట్టి సమాధానం చెప్పినట్టైంది. ఆడితే మనం గెలవగలం అనే కొత్త పట్టుదల, స్ఫూర్తి ఫుట్‌బాల్‌ రంగంలోకి వచ్చింది. ఆ స్ఫూర్తి ప్రదాతలు జిల్లా మహిళా ఫుట్‌బాలర్లు కావడం విశేషం.

జిల్లా ఫుట్‌బాల్‌ రంగానికి ఘన చరిత్ర ఉంది. గడచిన కొన్ని దశాబ్దాల్లో క్రీడా రంగంలో వచ్చిన మార్పులతో ఫుట్‌బాల్‌ ఆదరణ కోల్పోయింది. పూర్వ వైభవం కోసం ఇప్పుడు జిల్లా సంఘం ఓ పోరాటమే చేస్తోంది. ఈ క్రమంలో మహిళా జట్లు ఎదిగి వచ్చాయి. గతంలో మహిళా జట్టు అనగానే సీనియర్‌ విభాగానికే పరిమితమయ్యేది. రెండేళ్ల కాలంగా జూనియర్‌ జట్టు కూడా పోటీ పడే స్థాయికి చేరింది. సీనియర్‌ దశకు వచ్చే స్థాయిగల క్రీడాకారిణులు వివాహాలు చేసుకొని ఈ రంగానికి దూరం అవుతున్నారు. ఇలాంటి ఒడిదుడుకులు, అనేక సవాళ్ల మధ్య జిల్లా సీనియర్‌ మహిళా ఫుట్‌బాల్‌ జట్టు అందరి అంచనాలు తారుమారు చేస్తూ రాష్ట్రస్థాయి సీఎం కప్‌ను గెల్చుకొచ్చింది.

బంగారు పతకం..

జట్టు క్రీడాంశాల్లో బంగారు పతకం సాధించిన ఘనత జిల్లా మహిళా ఫుట్‌బాల్‌ జట్టుకే దక్కింది. జిల్లా నుంచి వివిధ క్రీడాంశాల్లో అనేక జట్లు రాష్ట్రస్థాయి పోటీలకు వెళ్లాయి. అన్ని క్వార్టర్స్‌, సెమీ ఫైనల్స్‌లో వెనుదిరిగాయి. ఎలాంటి హడావుడి, అంచనాలు లేకుండా వెళ్లిన ఫుట్‌బాల్‌ జట్టు సీఎం కప్‌ను సాధించింది. ఈ టోర్నీలో వివిధ జిల్లాల నుంచి 17 జట్లు పాల్గొన్నాయి. ఇందులో హైదరాబాద్‌, నిజామాబాద్‌, రంగారెడ్డి బలమైన జట్లుగా పేరుగాంచాయి. వాటిని ఖంగు తినిపించి జిల్లా జట్టు టైటిల్‌ సాధించింది. ఒక్కో క్రీడాకారిణి రూ.6,230 నగదు పురస్కారాన్ని అందుకున్నారు.

బలమైన జట్టు

మహిళా జట్టులో ఐ.మాధురి, ఎం.కావ్య, కె.అలేఖ్య, టి.అఖిల, టి.శ్రీలక్ష్మి, బి.రోజ, ఎం.నవ్యశ్రీ, పి.కావ్య, టి.తేజ, కె.రేవతి, వి.సారిక, ఎం.కిరణ్మయి, సి.హెచ్‌.చైత్ర, టి.స్వప్న, పి.వీణ, బి.చరణి ఉన్నారు. ఇందులో ఏడుగురికి ఇప్పటికే ప్రతిష్ఠాత్మక సీనియర్‌ నేషనల్స్‌ పోటీలు ఆడిన అనుభవం ఉంది. జట్టును కూర్చి, ఆ జట్టును రాష్ట్ర పోటీలకు సిద్ధం చేయడంలో శిక్షకుడు ఆదర్శ్‌కుమార్‌ ముఖ్య పాత్ర పోషించారు. ఈ విజయం ఇప్పటి వరకు ఫుట్‌బాల్‌ జట్లపై ఉన్న ఆలోచనలు, అంచనాలు మార్చాయి. జట్టు క్రీడాంశాలకు జట్టుగా గెలుపొందినప్పుడే అందులోని క్రీడాకారులకు గుర్తింపు ఉంటుంది. ఆ కీర్తి ప్రతిష్ఠలు ఇప్పుడు దక్కాయి. వీరు జిల్లాకే మంచి పేరు తీసుకొచ్చి ప్రశంసలు పొందారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని