logo

ప్రణాళికతో చదివి..శాస్త్రవేత్తగా ఎదిగి..

సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు. స్థానిక ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాభ్యాసం చేశారు. అప్పుడే శాస్త్రవేత్తగా కావాలని కలలు కన్నారు.

Updated : 07 Jun 2023 06:22 IST

చెన్ను నరేశ్‌

పెనుబల్లి, న్యూస్‌టుడే : సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు. స్థానిక ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాభ్యాసం చేశారు. అప్పుడే శాస్త్రవేత్తగా కావాలని కలలు కన్నారు. లక్ష్య సాధన కోసం ప్రణాళికాబద్దంగా కష్టపడ్డారు. ఓ వైపు ఉద్యోగం, కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూనే భారత రక్షణపరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో)లో శాస్త్రవేత్తగా ఎంపికై చిరకాల స్వప్నం సాకారం చేసుకున్నారు పెనుబల్లి మండలం రామచంద్రారావు బంజర్‌కు చెందిన చెన్ను నరేశ్‌.

కుటుంబ నేపథ్యం

నరేష్‌ తండ్రి చెన్ను రామయ్య సాధారణ రైతు. నిరక్షరాస్యుల కుటుంబంలో పుట్టిన తాను పాఠశాల చదువుతూనే పొలం పనుల్లో తండ్రికి సహాయం అందించేవాడు. ఏడో తరగతి వరకు రామచంద్రారావు బంజర్‌ ప్రాథమికోన్నత పాఠశాల, ఎనిమిదో తరగతి వీఎం బంజర్‌ జడ్పీ ఉన్నత పాఠశాల, 9, 10 తరగతులు అరుణోదయ మెరిట్‌ స్కూల్‌లో చదివారు. తొంభై శాతం మార్కులతో పదో తరగతి ఉత్తీర్ణుడయ్యారు. అప్పటి పాఠశాల కరస్పాండెంట్‌ రమేశ్‌ సూచన మేరకు ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో ఈసీఈ చదివి 94.2 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంజినీరింగ్‌ చదువు పూర్తి చేశారు. అనంతరం 2013లో డీఆర్‌డీవో టెక్నికల్‌ సీనియర్‌ ఆఫీసర్‌గా ఉద్యోగం సాధించారు. ఉద్యోగ ప్రస్థానంలో ఉత్తమ సాంకేతిక, బెస్ట్‌ పెర్ఫామెన్స్‌ అవార్డులు దక్కించుకున్నారు. ఒకవైపు ఉద్యోగ నిర్వహణ, మరో వైపు కుటుంబం, లక్ష్యసాధన కోసం మూడేళ్లు కష్టపడి చదివి అనుకున్నది సాధించారు. తమ గ్రామం నుంచి శాస్త్రవేత్తగా ఎదిగిన నరేష్‌ను స్థానికులు అభినందిస్తున్నారు.

అబ్దుల్‌కలాం స్ఫూర్తిగా..

విజయం సాధించాలంటే మొదటగా ఉండాల్సింది కష్టపడే తత్వం, అంకితభావం అని నమ్మాను. అదే దిశగా ప్రయత్నించాను. అబ్దుల్‌కలాం స్ఫూర్తిగా శాస్త్రవేత్తగా అవ్వాలని నిర్ణయించుకున్నాను. చిన్నప్పటి నుంచి అందుకు అవసరమైన సమాచారాన్ని సేకరించాను. మొదటిగా డీఆర్‌డీవోలో ఉద్యోగం సాధించాను. ఆ తరువాత శాస్త్రవేత్త పరీక్షలకు సన్నద్ధం అయ్యాను. స్వల్పకాలిక ఆనందాల కోసం నా జీవిత లక్ష్యాన్ని ఎప్పుడు నిర్లక్ష్యం చేయలేదు. మూడేళ్లు కష్టపడితే 30 ఏళ్ల భవిష్యత్తు బాగుంటుందని నమ్మాను. ఆ దిశగా మూడు దశల పరీక్షల్లో విజయం సాధించి శాస్త్రవేత్తగా ఎంపికయ్యాయని చెబుతున్నారు చెన్ను నరేశ్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని