logo

తెలిసినవాడే కాటేశాడు..

ఎనిమిదేళ్ల బాలికపై 17 ఏళ్ల బాలుడు అఘాయిత్యానికి పాల్పడిన ఘటన ఖమ్మం జిల్లా కేంద్రంలోని ఏదులాపురంలో మంగళవారం చోటుచేసుకుంది.

Published : 07 Jun 2023 03:51 IST

ఎనిమిదేళ్ల బాలికపై మైనర్‌ అఘాయిత్యం

రోడ్డుపై ఆందోళన చేస్తున్న బాధిత కుటుంబీకులు, మద్దతుదారులు

ఖమ్మం గ్రామీణం, న్యూస్‌టుడే: ఎనిమిదేళ్ల బాలికపై 17 ఏళ్ల బాలుడు అఘాయిత్యానికి పాల్పడిన ఘటన ఖమ్మం జిల్లా కేంద్రంలోని ఏదులాపురంలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్‌ జిల్లా తొర్రూర్‌లోని సంచార జాతులకు చెందిన ఓ కుటుంబం ఏదులాపురంలో రోడ్డు పక్కనే డేరాలు వేసుకొని గ్యాస్‌ స్టవ్‌లు మరమ్మతులు చేస్తూ జీవనం సాగిస్తోంది. ఎనిమిదేళ్ల బాలికకు చాక్లెట్లు, బిస్కెట్లు కొని ఇస్తానని చెప్పి అక్కడే డేరాలు వేసుకొని నివాసముంటున్న జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌కు చెందిన బాలుడు(17) సమీపంలోని ముళ్ల పొదల్లోకి తీసుకెళ్లాడు. కొంతకాలంగా ఒకే ప్రాంతంలో ఉంటుండటంతో తెలిసిన వ్యక్తే కదా అని బాలిక అతనితోపాటు వెళ్లింది. అతడు బాలికపై అఘాయిత్యానికి పాల్పడగా బాధితురాలు ఏడ్చుకుంటూ ఇంటికి చేరింది. విషయం తల్లికి చెప్పడంతో బాలికను చికిత్స నిమిత్తం ఖమ్మం సర్వజన ఆసుపత్రికి తరలించారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అత్యాచార ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెంకటకృష్ణ తెలిపారు.

సర్వజనాసుపత్రి ఎదుట ఆందోళన

ఖమ్మం వైద్యవిభాగం, న్యూస్‌టుడే: అత్యవసర స్థితిలో ఆస్పత్రికి వస్తే వైద్యులు చికిత్స చేయకుండా నిర్లక్ష్యం చేశారని ఆరోపిస్తూ బాధితులు ఆందోళన బాట పట్టారు. ఏదులాపురంలో అత్యాచారానికి గురైన బాలికను తల్లిదండ్రులు ఖమ్మం సర్వజనాసుపత్రికి తీసుకొచ్చారు. మాతాశిశు ఆరోగ్య కేంద్రంలో వైద్యురాలిని సంప్రదించగా పోలీసులు రాకుండా తాము చికిత్స అందించలేమని నిరాకరించారు. దీంతో కోపోద్రిక్తులైన చిన్నారి తల్లిదండ్రులు ఆస్పత్రి ప్రధాన గేటు వద్ద రోడ్డుపై బైఠాయించారు. రహదారిపై వెళ్లే వాహనదారులు వారికి మద్దతుగా నిలవడంతో ఆందోళన పెద్దదైంది. బాలికకు రక్తస్రావం జరుగుతున్నా వైద్యులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో కూడా మానవత్వం చాటకుండా వైద్యులు నిబంధనల పేరుతో బయటకు పంపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు గంటపాటు ట్రాఫిక్‌ స్తంభించింది. తర్వాత పోలీసులు వచ్చి బాధితులను సముదాయించి ఆస్పత్రి లోపలికి తీసుకెళ్లారు. ఆర్‌ఎంవో డాక్టర్‌ అమర్‌సింగ్‌ పర్యవేక్షణలో బాలికకు వైద్యులు చికిత్స అందించారు. వైద్య పరీక్షలు నిర్వహించి అత్యాచారం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆస్పత్రిలో ఓ ప్రత్యేక గదిలో ఉంచి వైద్య సేవలందిస్తున్నారు. ఛైల్డ్‌ వెల్ఫెర్‌ కమిటీ బాధ్యులు బాలికను పరామర్శించి ఘటనపై వివరాలు సేకరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని