logo

బ్యాగులతో ఆలయ ప్రవేశం నిషిద్ధం

భద్రాచల రామాలయం భద్రతను సవాల్‌ చేసే ఘటనలు ఇటీవల వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ప్రత్యేక చర్యలకు ఈఓ రమాదేవి శ్రీకారం చుట్టారు.

Published : 07 Jun 2023 03:51 IST

భద్రాచలం, న్యూస్‌టుడే: భద్రాచల రామాలయం భద్రతను సవాల్‌ చేసే ఘటనలు ఇటీవల వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ప్రత్యేక చర్యలకు ఈఓ రమాదేవి శ్రీకారం చుట్టారు. ఇటీవల అధికారులకు తెలియకుండానే ఇద్దరు సెక్యూరిటీ గార్డులు విధులు నిర్వర్తించారు. అనుమతి లేకుండా వీరికి ఎస్పీఎఫ్‌ బృందం హాజరు వేసి విధులు కేటాయించారు. ఈ వివాదం పోలీసుల వరకూ చేరింది. మార్చి 30న శ్రీరామనవమి సందర్భంగా కల్యాణ మండపం వద్ద ఒకరు స్వామివారి వస్త్రాలను కాజేసి విచారణ తర్వాత వారం క్రితం అప్పగించారు. 31న పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం సందర్భంగా పట్టు వస్త్రాలను భక్తులు సమర్పించారు. ఇందులో ఓ దాత ఇచ్చిన రూ.లక్ష విలువైన చీరలు, పంచెలు, కండువాలు మాయమయ్యాయి. భద్రత నిమిత్తం సీసీ కెమెరా వ్యవస్థ, సెక్యూరిటీ గార్డులు, హోం గార్డులు, ఎస్పీఎఫ్‌ సిబ్బంది ఉన్నప్పటికీ డొల్లతనం బట్టబయలైంది. ఈ అంశంపై ఈఓ ఇటీవల సుదీర్ఘ సమీక్షలు జరిపి కీలక నిర్ణయాలు     తీసుకున్నారు.

భద్రత కోసం.. భక్తులను పెద్ద బ్యాగులతో దర్శనానికి అనుమతించవద్దని ఆదేశాలు జారీ చేశారు. విధుల్లో ఉండే సెక్యూరిటీ సిబ్బంది ఈ అంశంపై భక్తులతో మర్యాదగా వ్యవహరించి వారికి అవగాహన కల్పించాలని ఈనెల 4న జారీ చేసిన ఉత్తర్వుల్లో ప్రస్తావించారు. పెద్దసంచులు ఉంటే కౌంటర్లలో లేదా వసతిగదుల్లోగానీ భద్రపరిచేలా సెక్యూటిరీ సిబ్బంది అవగాహన కల్పించాలన్నారు.    ఈ నిబంధన ఆలయ కార్యాలయ సిబ్బందితో పాటు వైదిక ఉద్యోగులకూ వర్తిస్తుందని స్పష్టం చేశారు. మతపరమైన సిబ్బంది తమకు అవసరమైన పారాయణం వంటి పుస్తకాలను తీసుకురావాలనుకుంటే తగిన చిన్నబ్యాగులకు అనుమతి ఉంటుందని, పెద్ద సంచులకు అవకాశం లేదన్నారు. నిబంధనలకు విరుద్ధంగా సంచుల్లో ఆలయానికి చెందిన వస్తువులు ఉన్నట్లు అనుమానం కలిగితే తనిఖీ చేసి తనకు సమాచారం ఇవ్వాలని భద్రతా సిబ్బందిని ఆదేశించారు. కోవెల వద్ద సెల్‌ఫోన్‌ ఉపయోగించవద్దనే ఉత్తర్వులు ఇప్పటికే ఉన్నాయి. ఇదంతా భద్రత కోసమేనని, అందరూ సహకరించాలని ఈఓ కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని