logo

పాత నేరస్థులపై ప్రత్యేక దృష్టి

వానాకాలం పంటల సాగు  ప్రారంభం కానున్న నేపథ్యంలో నకిలీ విత్తనాలను నిరోధించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా గతంలో నకిలీ విత్తనాలు విక్రయించిన కేసుల్లో ఉన్న వారిపై ప్రత్యేక దృష్టి సారించింది.

Updated : 09 Jun 2023 06:27 IST

నకిలీల నిరోధానికి ‘టాస్క్‌ఫోర్స్‌’ వ్యూహం
ఖమ్మం వ్యవసాయం, న్యూస్‌టుడే

ఖమ్మంలో విత్తన దుకాణంలో అధికారుల తనిఖీ (పాత చిత్రం)

వానాకాలం పంటల సాగు  ప్రారంభం కానున్న నేపథ్యంలో నకిలీ విత్తనాలను నిరోధించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా గతంలో నకిలీ విత్తనాలు విక్రయించిన కేసుల్లో ఉన్న వారిపై ప్రత్యేక దృష్టి సారించింది. ఏటా ఖమ్మం జిల్లాలో సుమారు రూ.60 కోట్లు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రూ.40 కోట్ల పత్తి విత్తన వ్యాపారం జరుగుతోంది. అక్రమార్కులు ఉభయ జిల్లాలపై కన్నేశారు. ఏటా సీజన్‌కు ముందు ప్రణాళిక ప్రకారం గిరిజన ప్రాంతాలకు నకిలీల విత్తనాలను తరలిస్తారు. అసలు విత్తనాలుగా నమ్మించి అనుమతి లేనివి విక్రయిస్తారు. అనుమానం రాకుండా వారికి పనికిరాని రసీదులు ఇస్తారు. నకిలీ విత్తనాలు కొనుగోలు చేసి దిగుబడులు రాక చాలామంది కర్షకులు నష్టపోతున్నారు.

గతంలో కేసులు ఇలా...

* 2016లో జిల్లాలో పెద్ద ఎత్తున జీవా కంపెనీకి చెందిన నకిలీ విత్తనాలను పట్టుకున్నారు. ఖమ్మంలో ముగ్గురిపై, వైరాలో ఒకరిపై వ్యవసాయశాఖ అధికారులు కేసులు నమోదు చేశారు.

* 2021లో ఏన్కూరులో నకిలీ విత్తనాలు సరఫరా చేస్తున్న వ్యక్తిని పట్టుకుని టాస్క్‌ఫోర్స్‌, వ్యవసాయశాఖ అధికారులు కేసులు నమోదు చేశారు.

గిరిజన మండలాలపై అక్రమార్కుల కన్ను...

అక్రమ వ్యాపారులు ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో ప్రధానంగా గిరిజన మండలాలపై దృష్టి సారించి అమాయక రైతులకు మాయమాటలు చెప్పి విత్తనాలు అంటగడుతున్నారు. ఖమ్మం జిల్లాలోని రఘునాథపాలెం, కామేపల్లి, కారేపల్లి, కొణిజర్ల, ఏన్కూరు మండలాలతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లెందు, ఆళ్లపల్లి, గుండాల, టేకులపల్లి, సుజాతనగర్‌, చంద్రుగొండ, భద్రాచలం ఏజెన్సీలోని కొన్ని ప్రాంతాల్లో యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. అధిక దిగుబడులు వస్తాయని చెప్పి గ్రామాల్లోకి వెళ్లి గుట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తున్నారు. నిరక్షరాస్యులైన గిరిజనులు అందమైన లేబుళ్లు చూసి కొనుగోలు చేసి మోసపోతున్నారు.

చెక్‌పోస్టుల వద్ద నిఘా..

తాజాగా రాష్ట్రస్థాయి టాస్క్‌ఫోర్స్‌, వ్యవసాయశాఖ, పోలీసుశాఖ అధికారులు  ఖమ్మం నగరంతో పాటు ఏన్కూరు, వైరా, తల్లాడ తదితర మండలాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. పాత నేరస్థులే నకిలీ విత్తనాలను మళ్లీ విక్రయిస్తున్నట్లు గుర్తించారు. గతంలో వివిధ విత్తన కంపెనీల్లో పని చేసి ఉద్యోగం మానేసిన, నకిలీ విత్తనాలు అమ్మి దుకాణాలు మూసివేసిన, భారీగా సంపాదించి కేసుల్లో ఇరుక్కున్న వారిపై ప్రత్యేక దృష్టి సారించారు. మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీలోని వివిధ ప్రాంతాల నుంచి నకిలీ విత్తనాలు పెద్దమొత్తంలో ఉభయ జిల్లాల్లోకి ప్రవేశించే అవకాశం   ఉండటంతో సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద నిఘా పెంచారు.

ట్రాన్స్‌పోర్టు కంపెనీలపై...

నకిలీ కేటుగాళ్లు రకరకాల పద్ధతుల్లో విత్తనాలను రహస్యంగా గ్రామాలకు తరలిస్తున్నారు. పోలీసులు, వ్యవసాయశాఖ, టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది కన్నుగప్పి రహస్యంగా తరలిస్తున్న విషయం అధికారుల దృష్టికి వచ్చింది. ఇప్పుడు వివిధ రకాల ట్రాన్స్‌పోర్టు కంపెనీలైన నవత, ఎస్‌ఆర్‌ఎంటీ, టీఎస్‌ఆర్‌టీసీ కార్గో సర్వీసులు, తదితర రవాణా సంస్థలపై విజిలెన్స్‌శాఖ అధికారులు ఓ కన్నేశారు. ఈ సంస్థల ద్వారా అక్రమార్కులు నకిలీ విత్తనాలను తెప్పించే అవకాశం ఉందని భావించి వాటిపై కూడా నిఘా పెట్టారు. ఆన్‌లైన్‌లో అక్రమ వ్యాపారం నిర్వహించే సంస్థలపైనా అధికారులు దృష్టి సారించి నకిలీ విత్తనాలను ఎలాగైనా అడ్డుకోవాలనే కృతనిశ్చయంతో ముందుకు సాగుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని