logo

పూర్తి స్థాయిలో పుస్తకాలు అందేనా..?

మరో మూడు రోజుల్లో విద్యాసంవత్సరం ప్రారంభం కానుంది. సర్కారు బడుల్లో అభ్యసించే బాలబాలికలకు పాఠ్యపుస్తకాలను అధికారులు అందజేయనున్నారు. యూడైస్‌ ప్లస్‌ ప్రకారం విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పుస్తకాలు ఇంకా జిల్లా కేంద్రాల గోదాములకు చేరలేదు.

Updated : 09 Jun 2023 06:17 IST

కొత్తగూడెం విద్యావిభాగం, న్యూస్‌టుడే

కొత్తగూడెంలోని గోదాము నుంచి మండల కేంద్రాలకు తరలించే పుస్తకాలను లోడింగ్‌ చేస్తున్న హమాలీలు

మరో మూడు రోజుల్లో విద్యాసంవత్సరం ప్రారంభం కానుంది. సర్కారు బడుల్లో అభ్యసించే బాలబాలికలకు పాఠ్యపుస్తకాలను అధికారులు అందజేయనున్నారు. యూడైస్‌ ప్లస్‌ ప్రకారం విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పుస్తకాలు ఇంకా జిల్లా కేంద్రాల గోదాములకు చేరలేదు. ఇప్పటివరకు వచ్చిన పుస్తకాలను జిల్లా కేంద్రాల నుంచి ఆయా మండలాలకు అధికారులు పంపిణీ చేశారు. పాఠశాలల పునఃప్రారంభం నాటికి విద్యార్థులందరికీ పుస్తకాలు అందాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఆ దిశగా అధికారులు కసరత్తు చేసినా కొంతమంది బాలబాలికలకు పుస్తకాలు సరిపోకపోవచ్చు. వీరంతా అరకొర పాఠ్యపుస్తకాలతో విద్యాలయాలకు వచ్చే అవకాశాలున్నాయి. గతంతో పోలిస్తే ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల సంఖ్య భారీగా పెరుగుతుందని విద్యాశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. బడిబాటలో ప్రవేశాలు పొందిన విద్యార్థులకూ పాఠ్యపుస్తకాలు అందజేయాల్సి ఉంటుంది.

ఉభయ జిల్లాల్లో..

రాబోయే విద్యాసంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటోతరగతి నుంచి తొమ్మిదోతరగతి వరకు తెలుగు/ఆంగ్లమాధ్యమ బోధన అమలుకాబోతున్న విషయం విదితమే. గతేడాది ముద్రణ, సరఫరాలో జాప్యంతో నవంబరు వరకు కొందరు విద్యార్థులకు పుస్తకాలు అందలేదు. నలుగురైదుగురు కలిసి చదువుకున్నారు. ఈసారి ఇప్పటివరకు ఖమ్మం జిల్లాలో ఆంగ్లమాధ్యమానికి సంబంధించి గణితం (ఒకటో తరగతి), తెలుగుమాధ్యమానికి సంబంధించి సైన్స్‌ (ఆరో తరగతి), తెలుగు, ఉర్దూ (ఏడో తరగతి) పుస్తకాలు రాలేదు. ఇంగ్లిష్‌ (రెండో తరగతి), ఇంగ్లిష్‌ (నాలుగో తరగతి) పాఠ్యపుస్తకాలు అందలేదు. భద్రాద్రి జిల్లాలో తెలుగు మాధ్యమానికి సంబంధించి తెలుగు (రెండో తరగతి), తెలుగువాచకం(ఆరో తరగతి) పుస్తకాలు రాలేదు. నాలుగో తరగతి ఇంగ్లిష్‌ పాఠ్యపుస్తకాలు అందలేదు. మరోవైపు జిల్లా కేంద్రంలోని గోదాముల నుంచి పాఠ్యపుస్తకాలను మండలాలకు తరలించేందుకు రవాణా ఛార్జీలు ఏళ్లుగా మంజూరు కావటం లేదు. ఆయా మండలాల అధికారులే ఖర్చులను సొంతంగా భరిస్తున్నారు.
ప్రస్తుతం 80 శాతం పాఠ్యపుస్తకాలు వచ్చాయి. వీటిని మండల కేంద్రాలకు పంపిణీ చేశాం. అక్కడి నుంచి పాఠశాలలకు సరఫరా అవుతున్నాయి. పాఠశాలల పునఃప్రారంభం నాటికి ప్రతి విద్యార్థి చేతికి పుస్తకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నాం. ఉన్నత పాఠశాలల విద్యార్థులకు బుక్‌బ్యాంక్‌ నుంచి కావాల్సిన పుస్తకాలు ఇస్తాం.

సోమశేఖర్‌శర్మ, డీఈఓ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని