logo

ఖమ్మంపై కమలం గురి

శాసనసభ ఎన్నికల సమయం సమీపిస్తున్న వేళ.. పార్టీ బలోపేతమే లక్ష్యంగా కాషాయ దళం అడుగులు వేస్తోంది. మహాజన్‌ సంపర్క్‌ అభియాన్‌ పేరిట భాజపా అగ్రనేతలు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పర్యటిస్తున్నారు.

Published : 09 Jun 2023 02:59 IST

15న అమిత్‌షా బహిరంగ సభకు విస్తృత ఏర్పాట్లు

ఈటీవీ- ఖమ్మం: శాసనసభ ఎన్నికల సమయం సమీపిస్తున్న వేళ.. పార్టీ బలోపేతమే లక్ష్యంగా కాషాయ దళం అడుగులు వేస్తోంది. మహాజన్‌ సంపర్క్‌ అభియాన్‌ పేరిట భాజపా అగ్రనేతలు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా భాజపా అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఈనెల 15న ఖమ్మంలో జరిగే బహిరంగ సభకు హాజరుకానున్నారు. అమిత్‌షా తొలిసారి ఖమ్మం వస్తుండటంతో ఆపార్టీ ఉభయ జిల్లాల నాయకులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు.

కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరిస్తూనే..

ఇప్పటివరకు ఉభయ జిల్లాల్లో భాజపా ప్రభావం పెద్దగా లేదన్న అభిప్రాయం ఆ పార్టీ వర్గాల్లో ఉంది. 2018 ఎన్నికల తర్వాత ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాడినా ఒకరిద్దరు మినహా ముఖ్య నాయకులెవరూ పార్టీలో చేరకపోవటంతో స్తబ్దత నెలకొంది. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని భాజపాలో చేర్చుకునేందుకు జాతీయ, రాష్ట్రస్థాయి నేతలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. బలమైన నాయకులను పార్టీ వైపు ఆకర్షించటమే కాకుండా.. మరోవైపు కాషాయ శ్రేణుల్లో స్థైర్యం నింపే కార్యక్రమాలకు అధిష్ఠానం శ్రీకారం చుట్టింది. పార్టీ కార్యకర్తల్లో జోష్‌ నింపడంతోపాటు కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా ప్రజలకు కలిగిన లబ్ధిని వివరించేందుకు మహాజన్‌ సంపర్క్‌ అభియాన్‌ సభల నిర్వహణకు పూనుకుంది.

నేడు బండి సంజయ్‌ రాక..

ఖమ్మంలో ఈనెల 15న నిర్వహించే బహిరంగ సభను భాజపా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది. అగ్రనేత అమిత్‌షా ముఖ్య అతిథిగా హాజరుకానున్న సభకు భారీగా జనాలను సమీకరించాలనే లక్ష్యంతో ఉభయ జిల్లాల నాయకులు కలిసికట్టుగా పనిచేస్తున్నారు. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల అధ్యక్షులు గల్లా సత్యనారాయణ, కోనేరు చిన్ని సమన్వయపరుస్తున్నారు.  పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసేందుకు ఖమ్మం నగరానికి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ శుక్రవారం రానున్నారు. పార్టీ నేతలతో కలిసి బహిరంగ సభ నిర్వహించ తలపెట్టిన సర్దార్‌ పటేల్‌ మైదానాన్ని పరిశీలిస్తారు. అనంతరం అమిత్‌షా పర్యటన, బహిరంగ సభ వివరాలను వెల్లడించే అవకాశముంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని