logo

నైపుణ్యవృద్ధి రస్తు..

విద్యార్థులకు త్వరితగతిన ఉపాధి కల్పించే దిశగా సాంకేతిక విద్యను అందించేందుకు ప్రభుత్వం పారిశ్రామిక శిక్షణ సంస్థ(ఐటీఐ)లను నిర్వహిస్తోంది. దీంతో యువతకు స్వయం ఉపాధి, ఉద్యోగావకాశాలు కూడా అపారంగా లభిస్తున్నాయి.

Updated : 09 Jun 2023 06:20 IST

ఐటీఐ విద్యార్థుల కోసం భారత్‌ స్కిల్స్‌ యాప్‌
మణుగూరు సాంస్కృతికం, న్యూస్‌టుడే

విద్యార్థులకు త్వరితగతిన ఉపాధి కల్పించే దిశగా సాంకేతిక విద్యను అందించేందుకు ప్రభుత్వం పారిశ్రామిక శిక్షణ సంస్థ(ఐటీఐ)లను నిర్వహిస్తోంది. దీంతో యువతకు స్వయం ఉపాధి, ఉద్యోగావకాశాలు కూడా అపారంగా లభిస్తున్నాయి. ఇదే సమయంలో పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా మానవ వనరుల కొరత కూడా దూరమవుతుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఐటీఐ విద్యార్థుల కోసం ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ మేరకు పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలలో ప్రవేశాల కోసం ఆన్‌లైన్‌లో ఈనెల 10వ తేదీ వరకు గడువు ఉంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న ఐటీఐ కళాశాలల్లో ఎలక్ట్రీషియన్‌, ఫిట్టర్‌, వెల్డర్‌, సివిల్‌, కంప్యూటర్‌ అండ్‌ ప్రోగ్రామింగ్‌ అసిస్టెంట్‌, షార్ట్‌ హ్యాండ్‌ తదితర కోర్సు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులకు పదో తరగతిలో గ్రేడింగ్‌ ఆధారంగా సీట్లను కేటాయిస్తారు.

ఆన్‌లైన్‌లో తరగతులు..

భారత్‌ స్కిల్స్‌ యాప్‌లో ఐటీఐలోని అన్ని విభాగాలకు సంబంధించి పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. ఇందుకోసం ఐచ్చికాలు ఎంచుకోవాల్సి ఉంటుంది. పుస్తకాలు కొనుగోలు చేయడం ఆర్థిక భారం అనుకునే వారికి ఇది మంచి అవకాశం. యూట్యూబ్‌ లింక్‌ ద్వారా ఆన్‌లైన్‌ తరగతులు సైతం విద్యార్థులు తమకు ఖాళీగా ఉన్న సమయంలో వినేందుకు వీలుంటుంది. పరీక్షల సన్నద్ధత, క్వశ్చన్‌ బ్యాంకులు కూడా యాప్‌లో అందుబాటులో ఉన్నాయి. ఐటీఐ కోర్సు పూర్తికాగానే విద్యార్థులు అప్రెంటీషిప్‌ చేయాల్సి ఉంటుంది. ఇది పూర్తి చేసిన వారికే వివిధ పరిశ్రమల్లో ఉద్యోగావకాశాలు లభిస్తాయి. యాప్‌లో అప్రెంటీషిప్‌కు సంబంధించిన సమాచారం అందుబాటులో ఉంటుంది. కోర్సును అందించే పరిశ్రమల్లో ఖాళీలు, అర్హతలు తదితర సమాచారం ఈ యాప్‌ ద్వారా తెలుసుకోవచ్చు.

ఎంతో ఉపయుక్తం..

ఐటీఐ విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉండేలా ఇటీవల కేంద్ర ప్రభుత్వం ‘భారత్‌ స్కిల్స్‌ యాప్‌’ను తీసుకువచ్చింది. స్మార్ట్‌ఫోన్‌ కలిగి ఉన్న విద్యార్థులు ఈ యాప్‌ను గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి సులువుగా డౌన్‌లోడ్‌ చేసుకునే వీలుంది. ఈ-మెయిల్‌ ఐడీ, చరవాణి నంబరు, యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌గా ఉపయోగిస్తే సరిపోతుంది.

సద్వినియోగం చేసుకోవాలి

బడుగు ప్రభాకర్‌, ఐటీఐ జిల్లా కన్వీనర్‌, భద్రాద్రి

భారత్‌ స్కిల్స్‌ యాప్‌ను ఐటీఐ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. పరీక్షల సమాచారం కూడా ఈ యాప్‌లో తెలుసుకొనే వీలుంది. నాణ్యమైన విద్యను అందుబాటులోకి తీసుకురావడం, విద్యార్థుల్లో నైపుణ్యాల పెంపునకు బాటలు వేయాలన్నదే లక్ష్యం. కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌కు ఈ యాప్‌లో ఉన్న క్వశ్చన్‌ బ్యాంక్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని