logo

వానాకాలం సాగు కార్యాచరణ ఖరారు

యాసంగి సీజన్‌ ముగియడంతో వానాకాలం సాగు ప్రణాళికను వ్యవసాయ శాఖ ముందస్తుగా సిద్ధం చేసింది. గత ఏడాది కంటే ఈ సారి వివిధ పంటల సాగు విస్తీర్ణం పెరుగుతుందని అధికారులు అంచనా వేశారు.

Updated : 09 Jun 2023 06:19 IST

కొత్తగూడెం వ్యవసాయం, న్యూస్‌టుడే

యాసంగి సీజన్‌ ముగియడంతో వానాకాలం సాగు ప్రణాళికను వ్యవసాయ శాఖ ముందస్తుగా సిద్ధం చేసింది. గత ఏడాది కంటే ఈ సారి వివిధ పంటల సాగు విస్తీర్ణం పెరుగుతుందని అధికారులు అంచనా వేశారు. ఈ అంశంపై ప్రాంతాల వారీగా పరిశీలించి కార్యాచరణ ఖరారు చేశారు. పత్తి, కంది సాగుకు ప్రాధాన్యమిచ్చేలా అవగాహన కల్పిస్తే విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం ఉందని వ్యవసాయాధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు విత్తనాలు, ఎరువుల సరఫరాకు ఏర్పాట్లు చేస్తున్నారు. గత వానాకాలంలో (2022) వ్యవసాయ, ఉద్యాన పంటలు కలిపి సాగు అంచనా 5,50,726 ఎకరాలుగా లెక్కించారు. క్షేత్రస్థాయిలో అన్ని పంటలు కలిపి 5,05,042 ఎకరాల్లో వేశారు. ఈ వానాకాలం 6,02,116 ఎకరాల సాగు విస్తీర్ణం అంచనా వేస్తూ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. పత్తి గత సంవత్సరం కన్నా 40 వేల ఎకరాల విస్తీర్ణం పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

విత్తన ప్రణాళిక ఇలా..

అన్ని పంటలు కలిపి 50,262 క్వింటాళ్ల విత్తనాలు అవసరమని అధికారులు తెలంగాణ రాష్ట్ర విత్తన శాఖాభివృద్ధి సంస్థకు ప్రతిపాదనలు పంపించారు. వాటిని ఆయా విత్తన కేంద్రాల ద్వారా విక్రయించనున్నారు. పత్తికి సంబంధించి 1,489 క్వింటాళ్లు (సుమారు 5 లక్షల ప్యాకెట్లు) అవసరమని నివేదించారు. వరిలో బీపీటీ, ఎంటీయూ, ఆర్‌ఎన్‌ఆర్‌ రకాలు కలిపి 41,256 క్వింటాళ్లు, మొక్కజొన్న 4,820, కందులు 372, వేరుశెనగలు 2042, మిరప 23 క్వింటాళ్ల విత్తనాలు సమకూర్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

ఈ వానాకాలం సాగులో పత్తి, కంది పంటలకు ప్రాధాన్యత ఇచ్చాం. వరి పంటలు వర్షాలు పడగానే ముందస్తుగా సాగుచేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. నూనె గింజల పంటలైన నువ్వులు, వేరుశెనగ సాగుకు జిల్లా అనుకూలంగా ఉంది. ఈ మేరకు రైతులు సిద్ధం కావాలి. ఇప్పటికే 65 శాతం రాయితీపై పచ్చిరొట్ట విత్తనాలు పంపిణీ చేస్తున్నాం. ఇతర పంటలకు సంబంధించి విత్తనాలు, ఎరువుల నిల్వలు విక్రయ డీలర్ల వద్ద సిద్ధంగా ఉంచాం.

కె.అభిమన్యుడు, జిల్లా వ్యవసాయాధికారి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని