logo

బొలెరో వాహనం ఢీకొని ద్విచక్రవాహనదారు దుర్మరణం

తల్లాడ-దేవరపల్లి జాతీయ ప్రధాన రహదారిలోని అంజనాపురం గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా, మరో ఉద్యోగికి తీవ్రగాయాలైన ఘటన గురువారం చోటు చేసుకుంది.

Published : 09 Jun 2023 02:59 IST

నాగశ్రీను

తల్లాడ, న్యూస్‌టుడే: తల్లాడ-దేవరపల్లి జాతీయ ప్రధాన రహదారిలోని అంజనాపురం గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా, మరో ఉద్యోగికి తీవ్రగాయాలైన ఘటన గురువారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... తల్లాడ మండలం రామానుజవరం గ్రామానికి చెందిన నిమ్మకాయల నాగశ్రీను(43) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. నిమ్మకాయల నాగశ్రీను ద్విచక్రవాహనంపై రామానుజవరం గ్రామం నుంచి తల్లాడకు వస్తుండగా మార్గమధ్యలో పాతమిట్టపల్లి గ్రామం వద్ద ఆగ్రామం ఆరోగ్యకార్యకర్త(ఏఎన్‌ఎం) పాలకుర్తి పద్మ ఆ ద్విచక్రవాహనం ఎక్కి తల్లాడకు బయలుదేరారు. తల్లాడ-దేవరపల్లి జాతీయ ప్రధాన రహదారిలోని అంజనాపురం గ్రామం వద్ద పెట్రోల్‌బంకులోకి వెళ్లి పెట్రోలు పోయించుకొని రహదారి దాటుతుండగా తల్లాడ నుంచి సత్తుపల్లి వైపు వెళుతున్న బొలెరో వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో నిమ్మకాయల నాగశ్రీను అక్కడికక్కడే మృతి చెందగా, ఏఎన్‌ఎం పద్మ తల, నడుముకు తీవ్రగాయాలయ్యాయి. చికిత్స కోసం ఖమ్మం తరలించారు. మృతుని సోదరుడు వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు తల్లాడ ఎస్సై పి.సురేశ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


ట్రాక్టర్‌ బోల్తా పడి డ్రైవర్‌..

కంభంపాటి ముత్యాలరావు

తల్లాడ, న్యూస్‌టుడే: తల్లాడ మండలం రంగంబంజర గ్రామంలోని చెరువుకట్టపై ట్రాక్టర్‌ పల్టీ కొట్టడంతో డ్రైవర్‌ అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. తల్లాడ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కల్లూరు శాంతినగర్‌కు చెందిన కంభంపాటి ముత్యాలరావు(45) ట్రాక్టర్‌ పల్టీకొట్టి మృతి చెందాడు. ముత్యాలరావు రంగంబంజర గ్రామం నుంచి ట్రాక్టరు ద్వారా కల్లూరు మండలం కిష్టయ్యబంజర గ్రామంలోని ఎరువును తీసుకువచ్చేందుకు వెళ్తుండగా రంగంబంజర చెరువుకట్టపై ట్రాక్టర్‌ అదుపుతప్పి పడడంతో డ్రైవర్‌ ముత్యాలరావు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని సోదరుడు వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు తల్లాడ హెడ్‌కానిస్టేబుల్‌ ఆంజనేయులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


ఈతకు వెళ్లి యువకుడి మృత్యువాత

నాలుగేళ్ల వ్యవధిలో అన్నాదమ్ముళ్ల మృతి

తోకల వీరన్న

రఘునాథపాలెం, న్యూస్‌టుడే: చేతికి వచ్చిన ఇద్దరు కొడుకులు నాలుగేళ్ల వ్యవధిలో మృతి చెందిన విషాదకర సంఘటన రఘునాథపాలెం మండలం బూడిదంపాడులో గురువారం జరిగింది. గ్రామస్థుల కథనం ప్రకారం... తోకల నాగేశ్వరరావు, లక్ష్మి దంపతులకు ఎల్లయ్య, వీరన్న(23) కుమారులు. ఎల్లయ్య వివాహానంతరం నాలుగేళ్ల కిందట కామెర్ల వ్యాధితో మృతి చెందారు. తమ్ముడు వీరన్న మార్బుల్‌ పని చేస్తుంటారు. స్నేహితుడు ఉపేందర్‌తో కలిసి ఇద్దరూ గురువారం ఓ శుభకార్యానికి వెళ్లి వచ్చారు. అనంతరం ఈత కొట్టేందుకు ఓ రైతు వ్యవసాయ బావి వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో వీరన్న నీటిలో మునిగి చనిపోయాడు. ఉపేందర్‌ అందించిన సమాచారంతో బావిలో గాలించిన గ్రామస్థులు మృతదేహాన్ని బయటకు తీశారు. ఈత సక్రమంగా రాకపోవడంతో వీరన్న మునిగిపోయినట్లు తెలుస్తోంది. ఉన్న ఒక్క కుమారుడి అకాల మరణంతో తల్లిదండ్రులు రోదించిన తీరు అందరి కంట కన్నీరు పెట్టించింది. నాలుగేళ్ల వ్యవధిలో ఇద్దరు కుమారులు మృతి చెందడంతో గ్రామంలో విషాదం అలుముకుంది.


గేదె దూడను రక్షించబోయి...

జాన్‌ మృతదేహం

తల్లాడ, న్యూస్‌టుడే: తల్లాడ మండలం కొడవటిమెట్ట(రెడ్డిగూడెం) గ్రామానికి చెందిన పెరుమాళ్లపల్లి జాన్‌(55) రిజర్వాయర్‌లో పడి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జాన్‌ తనకు చెందిన గేదె దూడను బుధవారం వైరా రిజర్వాయర్‌ శిఖంభూమిలో మేత కోసం తోలుకొని వెళ్లాడు. గేదెదూడ మేత మేస్తూ నీటి కోసం వెళ్లి రిజర్వాయర్‌లోని గుంతలో కూరుకుపోయింది. దూడను రక్షించేందుకు జాన్‌ తన బట్టలు విప్పి ఒడ్డుపై పెట్టాడు. గుంతలో కూరుకుపోయిన గేదె దూడను రక్షించి తాను ఇరుక్కుపోయి మృతి చెందాడు. బుధవారం రాత్రి గేదెదూడ ఇంటికి చేరుకొంది. జాన్‌ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆచూకీ కోసం వైరా రిజర్వాయర్‌లో వెతికారు. ఒడ్డుపై ఉన్న బట్టలను చూసి గుంతలో చూడగా మృతదేహం లభ్యమైంది. మృతుని భార్య జయమ్మ ఫిర్యాదు మేరకు తల్లాడ ఏఎస్సై జేవీఆర్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


మతిస్థిమితం సరిగా లేని యువకుడి ఆత్మహత్య

వెంకటేశ్‌

పాల్వంచ గ్రామీణం, న్యూస్‌టుడే: మానసిక పరిస్థితి సరిగాలేని ఓ యువకుడు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పాండురంగాపురం గ్రామానికి జక్కుల ముత్తయ్య కుమారుడు వెంకటేశ్‌(22) మానసిక పరిస్థితి సరిగా ఉండదు. గతంలో ఇంట్లో చెప్పకుండా ఎటో వెళ్లి మళ్లీ తిరిగొచ్చేవాడు. బుధవారం సాయంత్రం కూడా అలాగే బయటకు వెళ్లాడు. అర్ధరాత్రి తిరిగొచ్చిన అతడు.. అందరూ నిద్రిస్తున్న సమయంలో ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుని మృతిచెందాడు. అలికిడి విన్న కుటుంబీకులు కిందకు దింపి ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడు తండ్రి ఫిర్యాదుతో గ్రామీణం ఎస్సై శ్రీనివాస్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

బ్లేడుతో గొంతు కోసుకుని..: మధిర గ్రామీణం, న్యూస్‌టుడే: వంగవీడు గ్రామానికి చెందిన యనమల రాజశేఖర్‌రెడ్డి(28) గతంలో ఓ కేసులో నిందితుడిగా ఉన్నాడు. ఆ మనస్తాపంతో గురువారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో బ్లేడుతో గొంతు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీధర్‌ తెలిపారు.

రాజశేఖర్‌రెడ్డి

పరీక్షల్లో ఫెయిలయ్యానన్న మనస్తాపంతో..: చింతకాని, న్యూస్‌టుడే: పరీక్షల్లో ఫెయిలయ్యానన్న మనస్తాపంలో చింతకాని మండలం నామవరంలో దేవిశెట్టి శిరీష(19) ఆత్మహత్యకు పాల్పడింది. శిరీష ఖమ్మంలోని ఓ ప్రైవేటు కళాశాల్లో డిగ్రీ చదివింది. ఇటీవల మూడో ఏడాది ఫలితాలు వెలువడగా ఫెయిలయింది. ఆ మనస్తాపంతో ఈనెల 6న ఉరి వేసుకొని ఆత్మహత్యకు యత్నించింది. కుటుంబీకులు ఆమెను ఖమ్మంలోని ప్రైవేటు వైద్యశాలకు తరలించి చికిత్స చేయిస్తున్నారు. గురువారం హైదరాబాద్‌ వైద్యశాలకు తరలిస్తుండగా మృతి చెందింది. ఎస్సై వెంకన్న కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


వడదెబ్బతో వ్యక్తి మృతి

కారేపల్లి, న్యూస్‌టుడే: వడదెబ్బకు వ్యక్తి మృతి చెందిన సంఘటన కారేపల్లి మండలంలో గురువారం చోటుచేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు ఇందిరానగర్‌కాలనీకి చెందిన జనపా వెంకటరమణ(38)కు కొన్నేళ్ల క్రితం పెళ్లైంది. ప్రస్తుతం భార్యభర్తలు కలిసి ఉండటం లేదు. ఈ క్రమంలో వెంకటరమణ మానసిక పరిస్థితి బాగాలేక పలు ప్రాంతాల్లో తిరుగుతూ ఉన్నారు. ఖమ్మంలో ఉంటున్న సోదరి ఇంటికి వెళ్లి అక్కడి నుంచి చెప్పకుండా రెండు రోజుల క్రితం కారేపల్లి మండలం ఉసిరికాయలపల్లి పరిసర ప్రాంతంలో తిరుగుతున్నాడు. అక్కడ నీళ్లు తాగుతూ తిరుగుతున్న క్రమంలో ఓ రైతు చేనులో ఎండ తీవ్రతకు తట్టుకోలేక విగత జీవిగా పడి మృతి చెందాడు. ఎస్సై రామారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని