logo

విజిటింగ్‌ వీసాలతో దళారుల మోసం

వారంతా నిరుపేదలు. విదేశాలకు వెళ్లి పనిచేస్తే డబ్బు సంపాదించవచ్చునని ఆశపడ్డారు. దళారులను ఆశ్రయించి అధికంగా నగదు చెల్లించి సింగపూర్‌ వెళ్లారు.

Published : 09 Jun 2023 02:59 IST

సింగపూర్‌లో ఇబ్బందులు పడుతున్న ఎర్రుపాలెం మండల వాసులు

ఎర్రుపాలెం: వారంతా నిరుపేదలు. విదేశాలకు వెళ్లి పనిచేస్తే డబ్బు సంపాదించవచ్చునని ఆశపడ్డారు. దళారులను ఆశ్రయించి అధికంగా నగదు చెల్లించి సింగపూర్‌ వెళ్లారు. అక్కడ తక్కువ వేతనానికి పనిచేసి మోసపోయి ఇండియన్‌ ఎంబసీలో ఆశ్రయం పొందుతూ.. స్వగ్రామానికి వచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సాయం కోరుతున్నారు. బాధిత కుటుంబ  సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎర్రుపాలెం మండలం రాజుపాలెం, నారాయణపురం, జమలాపురం గ్రామాలకు చెందిన 19 మంది (12 మంది మహిళలు, ఏడుగురు పురుషులు) నూజివీడు, హైదరాబాద్‌కు చెందిన దళారుల ద్వారా 2022 డిసెంబరు 17న సింగపూర్‌ బయల్దేరారు. వెళ్లిన వారిలో ఓరుగంటి రుక్మిణి, ఇమ్మడి చిన్నరాధమ్మ, స్వర్ణ రాజమ్మ, మామిడి సుశీల, గుమ్మళ్ల శ్రీను, గుమ్మళ్ల రామారావు, స్వర్ణ నాగేశ్వరరావు, స్వర్ణ నాగమణి, స్వర్ణ తిరుపతిరావు తదితరులు ఉన్నారు.

భారత ఎంబసీలో ఆశ్రయం.. అధికంగా వేతనం ఇప్పిస్తామని చెప్పిన దళారులు ఒక్కొక్కరి నుంచి రూ.1.90 లక్షల నుంచి. 2.75 లక్షల వరకు తీసుకున్నారు. కొందరిని విమానం ద్వారా, కొందరిని ఓడల ద్వారా కౌలాలంపూర్‌ చేర్చారు. అక్కడి హోటళ్లలో స్వీపింగ్‌, క్లీనింగ్‌ పనులు చేయించారు. రోజుకు రూ.1,000 వేతనం ఇచ్చి అందులో కొంత కమీషన్‌ తీసుకున్నారు. వీరికి ముందుగా విజిటింగ్‌ వీసా ఇచ్చి, రెండు నెలల్లో వర్కింగ్‌ వీసా ఇస్తామని నమ్మబలికారు. వేతనాలు తిండి ఖర్చులకే సరిపోవటంతో ఎర్రుపాలెం మండల వాసులు దళారులను సంప్రదించారు. ఆరు నెలలు కావడంతో స్వదేశానికి తిరిగి వెళ్లేలా వీసాలు ఇప్పించాలని కోరటంతో నేడు, రేపు అంటూ దళారులు నాన్చటంతో కౌలాలంపూర్‌లో తెలుగు సంఘాలను ఆశ్రయించారు. వారి ద్వారా ఇండియన్‌ ఎంబసీలో ఆశ్రయం పొందుతున్నారు. తాము స్వదేశానికి రావాలంటే ఒకొక్కరికి రూ. 60వేలు అవసరమవుతాయని బంధువులకు తెలిపారు. న్యాయం చేయాలంటూ స్థానిక పోలీసులను బాధిత కుటుంబ సభ్యులు ఆశ్రయించారు. స్వర్ణ వెంకటనారాయణ ఫిర్యాదు మేరకు దళారులు మందపాటి నాగబాబు, పొదిళ్ల దశరథనాయుడుపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై ఎం.సురేష్‌ తెలిపారు.

అధిక వేతనం ఇస్తారనే ఆశతో అప్పుచేసి మా అమ్మ ఓరుగంటి రుక్మిణి, బంధువులు సింగపూర్‌ వెళ్లారు. విజిటింగ్‌ వీసాలు ఇచ్చి దళారులు మోసగించారు. తిరిగి వచ్చేందుకు వారి వద్ద డబ్బు లేదు. ప్రభుత్వం స్పందించి స్వదేశానికి వచ్చేలా చూడాలి.

ఓరుగంటి వెంకటకృష్ణ, రాజుపాలెం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని