logo

అబ్కారీ బండి.. అంతేనండి..!

ఆబ్కారీశాఖ అధికారుల విధులు చాలావరకు బయటే ఉంటాయి. నాటుసారా, గంజాయి అక్రమ రవాణాను అడ్డుకోవడం, నిందితులపై కేసులు పెట్టి జైలుకు పంపడం వంటి విధులే ఎక్కువ.

Published : 27 Sep 2023 04:36 IST

అద్దె వాహనాలు

ఖమ్మం సారథినగర్‌, న్యూస్‌టుడే: ఆబ్కారీశాఖ అధికారుల విధులు చాలావరకు బయటే ఉంటాయి. నాటుసారా, గంజాయి అక్రమ రవాణాను అడ్డుకోవడం, నిందితులపై కేసులు పెట్టి జైలుకు పంపడం వంటి విధులే ఎక్కువ. ఇలాంటి శాఖకు చెందిన వాహనాలు కదల్లేని పరిస్థితి ఉంటే ఎలా.. ఇక అధికారులు ఏం పనిచేస్తున్నట్టు అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పరిస్థితి అచ్చం అలానే ఉంది. అన్నీ కిరాయి వాహనాలే. వీటికీ 21 నెలలుగా అద్దె నిధులు రావడం లేదు. మరి వాహనాలు ఎలా నడుస్తున్నాయి అంటే ఏదో అలా ఉన్నాయనే సమాధానం వస్తోంది. ఈప్రభావం  శాఖ పనితీరునే ప్రశ్నించే దశకు చేరిందనే విమర్శలున్నాయి.

ఆబ్కారీ శాఖలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు ఉప కమిషనర్‌, సహాయ కమిషనర్‌.. ఖమ్మం జిల్లాలో 7 స్టేషన్లు, భద్రాద్రి జిల్లాలో 6 సర్కిల్‌ స్టేషన్లు ఉన్నాయి. ఉభయ జిల్లాల్లో రెండు టాస్క్‌ఫోర్స్‌ విభాగాలు, పర్యవేక్షించే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగాలకు వాహనాలు ఉన్నాయి. ఓనర్‌ కం డ్రైవర్‌తో కూడిన పద్ధతిలో ఒక్కో వాహనానికి నెలకు రూ.33వేల అద్దెను ప్రభుత్వం చెల్లిస్తోంది. వీటి బకాయిలు 21 నెలలుగా రావడం లేదు. ఈ ప్రభావం శాఖ   కార్యకలాపాలపై పడుతోంది. అద్దెలు రావడం లేదని వాహనదారులు లబోదిబోమంటుంటే.. వీరి పరిస్థితి గమనించిన అధికారులు వాహనాలను ఆశించిన రీతిలో వాడుకోలేకపోతున్నారు.

వాహనానికో కథ

మొత్తంగా పరిస్థితి ఇలా ఉంటే శాఖలో కొనసాగుతున్న అద్దె వాహనాల్లో ఒక్కో వాహనం కథ ఒక్కో రీతిలో ఉంది. మొత్తం 23 వాహనాల్లో సగం ఉద్యోగుల బంధువులు, దగ్గరి వారి పేర్లతో ఉన్నట్టు సమాచారం. కొన్నిచోట్ల వాహన బాధ్యులే పెట్టుబడి పెట్టి నడిపిస్తున్నట్టు సమాచారం. మరికొన్నిచోట్ల స్టేషన్‌ అధికారి డీజిల్‌ ఖర్చులు భరించి బిల్లులు వచ్చాక తిరిగి తీసుకునే ఒప్పందంలో బండ్లు నడుస్తున్నాయి. ఇలాంటి విషయాల్లో అంటీముట్టనట్టుగా ఉంటున్న అధికారులు వాహనాలకు పని చెప్పడం లేదు.

వాహనాల బకాయిలు పెండింగ్‌లో ఉన్న మాట వాస్తవమే. వాటికి, శాఖ పనితీరుకు ఎలాంటి సంబంధం లేదు. చాలావరకు వాహన యజమానులు డ్రైవర్లను నియమించుకొని కొనసాగిస్తున్నారు. రావాల్సిన మొత్తం ఆలస్యం అయితే ఎవరికైనా ఇబ్బందులు ఉంటాయి. ఇక్కడా అదే పరిస్థితి. కొంత ఆలస్యంగానైనా డబ్బులు వస్తాయని వారికీ తెలుసు. సకాలంలో బిల్లులు అందించేందుకు ప్రయత్నిస్తున్నాం.

నాగేంద్రరెడ్డి, జిల్లా ఆబ్కారీ అధికారి, ఖమ్మం

గంజాయి కేసులే...

ఉభయ జిల్లాల్లో అందిన సమాచారం మేరకు అక్రమ ముఠాలపై దాడి చేసి పట్టుకునే బాధ్యత రెండు టాస్క్‌ఫోర్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగాలది. ఈ బృందాలు ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో కలియదిరగాలి. తనిఖీలకు బయలుదేరినప్పుడు అక్కడి మద్యం దుకాణాలు వంతులవారీగా డీజిల్‌ పోయించే బాధ్యత తీసుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ బృందాలు మద్యం దుకాణాల వైపు కన్నెత్తి చూడటం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పట్టుకుంటే గంజాయి కేసులే అనే రీతిలో ఈ బృందాలు కొనసాగుతున్నాయని నమోదవుతున్న కేసుల తీరు  స్పష్టం చేస్తోంది.

సంచార బృందాలదీ ఇదే తీరు

ఉభయ జిల్లాలకు రెండు సంచార తనిఖీ విభాగాలను ప్రభుత్వం ఏడాది క్రితం మంజూరు చేసింది. ఇందుకు మరో రెండు వాహనాలు కావాలి. ఉన్నవాటి పరిస్థితే అంతంతమాత్రం కావటంతో కొత్తగా మరో రెండింటిని చేర్చేందుకు  అధికారులు ఆసక్తి చూపటం లేదనే వాదనలు వ్యక్తమ వుతున్నాయి. ఉన్నత స్థాయి నుంచి తగిన ఉత్తర్వులు వచ్చాక ప్రారంభిస్తామని ఇక్కడి అధికారులు చేతులు దులుపుకొన్నారు. ఏడాది క్రితం మంజూరైన సంచార తనిఖీ వ్యవస్థ ఉభయ జిల్లాల్లో ఏర్పాటుకు నోచుకోలేదు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే ఎన్నికలు వస్తే రెండింతలు పని ఉంటుంది. అప్పుడు పరిస్థితి ఎలా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని