logo

వినాయకుడికి వీడ్కోలు పలకాలిలా..

నవరాత్రులు వైభవంగా పూజలందుకున్న విఘ్నేశ్వరుడి విగ్రహాలు గంగమ్మ ఒడిని చేరే సమయం ఆసన్నమైంది. నిమజ్జనోత్సవాన్ని బుధ, గురువారాల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Published : 27 Sep 2023 04:36 IST

నిమజ్జన క్రతువులో స్వీయరక్షణే ముఖ్యం

ఖమ్మం: మున్నేరు వద్ద ల్యాడర్‌ సాయంతో విద్యుద్దీపాలను అమర్చుతున్న సిబ్బంది

ఖమ్మం నేరవిభాగం, ఖమ్మం సాంస్కృతికం, న్యూస్‌టుడే: నవరాత్రులు వైభవంగా పూజలందుకున్న విఘ్నేశ్వరుడి విగ్రహాలు గంగమ్మ ఒడిని చేరే సమయం ఆసన్నమైంది. నిమజ్జనోత్సవాన్ని బుధ, గురువారాల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. విగ్రహాల నిమజ్జన సమయంలో భక్తులు స్వీయ జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.

పెరిగిన విగ్రహాల సంఖ్య: కొవిడ్‌ ప్రభావంతో మూడేళ్లుగా గణేశ్‌ నవరాత్రి ఉత్సవాల కళ తగ్గింది. ఈ ఏడాది భారీగా విగ్రహాలు నెలకొల్పి వేడుకలు నిర్వహిస్తున్నారు. పల్లె, పట్నం తేడా లేకుండా వీధివీధినా మండపాలను ఏర్పాటు చేసి పూజలు జరుపుతున్నారు. పట్టణాల్లోని బహుళ అంతస్తు భవనాల్లోనూ సొంతంగా విగ్రహాలను ఏర్పాటుచేసుకున్నారు. ఖమ్మం నగరంలో సుమారు 1,000, కొత్తగూడెంలో 500, భద్రాచలంలో 300, పాల్వంచలో 200 విగ్రహాలు కొలువైనట్లు సమాచారం. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో సుమారు 3,833 చిన్ననీటి వనరులున్నాయి. ఖమ్మం నగర శివార్లలో మున్నేరుతోపాటు జిల్లాలో సాగర్‌ ప్రధాన కాల్వ, వైరా నది, పాలేరు, వైరా చెరువులున్నాయి. భద్రాద్రి జిల్లాలో గోదావరి నది, కిన్నెరసానితోపాటు, వివిధ వాగులు, చెరువులున్నాయి. గోదావరి, మున్నేరుతోపాటు ప్రధానమైన చెరువుల్లో ఎక్కువగా గణనాథులను నిమజ్జనం చేస్తారు.
పటిష్ఠ రక్షణ చర్యలు: నిమజ్జన పాయింట్ల వద్ద అధికారులు పటిష్ఠ రక్షణ చర్యలు చేపట్టనున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా లైటింగ్‌, క్రేన్లు, రిలీజింగ్‌ క్లాంపులు, సమాచారం తెలియజేసేలా మైకులు, బోట్లు, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచుతున్నారు. ఖమ్మంలో గాంధీచౌక్‌ వద్ద స్తంభాద్రి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో సామూహిక గణేశ్‌ నిమజ్జన శోభాయాత్రను బుధవారం మధ్యాహ్నం 3:30 గంటలకు మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథిరెడ్డి, కలెక్టర్‌ గౌతమ్‌, సీపీ విష్ణు వారియర్‌ ప్రారంభించనున్నారు.

భక్తులకు సూచనలు

  • మండపాల నుంచి మధ్యాహ్నం 12 గంటలలోపు విగ్రహాలను తరలించాలి.
  • విగ్రహాలను మండపం నుంచి తీసే సమయంకన్నా ముందే విద్యుత్తు సౌకర్యాన్ని తొలగించాలి.
  • విగ్రహాలను తరలించే సమయంలో పైన అడ్డొచ్చిన విద్యుత్తు తీగలను చేతితో తొలగించరాదు.
  • విద్యుత్తు తీగలతో సమస్య ఉంటే కంట్రోల్‌ రూం నంబర్‌ 94408 11525 కు సమాచారం అందిస్తే పరిష్కరిస్తారు.
  • లోతు, నీటి ప్రవాహ ఉద్ధృతి తక్కువగా ఉండే ప్రాంతంలో విగ్రహాలను నిమజ్జనం చేయాలి.
  • నీటి వనరుల్లోకి ఎక్కువ మంది కాకుండా ఈత సక్రమంగా వచ్చిన కొందరే వెళ్లాలి.
  • పెద్ద విగ్రహాలు నిమజ్జనం చేసే సమయంలో వాటి కింద, ముందు, వెనుక వైపు భాగాల్లో ఎవరూ ఉండొద్దు.
  • పిల్లలు, మహిళలను నిమజ్జన ప్రాంతానికి తీసుకువెళ్లకపోవటమే ఉత్తమం.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు