logo

కొనసాగుతున్న అక్రమాల పరంపర

జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ) శాఖల్లో అక్రమాల పరంపర కొనసాగుతోంది. భద్రాద్రి జిల్లా అన్నపురెడ్డిపల్లి బ్రాంచిలో ‘ముద్ర’ రుణాల పంపిణీలో అక్రమాలకు పాల్పడినందుకు మేనేజర్‌ను రెండు రోజుల క్రితం సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే.

Published : 27 Sep 2023 04:36 IST

మరో మూడు బ్యాంకుల్లోనూ స్వాహాలు
ములకలపల్లి బ్రాంచి మేనేజర్‌ కిశోర్‌ సస్పెన్షన్‌

ఖమ్మం వ్యవసాయం, న్యూస్‌టుడే: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ) శాఖల్లో అక్రమాల పరంపర కొనసాగుతోంది. భద్రాద్రి జిల్లా అన్నపురెడ్డిపల్లి బ్రాంచిలో ‘ముద్ర’ రుణాల పంపిణీలో అక్రమాలకు పాల్పడినందుకు మేనేజర్‌ను రెండు రోజుల క్రితం సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే. ములకలపల్లి బ్రాంచి మేనేజర్‌ కిశోర్‌ను కూడా ముద్ర, ఇతర రుణాలు, పలు రకాల అక్రమాలకు పాల్పడినందుకు   డీసీసీబీ ఛైర్మన్‌ కూరాకుల నాగభూషయ్య మంగళవారం సస్పెండ్‌ చేశారు. టేకులపల్లి, మర్లపాడు బ్రాంచిల్లో అక్రమాలపై అధికారులు విచారణ చేస్తున్నారు.

ములకలపల్లిలో భారీగా అవకతవకలు: ములకలపల్లి బ్రాంచిలో అక్రమాలకు సంబంధించి అక్కడ సొసైటీ డైరెక్టర్లు, ఇతర ప్రజాప్రతినిధులు ఆరు నెలల క్రితం డీసీసీబీకి ఫిర్యాదు చేశారు. డీజీఎం ఆర్‌.ఉపేందర్‌, ఏజీఎం అజయ్‌రెడ్డిని విచారణ అధికారులుగా బ్యాంకు పాలకవర్గం నియమించింది. విచారణలో వివిధ రకాల అక్రమాలు వెలుగుచూశాయి. బ్యాంకు మేనేజర్‌, బిజినెస్‌ కరస్పాండెంట్‌, సిబ్బంది ప్రమేయం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. బ్యాంకు సిబ్బందితో పాటు అనర్హులకు విరివిగా ముద్ర రుణాలను మంజూరు చేసినట్లు తేల్చారు. అనర్హుల పేరిట మంజూరు చేసి సుమారు రూ.కోటి వరకు వీరే కాజేసినట్లు సమాచారం. సహకార సంఘాల రైతులు చెల్లించిన రుణాలను పెద్దఎత్తున స్వాహా చేసినట్లు అధికారులు గుర్తించారు. బినామీ పేరుతో పెట్రోలు బంకు ఏర్పాటు, ఇందుకు అవసరమైన స్థల సేకరణ తదితర అంశాల్లో మేనేజర్‌ వ్యవహార శైలిపై డీసీసీబీ సీరియస్‌గా ఉంది. బ్యాంకు మేనేజర్‌ను సస్పెండ్‌ చేసి ఇక్కడే అసిస్టెంట్‌ మేనేజర్‌గా పనిచేస్తున్న భూక్యా రవికి ఇన్‌ఛార్జి మేనేజర్‌ బాధ్యతలు అప్పగించింది.

టేకులపల్లి, మర్లపాడులో కొనసాగుతున్న విచారణ... టేకులపల్లి, మర్లపాడు బ్రాంచిల్లో అక్రమాలపై డీసీసీబీకి ఫిర్యాదులు అందాయి. వీటిపై స్థానిక నోడల్‌ అధికారులను విచారణ అధికారులుగా నియమించారు. ప్రస్తుతం ఈ రెండు బ్రాంచిల్లో  అధికారులు విచారణ చేస్తున్నారు. ఒకట్రెండు రోజుల్లో అక్రమాలపై విచారణ అధికారులు  డీసీసీబీకి నివేదిక అందించనున్నారు. ఫిర్యాదుల నేపథ్యంలో కొంతకాలం నుంచి ఉన్నతాధికారులు పలుమార్లు హెచ్చరిస్తున్నప్పటికీ మేనేజర్లలో మార్పు రాకపోవడం, ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో ఇప్పుడు వారిపై చర్యలు తీసుకుంటున్నారు. ఇలా ఇతర కొన్ని బ్యాంకుల్లో సైతం ముద్ర రుణాలు, ఇతర రుణాల పంపిణీ విషయంలో అక్రమాలు చోటు చేసుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై డీసీసీబీ సీఈఓ అట్లూరి వీరబాబు ‘న్యూస్‌టుడే’తో మాట్లాడుతూ అక్రమాలకు పాల్పడిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని