logo

పర్యాటక అభివృద్ధే శ్రీరామరక్ష..!

భద్రాచలం పరిసరాలు ఆధ్యాత్మికంగాను, పర్యాటకంగాను భక్తులను ఎంతో ఆకట్టుకుంటున్నాయి. పలు సుందర ప్రాంతాలు ఇట్టే కట్టిపడేస్తున్నాయి.

Published : 27 Sep 2023 04:36 IST

నేడు పర్యాటక దినోత్సవం

రామాలయం అభివృద్ధి నమూనా

భద్రాచలం, న్యూస్‌టుడే: భద్రాచలం పరిసరాలు ఆధ్యాత్మికంగాను, పర్యాటకంగాను భక్తులను ఎంతో ఆకట్టుకుంటున్నాయి. పలు సుందర ప్రాంతాలు ఇట్టే కట్టిపడేస్తున్నాయి. దైవ దర్శనాలు ఒక వైపు మనసుకు ప్రశాంతతను అందిస్తుండగా చూడచక్కని రమణీయ ప్రదేశాలు అంతులేని ఆనందాన్ని పంచుతున్నాయి. ఈ ప్రాంతంలో చేయాల్సిన అభివృద్ధి పనులే పర్యాటకానికి శ్రీరామ రక్ష. ప్రతిపాదనల్లో ఉన్న పనులన్నీ పూర్తయితే యాత్రికులకు ఇదో ఆనందధామంగా విరాజిల్లనుంది.

ఆధ్యాత్మికత ఆహ్లాదం..

భద్రాచలంలో రామయ్యను దర్శించుకుని గోదావరిలో బోట్‌ షికార్‌ చేస్తే ఆ ఆనందమే వేరు. ప్రభుత్వం ప్రకటించిన నిధులు వస్తే ఆధ్యాత్మిక వైభవం వెల్లివిరియడం ఖాయంగా కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం దేశంలోని ఆరు రాష్ట్రాల్లో 11 ప్రాంతాలను కలుపుతూ రామాయణ వలయాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో భద్రాచలం పేరు ఉంది. దీనికి సంబంధించిన ప్రత్యేక రైలునూ ప్రారంభించారు. ఇది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వెళ్తుందో ప్రచారం చేస్తే భక్తులకు ఉపయుక్తంగా ఉంటుంది. గోదావరి కరకట్టను సుందరంగా తీర్చిదిద్దితే పర్యాటకులను ఆకట్టుకునేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.

  • ఒడిశా నుంచి భద్రాచలం మీదుగా బూర్గంపాడు మండలం పాండురంగాపురం వరకు కొత్త రైల్వే లైను పనులకు సర్వేలు చేపట్టారు. ఇది అందుబాటులోకి వస్తే భక్తుల సంఖ్య గణనీయంగా పెరగనుంది. పాపికొండల యాత్ర ప్రస్తుతం ఆగినా గోదావరిపై ఈ ప్రయాణం చేస్తే జీవితాంతం గుర్తిండిపోయే మధురానుభూతులను మిగుల్చుతుంది. భద్రాచలం నుంచి 120 కి.మీ. దూరంలో ములుగు జిల్లా వాజేడు మండలంలో ఉన్న బొగత జలపాతం ప్రత్యేకతే వేరు. దీన్ని తెలంగాణ నయాగరాగానూ పలువురు అభివర్ణిస్తున్నారు.

సందర్శనీయం.. సంతోషకరం

  • దుమ్ముగూడెం మండలం పర్ణశాల దర్శనం ఎంతో పవిత్రం. సీతాదేవిని రావణాసురుడు అపహరించిన ప్రాంతమిది. సీతమ్మవారి నార చీరల చారలు ఇప్పటికీ కనిపిస్తాయి. రామాయణంలోని ముఖ్య ఘట్టాలకు వేదిక ఇది. భద్రాచలం నుంచి 35 కి.మీ దూరంలో ఉంది.
  • కాకతీయుల కాలంలో 600 సంవత్సరాల కిందట నిర్మించిన బూర్గంపాడు మండలం మోతెగడ్డ దివ్యక్షేత్రం ఎంతో పవిత్రమైనది. భద్రకాళీ సమేత వీరభద్రుడు కొలువైన ఈ క్షేత్రాన్ని శివరాత్రికి వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు.
  • సీతాదేవిని రావణుడు అపహరించుకుని తీసుకెళుతున్న సమయంలో జటాయు అనే పక్షి అడ్డుకుని భీకర పోరు చేస్తుంది. ఈ సమయంలో పక్షి రెక్క తెగిన ప్రాంతమే కాలక్రమంగా ఎటపాకగా మారందని ప్రతీతి. ఇది దర్శనీయ ప్రదేశంగా గుర్తింపు పొందింది.
  • వనవాసం సమయంలో ప్రయాణ బడిలికతో ఉన్న సీతమ్మవారు స్నానం చేసేందుకు నీళ్లు అవసరమయ్యాయి. ఇందుకు రాముడు బాణం వదిలిన ప్రాంతం నుంచి వేడి నీళ్లు బయటకు వస్తాయి. ఈ ప్రాంతమే ఉష్ణ గుండాల అని పౌరాణిక గాథ. భద్రాచలానికి
  • 6 కి.మీ దూరంలో ఉంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని