logo

ముప్పు ఎరగక.. అప్పు తీరక..

ప్రభుత్వం రైతులకు రుణమాఫీ మంజూరు చేసి రెణ్నెల్లు కావస్తోంది. జిల్లాలో ఈ పథకం కింద 1,38,187 మంది రుణాలు పొందారు. వీరిలో ఇప్పటివరకు 58,422 మందికి రూ.243.85 కోట్లు మాఫీ అయినట్లు అధికారులు వెల్లడించారు.

Published : 27 Sep 2023 04:36 IST

కొత్తగూడెంలోని ఓ బ్యాంక్‌లో రుణాలు పొందేందుకు వేచిఉన్న గిరిజన రైతులు

కొత్తగూడెం వ్యవసాయం, న్యూస్‌టుడే: ప్రభుత్వం రైతులకు రుణమాఫీ మంజూరు చేసి రెణ్నెల్లు కావస్తోంది. జిల్లాలో ఈ పథకం కింద 1,38,187 మంది రుణాలు పొందారు. వీరిలో ఇప్పటివరకు 58,422 మందికి రూ.243.85 కోట్లు మాఫీ అయినట్లు అధికారులు వెల్లడించారు. అనంతరం 15,363 మంది రెన్యువల్‌ చేసుకుని రూ.98.96 కోట్ల కొత్త రుణాలు పొందారు. రుణమాఫీ జరిగిన లబ్ధిదారుల్లో ఇది కేవలం 41 శాతం మాత్రమే. అర్హులందరికీ కొత్త రుణాలివ్వాలని ఈనెల 23న బ్యాంకర్లు, వ్యవసాయశాఖ అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో కలెక్టర్‌ ప్రియాంక సూచించారు.  

రెండు దఫాలు..

2018 డిసెంబరు 11 నాటికి రుణాలు పొందిన రైతులకు ప్రభుత్వం మాఫీ వర్తింపజేసింది. తొలివిడత   రూ.25వేలలోపు వారికి, అంటే 54,036 మందికి రూ.212.46 కోట్ల రుణమాఫీ నిధులు విడుదలయ్యాయి. తర్వాత రూ.50వేల నుంచి రూ.99 వేల లోపు రుణాలున్న 24,982 మందికి రూ.149.31 కోట్లు మంజూరయ్యాయి.

జాప్యానికి కారణాలు ఇవే..

ఖాతాల నిర్వహణ సరిగా లేక డీఫాల్ట్‌ కావడం, కొన్ని బ్యాంకులు విలీనమవడం, ఇతర కారణాలతో రుణమాఫీ ప్రక్రియ జాప్యమవుతోంది. ఫలితంగా కొత్త రుణాలివ్వడంలో ఆలస్యం జరుగుతోంది. వడ్డీ భారం, రిజిస్ట్రేషన్‌ (పార్టిషన్‌, సేల్‌, గిఫ్ట్‌డీడ్‌ మొ.వి.) అవసరాల కోసం కొందరు మాఫీకి ముందే రుణాలు చెల్లించారు. తమ లోను ఖాతాలు మూసేసుకున్నారు. అయినా వీరు మాఫీకి అర్హులే. దీంతో పాటు కొన్ని బ్యాంక్‌లు విలీనం అయ్యాయి. మరికొందరు 2018కి ముందు పాత పట్టాదారు పాసు పుస్తకాలు దరఖాస్తుకు జతచేశారు. ఆయా వివరాలు ‘ధరణి’ వివరాలతో సరిపోలడం లేదు. కొందరి విషయంలో విస్తీర్ణం, గ్రామాల పేర్లు తప్పుగా నమోదయ్యాయి. రుణానికి వడ్డీ తోడై అప్పు రెండింతలు కావడం, మిగతా మొత్తం చెల్లించాల్సి ఉంటుందనే కారణంతో కొందరు బ్యాంకుల వైపే వెళ్లడం లేదు. ఒకే ఆధార్‌తో వేర్వేరు బ్యాంకుల్లో ఖాతాలు తెరిచిన వారూ ఉన్నారు. లోను ఖాతాకు ఆధార్‌ అనుసంధానం కాకపోవడం, మృతిచెందిన వారివి రద్దు కావడంతో ఇంకొందరికి నిధులు పెండింగ్‌లో పడ్డాయి. ఈ కారణాలతో కొత్తగా రుణాలిచ్చేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బ్యాంకర్లు, రెవెన్యూ అధికారులు సమన్వయంతో  సమస్యలు పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు.

రుణమాఫీ నిధులు మంజూరై.. ఖాతాల్లో జమకాని వారి వివరాలను బ్యాంకర్ల నుంచి సేకరిస్తున్నాం. కలెక్టర్‌ ఆదేశాలతో వ్యవసాయ శాఖ, బ్యాంకుల అధికారులు క్లస్టర్ల వారీగా గ్రామాలకు వెళ్లి రైతు వేదికల్లో సమావేశాలు నిర్వహిస్తున్నారు. రుణమాఫీ ఎందుకు జాప్యమవుతోంది? పరిష్కారాలేమిటో వివరిస్తున్నారు. అనంతరం రెన్యువల్‌ చేసుకొనేలా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.

అభిమన్యుడు, జిల్లా వ్యవసాయాధికారి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని