logo

ఓట్ల వేటలో.. వ్యూహరచనలో..

ఖమ్మం జిల్లాలోని ఓ జనరల్‌ నియోజకవర్గంలో ఓ పార్టీ అభ్యర్థి ‘పోల్‌ స్ట్రాటజీ గ్రూప్‌’ అనే యాప్‌లో పోలింగ్‌ కేంద్రాల వారీగా ఓటర్లను నాలుగు విభాగాలు(రంగులు)గా విభజిస్తున్నారు. అనుకూలురు(గ్రీన్‌), తటస్థులు (ఎల్లో), స్థానికంగా ఓటుహక్కు కలిగి ఇతరచోట్ల నివసిస్తున్నవారు (బ్లూ), ఇతర పార్టీల మద్దతుదారులు (రెడ్‌)గా పరిగణిస్తున్నారు.

Updated : 21 Nov 2023 06:14 IST
 

ఎత్తుగడలతో ప్రత్యర్థులకు దడ

ఖమ్మం జిల్లాలోని ఓ జనరల్‌ నియోజకవర్గంలో ఓ పార్టీ అభ్యర్థి ‘పోల్‌ స్ట్రాటజీ గ్రూప్‌’ అనే యాప్‌లో పోలింగ్‌ కేంద్రాల వారీగా ఓటర్లను నాలుగు విభాగాలు(రంగులు)గా విభజిస్తున్నారు. అనుకూలురు(గ్రీన్‌), తటస్థులు (ఎల్లో), స్థానికంగా ఓటుహక్కు కలిగి ఇతరచోట్ల నివసిస్తున్నవారు (బ్లూ), ఇతర పార్టీల మద్దతుదారులు (రెడ్‌)గా పరిగణిస్తున్నారు. మరోపార్టీ అభ్యర్థి సైతం ఇలాంటి విధానమే అవలంబిస్తున్నారు. ఓటర్లను ‘పోల్‌ మేనేజ్‌మెంట్‌’ అనే యాప్‌లో మూడు విభాగాలు (ఏ, బీ, సీ)గా వర్గీకరిస్తున్నారు. తనకు పక్కాగా ఓటేసేవారు (ఏ), తటస్థులు (బీ), ఇతర పార్టీల మద్దతుదారులను (సీ)లో చేర్చి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఖమ్మం జిల్లాలోని మరో జనరల్‌ నియోజకవర్గంలో పరిస్థితి విచిత్రంగా ఉంది. ప్రధాన పార్టీల అభ్యర్థులిద్దరూ సాయంత్రం వరకు ప్రచారం ముగించి.. ముఖ్య అనుచరులు, నాయకులు తమవైపే ఉన్నారా లేదా అని సమీక్షించుకుంటున్నారు. ప్రత్యర్థుల తాయిలాల వలకు చిక్కకుండా అప్రమత్తమవుతున్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఓ నియోజకవర్గంలో త్రిముఖపోరు నెలకొంది. పోలింగ్‌ గడువు సమీపిస్తున్నకొద్దీ అభ్యర్థులకు ముచ్చెమటలు పడుతున్నాయి. తమ పరిస్థితి ఏంటనే అంశంపై తర్జనభర్జనలకే సమయం సరిపోతుందని ఆందోళన చెందుతున్నారు. ఓటర్లకు దగ్గరయ్యేందుకు ఆత్మీయ పలకరింపులకు పూనుకుంటున్నారు. వయస్సు, సామాజిక వర్గాలుగా ఓటర్లను విభజించి వారిని ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నారు.

వైరా, నేలకొండపల్లి, న్యూస్‌టుడే : శాసనసభ  ఎన్నికల సమరం జోరందుకుంది. పోలింగ్‌కు తొమ్మిది రోజుల గడువు ఉండటంతో విజయ సాధనకు అభ్యర్థులు చెమటోడ్చుతున్నారు. పోలింగ్‌ ముగిసే వరకూ తమవైపు అనుకూల పవనాలు వీచేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈక్రమంలో ఓటర్లను ఆకర్షించటంతో పాటు ప్రత్యర్థి శిబిరం నుంచి ముప్పు తప్పించుకునేందుకు వ్యూహప్రతివ్యూహాలు రచిస్తున్నారు.

పోల్‌ మేనేజ్‌మెంట్‌పై దృష్టి

ఓ ప్రధాన పార్టీ అభ్యర్థి ప్రచారమెలా సాగుతున్నా చివరి మూడు రోజులు పోల్‌ మేనేజ్‌మెంట్‌లో దిట్ట అనే పేరుంది. ప్రచారం ఎంత చేసినా, ప్రలోభపెట్టినా పోలింగ్‌ కేంద్రం వరకు ఓటరును తీసుకొచ్చే బాధ్యతలను ద్వితీయశ్రేణి నాయకులకు అప్పగిస్తుంటారు. ఓటేసే వరకు ఓటర్లను పలకరించేలా తన అనుచరులను పురమాయిస్తుంటారు. దూరభారంతో ఇబ్బంది పడే ఓటర్లను పోలింగ్‌ కేంద్రాలకు చేర్చేలా ప్రత్యేకంగా ఆటోలు, ఇతర వాహనాలను సమకూర్చుతుంటారు.

సంఘాలతో సమావేశాలు

వైద్యులు, ఆర్‌ఎంపీలు, మెడికల్‌, లారీ అసోసియేషన్లు, ఆటో డ్రైవర్లు, దర్జీలు, నాయీబ్రాహ్మణులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, చేతివృత్తుల సంఘాలను ప్రసన్నం చేసుకునేలా కీలక నేతలకు బాధ్యతలు అప్పగించారు. ఆయా వర్గాలతో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. కోరుకున్న వారికి ప్రత్యేక ‘పార్టీలు’ ఇస్తూ పోలింగ్‌ నాటికి అంతా చక్కబెట్టుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో పది నియోజకవర్గాలున్నాయి. అన్నిచోట్లా ఇంచుమించు ఇదే వైఖరిని ప్రధాన పార్టీల అభ్యర్థులు అనుసరిస్తున్నారు. అనుకూల ఓటర్లు చేజారకుండా జాగ్రత్తలు తీసుకుంటూనే తటస్థులు, ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్నవారిని తమవైపు తిప్పుకొనేందుకు వ్యూహరచన చేస్తున్నారు. ఇతర పార్టీల మద్దతుదారుల కదలికలపైనా నిఘా ఉంచుతున్నారు. అనుకూల ఓటర్లకు మర్యాద తగ్గకుండా చూస్తున్నారు. నియోజకవర్గం, మండలం, గ్రామస్థాయిలో ప్రాబల్యం చూపేవారి కోరికలను వెనువెంటనే తీర్చేస్తున్నారు. తటస్థ ఓటర్లు ఏం ఆశిస్తున్నారో తెలుసుకొని వారిని ఆకర్షించేందుకు ఎంత ఖర్చుకైనా వెనకాడొద్దని ప్రధాన అనుచరులకు స్పష్టంగా చెబుతున్నారు. మరోవైపు ఇతర పార్టీల మద్దతుదారులు రోజువారీగా ఎక్కడెక్కడ సంచరిస్తున్నారు?ఎవరెవరితో మాట్లాడుతున్నారు? అనే అంశాలపై ఆరాతీస్తున్నారు. అవసరమైతే అలాంటి వారిలో ఒకరిద్దరిని కోవర్టులుగా మార్చుకునేందుకూ యత్నిస్తున్నారు.

వన భోజనాలను అవకాశంగా మలచుకునేలా..

ఇప్పటికే కార్తికమాసం సందడి మొదలైంది. సామాజికవర్గాల వారీగా వనభోజనాలు ఏర్పాటు చేసుకోవటం సంప్రదాయంగా వస్తోంది. ఈసారి వీటినీ తమ విజయానికి అనుగుణంగా మలచుకోవాలని కొందరు అభ్యర్థులు యత్నిస్తున్నారు. ఈనెల 30లోపే కీలక ప్రాంతాల్లో వనభోజనాలను ముగించాలని కసరత్తు చేస్తున్నారు. ఇందుకు అయ్యే ఖర్చును భరించటానికి సిద్ధపడుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు