logo

అడుగడుగునా నిఘా

ఆందోళనలు.. ఉద్రిక్తతలు.. విధ్వంసాల సెగ చల్లారినా.. కోనసీమ జిల్లాలో ఉత్కంఠకు మాత్రం తెరపడలేదు. తాజా పరిణామాలతో వివిధ జిల్లాల పోలీసులు పెద్దఎత్తున మోహరించారు. అమలాపురం.. అన్ని మండలాల్లో పరిస్థితిపై నిఘా ఉంచారు. ప్రజాప్రతినిధులు..

Published : 26 May 2022 05:14 IST

సాంకేతికత ఆధారంగా నిశిత దర్యాప్తు 

కోనసీమ మండలాల్లో వీడని ఉత్కంఠ

ఈనాడు - అమలాపురం, న్యూస్‌టుడే- అమలాపురం పట్టణం,

గడియార స్తంభం సెంటర్, అల్లవరం, పి.గన్నవరం  

గడియార స్తంభం వద్ద బలగాల మోహరింపు

ఆందోళనలు.. ఉద్రిక్తతలు.. విధ్వంసాల సెగ చల్లారినా.. కోనసీమ జిల్లాలో ఉత్కంఠకు మాత్రం తెరపడలేదు. తాజా పరిణామాలతో వివిధ జిల్లాల పోలీసులు పెద్దఎత్తున మోహరించారు. అమలాపురం.. అన్ని మండలాల్లో పరిస్థితిపై నిఘా ఉంచారు. ప్రజాప్రతినిధులు.. ప్రభుత్వ ఆస్తులకు భద్రత పెంచారు. అదనపు డీజీ స్థాయి అధికారుల పర్యవేక్షణలో కాకినాడ, తూ.గో., ప.గో., గుంటూరు, కృష్ణా జిల్లాల ఎస్పీల సారథ్యంలో ప్రత్యేక బృందాలుగా భద్రత కట్టుదిట్టం చేసి.. అల్లర్లకు పాల్పడిన వారిని సాంకేతికత ఆధారంగా వెతికిపట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. శాంతిభద్రతల అదనపు డీజీ డాక్టర్‌ రవిశంకర్‌ అయ్యన్నార్‌ అమలాపురం పట్టణంలోని శాంతి భద్రతలను పర్యవేక్షించారు. ప్రత్యేక బలగాల అదనపు డీజీ శంకబ్రత బాగ్చి కోనసీమ కలెక్టరేట్‌ నుంచి వీడియో సమావేశంలో డీజీపీకి ఇక్కడి పరిస్థితిని వివరించారు. మంగళవారం హింసాత్మక సంఘటనల దృశ్యాలు.. అంతకు ముందు ఉద్యమ పిలుపులు సామాజిక మాధ్యమాల ద్వారా గమ్యస్థానాలకు చేరడంతో ముందస్తుగా అంతర్జాల సేవలు ఆపేశారు. దీంతో సాధారణ ప్రజలు అసౌకర్యానికి గురయ్యారు. కలెక్టర్‌ హిమాన్షుశుక్లా తన ఛాంబర్‌ నుంచి పరిస్థితిని పర్యవేక్షించారు. శాంతిభద్రతల పరిస్థితిపై పోలీసు శాఖను అప్రమత్తం చేశారు..

ఎమ్మెల్యే పొన్నాడ ఇంటి వద్ద పగిలిపోయి

పడిన (ఇంటి అలంకరణ గ్లాస్‌)గాజు ముక్కలు

విధ్వంసం ఆనవాళ్లు....

హింసాత్మక ఘటనలతో మంగళవారం ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించింది. బుధవారం ఉదయం 11 గంటల తర్వాత సాధారణ స్థితి రావడంతో కాలిన వాహనాలు, నివాసాలు చూసేందుకు నాయకులు, స్థానికులు పెద్దఎత్తున వచ్చారు. విధ్వంసకర పరిస్థితులు చూసి నివ్వెరపోయారు. కలెక్టరేట్, నల్లవంతెన, మంత్రి, ఎమ్మెల్యేల నివాసం తదితర ప్రాంతాల్లో పూర్తిగా దహనమైన వాహనాల ఆనవాళ్లు ఉన్నాయి. 

మంత్రి నివాసం వద్ద జరిగిన దాడిలో డ్వాక్రా మండల మహిళా అధ్యక్షురాలు వరలక్ష్మి నూతన వాహనం కాలిపోయింది. నెల కిందటే వాహనం కొన్నామని.. అందులో డ్వాక్రా సొమ్ము, విలువైన పత్రాలు ఉన్నాయని ఆమె వాపోయారు.

భట్నవిల్లిలో ఇంటిని పరిశీలిస్తున్న మంత్రి విశ్వరూప్‌ దంపతులు

మంత్రి, అధికారుల పరిశీలన..

ఆందోళనకారులు నిప్పు పెట్టిన మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే పొన్నాడ నివాసాలను పోలీసులు పరిశీలించారు. అగ్నికి ఆహుతైన పరికరాలు స్థానిక పరిస్థితులపై అంచనాకు వచ్చారు. తర్వాత శిథిలాల తొలగింపునకు అనుమతిచ్చారు. విశ్వరూప్‌ క్యాంపు కార్యాలయ లోపలి భాగం నామరూపాల్లేకుండా కాలిపోయింది. సీలింగ్, ఫర్నిచర్, ఇతర విలువైన గృహోపకరణాలు ధ్వంసమయ్యాయి. భట్నవిల్లి, ఎస్బీఐ కాలనీల్లో క్యాంపు కార్యాలయం, నిర్మాణంలో ఉన్న నివాసాలను మంత్రి విశ్వరూప్‌ దంపతులు పరిశీలించారు. 

కలెక్టరేట్‌ వద్ద మంగళవారం ఆహుతైన బస్సు ఇలా..

బుగ్గి అయిన ద్విచక్ర వాహనాలు ఇలా...

కొత్తగా నిర్మిస్తున్న మంత్రి ఇంటి వద్ద పరిస్థితి..

ధ్వంసమైన సీసీ కెమెరా

మంత్రి ఇంటి నుంచి ముఖ్యమైన సామగ్రి తరలింపు

పోలీసు అధికారులకు సూచనలు ఇస్తున్న ఉన్నతాధికారి విశాల్‌గున్ని

శాంతి భద్రతల వైఫల్యంపై మంత్రి అనుచరుల నినాదాలు 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని