ప్రభుత్వ పాఠశాల స్థలం అన్యాక్రాంతంపై ఫిర్యాదు
ఎ.కొండూరు: పోలిశెట్టిపాడులో పాఠశాల స్థలాన్ని
పరిశీలిస్తున్న తహసీల్దార్ వీరాంజనేయప్రసాద్
ఎ.కొండూరు, న్యూస్‌టుడే: మండలంలోని పోలిశెట్టిపాడు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల స్థలం అన్యాక్రాంతంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ వీరాంజనేయప్రసాద్‌కు పీఎంసీ ఛైర్మన్ అత్తునూరు సతీశ్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సచివాలయంలో సోమవారం జరిగిన స్పందనలో ఫిర్యాదు చేశారు. తక్షణం స్పందించిన తహసీల్దార్ పాఠశాల స్థలాన్ని పరిశీలించారు. సర్వే చేసి స్థలం చుట్టూ సరిహద్దు రాళ్లు వేయించాలని వీఆర్వోను ఆదేశించారు.
తిరువూరు, న్యూస్‌టుడే: ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు తహసీల్దార్ ఎస్.నరసింహారావు తెలిపారు. మండలంలోని లక్ష్మీపురం సచివాలయంలో సోమవారం ప్రత్యేక స్పందన నిర్వహించారు. ప్రజలు ఆయా సమస్యలపై అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు. సర్పంచి జి.శ్రీనివాసరావు, ఎంపీటీసీ సభ్యురాలు ఎం.కోటేశ్వరి పాల్గొన్నారు.
విస్సన్నపేట, న్యూస్‌టుడే: మండలంలో సోమవారం నిర్వహించిన స్పందనలో 36 అర్జీలు దాఖలైనట్లు తహసీల్దారు బి.మురళీకృష్ణ తెలిపారు. కొండపర్వలో 13, నరసాపురంలో 23 దరఖాస్తులు వచ్చినట్లు చెప్పారు.
గంపలగూడెం: మండలంలోని గోసవీడు, అమ్మిరెడ్డిగూడెం, పెదకొమిర గ్రామాల్లో సోమవారం నిర్వహించిన స్పందన గ్రామసభల్లో సామాజిక పింఛన్ల కోసం పలువురు అర్జీలు అందజేశారని ఎంపీడీవో పిచ్చిరెడ్డి తెలిపారు.
తాగునీటి సమస్యను పరిష్కరించరూ...
పెడన గ్రామీణం: తమ గ్రామాల్లో తాగు నీటి సమస్యను పరిష్కరించాలని కాకర్లమూడి, అచ్చయ్యవారిపాలెం గ్రామాల ప్రజలు సోమవారం ఆయా పంచాయతీ కార్యాలయాల వద్ద జరిగిన స్పందనలో అధికారులకు విన్నవించారు. రోజు విడిచి రోజు నీరు సరఫరా చేస్తున్నప్పటికీ తక్కువ సమయం ఇస్తుండటంతో సరిపోవడం లేదన్నారు. అచ్చయ్యవారిపాలెంలో అర్హులైన తమకు పింఛన్లు అందించాలని ఐదుగురు కోరారు. తహసీల్దార్ మధుసూదనరావు, ఎంపీడీవో జె.రామనాథం, గృహ నిర్మాణ సంస్థ ఏఈ మోహనరావు, కార్యదర్శులు, సచివాలయ ఉద్యోగులు, పాల్గొన్నారు.