ఆర్బీకే సిబ్బంది నిర్లక్ష్యం
లక్ష్య సాధనలో వెనుకంజ
న్యూస్‌టుడే - పెడన
పెడన మండలంలో వ్యవసాయ శాఖ పనితీరు నిరాశాజనకంగా ఉంది. ఆర్బీకేల్లో విధులు నిర్వర్తిస్తున్న కొంత మంది ఉద్యోగుల నిర్లక్ష్యం వ్యవసాయ శాఖ లక్ష్యాలను నీరుగారుస్తోంది. దీనిపై మండల ఏవీ ఇటీవల ఎమ్మెల్యే జోగి రమేష్‌ను కలిసి పరిస్థితిని ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. పెడన మండలంలో 17 గ్రామ సచివాలయాలకు అనుబంధంగా 17 ఆర్బీకేలను ఏర్పాటు చేశారు. ఇటీవల పెడన పట్టణానికి కూడా ఆర్బీకేను మంజూరు చేయటంతో ఆ సంఖ్య 18కు చేరింది. పెడన, చేవేండ్ర, నందమూరు, చెన్నూరు, కొంకేపూడి ఆర్బీకేల్లో ఎంపీఈవోలు, మిగిలిన వాటిలో వీఏఏలు ఇన్‌ఛార్జులుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కాకర్లమూడి, ఉరివి ఆర్బీకేల వీఏఏలు ఉద్యోగాలను వీడి వెళ్లటంతో ఆ రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వైకాపా ప్రభుత్వం పలు బాధ్యతలను అప్పగించింది. ప్రధానంగా ఈక్రాప్ నమోదు, పంట నష్టం నమోదు, ధాన్యం కొనుగోళ్లు, ఈకేవైసీ తదితర బాధ్యతలను సచివాలయ పరిధిలో నిర్వర్తించాల్సి ఉంటుంది. ఇటీవల వరుసగా కురిసిన భారీ వర్షాలకు పెడన మండలంలో దాదాపు 5 వేల హెక్టార్లలో వరి పంటను రైతులు నష్టపోయారు. ఆర్బీకేల్లో వారు అందుబాటులో లేకపోవటం, రైతులు వెళ్లినా సమాధానం చెప్పకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. రైతుల ఈకేవైసీని వంద శాతం పూర్తిచేయాలని ఉన్నతాధికారులు ఒత్తిడి చేస్తున్నా ఈ మండలంలో సాధ్యం కాలేదు. 10,500 మంది రైతులకుగాను 8800 మంది మాత్రమే ఈప్రక్రియను పూర్తిచేశారు. ఖరీఫ్ పంట దిగుబడులు వస్తున్నా.. ఈకేవైసీ పూర్తికాకపోవటంతో రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విక్రయించుకునేందుకు వీల్లేని పరిస్థితి తలెత్తింది. తప్పనిసరి పరిస్థితుల్లో కమిషన్ ఏజెంట్లకు తక్కువ ధరకు విక్రయించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కొంతమందికి ఈ క్రాప్ నమోదును కూడా పూర్తి చేయించలేకపోయారు. ఆర్బీకేలకు వెళితే సమాధానం చెప్పేందుకు కూడా సిబ్బంది ఆసక్తి చూపడం లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. కొంత మంది వీఏఏలు నామమాత్రంగా విధులకు హాజరై వెళ్లిపోతున్నారని, మండల వ్యవసాయాధికారిని సైతం ఖాతరు చేయడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.