logo

శుచీ.. శుభ్రత లేదు

ఉపాధ్యాయులు తరగతులకు సక్రమంగా హాజరుకారని, భోజనర కూడా బాగోదని గురుకుల విద్యార్థులు జిల్లా కలెక్టర్‌ నివాస్‌కు తాము ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. మచిలీపట్నంలోని మైనారిటీ గురుకుల విద్యార్థులు జ్వరాల బారిన పడిన సంఘటనపై

Published : 07 Dec 2021 02:25 IST

కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన మైనారిటీ గురుకుల పాఠశాల విద్యార్థులు

ఉపాధ్యాయులకు షోకాజ్‌ నోటీసుల జారీకి ఆదేశం

విద్యార్థుల సమస్యలు తెలుసుకుంటున్న కలెక్టర్‌ నివాస్‌

మచిలీపట్నం కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: ఉపాధ్యాయులు తరగతులకు సక్రమంగా హాజరుకారని, భోజనర కూడా బాగోదని గురుకుల విద్యార్థులు జిల్లా కలెక్టర్‌ నివాస్‌కు తాము ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. మచిలీపట్నంలోని మైనారిటీ గురుకుల విద్యార్థులు జ్వరాల బారిన పడిన సంఘటనపై ‘తల్లిదండ్రుల్లో కలవరం’ శీర్షికన సోమవారం ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనానికి రాష్ట్ర మంత్రులతోపాటు జిల్లా ఉన్నతాధికారులు సైతం స్పందించారు. మంత్రి పేర్ని నాని, జిల్లా కలెక్టర్‌ జె.నివాస్‌లు జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థుల వద్దకు వెళ్లి పరామర్శించారు. వారి తల్లిదండ్రులతో కూడా మాట్లాడి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అక్కడున్న వైద్యాధికారులతో చిన్నారులకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్‌ పలువురు ఉన్నతాధికారులతో కలిసి చిలకలపూడి ప్రాంతంలోని గురుకుల పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు ఉపాధ్యాయుల సమక్షంలో సమస్యలు చెప్పడానికి తటపటాయిస్తుండటంతో వారిని వెళ్లిపోమని చెప్పి సమస్యలు తెలుసుకున్నారు. విద్యార్థులు మాట్లాడుతూ తెలుగు, సైన్స్‌ ఉపాధ్యాయులపై ఫిర్యాదు చేశారు. బియ్యం నాసిరకంగా ఉంటుందని, భోజనం అంతగా బాగుండడం లేదని, మరుగుదొడ్ల నిర్వహణ, పారిశుద్ధ్యం తదితర సమస్యలను ఇప్పటికే చెప్పామని కానీ పట్టించుకోలేదని చెప్పారు.

వసతులు కల్పించండి.. లేదా వేరే భవనం చూడండి

గురుకుల విద్యాలయంలోని విభాగాల వారీగా కలెక్టర్‌ పరిశీలించారు. విద్యార్థులు ఉండే గదుల్లో వెంటిలేటర్లకు తక్షణం మెష్‌లు వేయించాలని, తాగునీటిట్యాంకు శుభ్రంచేయించి క్లోరినేషన్‌ చేయాలని ఆదేశించారు. అనంతరం వంటగదిలోని ఆహార పదార్థాలను పరిశీలించారు. గురుకుల విద్యాలయం భవన నిర్మాణాలకు స్థలం కేటాయించినా పనులు ప్రారంభం కాలేదని అధికారులు వివరించారు. ప్రస్తుతం ఉన్న భవనంలో వసతులు కల్పించండి..లేదా వేరే భవనం చూడాలంటూ కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. విద్యార్థులు ఫిర్యాదు చేసిన ఉపాధ్యాయులకు షోకాజ్‌ నోటీసులు ఇవ్వాలంటూ డీఈవో తాహెరా సుల్తానా, ఆర్డీవో ఖాజావలీలకు చెప్పారు. విద్యాలయాన్ని తరచుగా పర్యవేక్షిస్తుండాలని ముడ వీసీ శివనారాయణరెడ్డికి చెప్పారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారిణి డా.సుహాసిని మాట్లాడుతూ విద్యార్థులకు నిర్వహించిన పలు పరీక్షల నివేదికలు నెగిటివ్‌ వచ్చాయని అయినా కొన్నాళ్లపాటు పాఠశాలలో వైద్యశిబిరం కొనసాగిస్తామని చెప్పారు. మేయర్‌ వెంకటేశ్వరమ్మ, డిప్యూటీ మేయర్‌ తంటిపూడి కవిత, మున్సిపల్‌ మాజీ ఛైర్మన్‌ షేక్‌సిలార్‌దాదా, తహసీల్దారు సునీల్‌బాబు పాల్గొన్నారు.

అందరికీ వైద్యపరీక్షలు చేయండి

మచిలీపట్నం కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: విద్యార్థులందరికీ అవసరమైన అన్ని వైద్యపరీక్షలు చేయాలని, ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితి సమీక్షిస్తూ..నీటి వసతులు, పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టిసారించాలని విద్యాశాఖామంత్రి ఆదిమూలపు సురేష్‌ అధికారులను ఆదేశించారు. విద్య, వైద్యఆరోగ్యశాఖతోపాటు వివిధ శాఖల అధికారులతో మాట్లాడి మైనారిటీ గురుకుల విద్యార్థుల అస్వస్థతపై ఆరా తీశారు. విద్యార్థులకు ఇప్పటివరకు నిర్వహించిన పరీక్షలు తదితర అంశాలను అడిగి తెలుసుకున్నట్లు మంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని