logo

మిరప ధరహాసం

ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని విపణిల్లో సోమవారం మిరపకు అనూహ్యమైన ధర లభించింది. వారం రోజులుగా మార్కెట్‌లో క్వింటాల్‌కు రూ.14,800 నుంచి రూ.15,300 వరకు లభించింది. సోమవారం ఒక్కసారిగా రూ.20 వేలకు చేరింది. గుంటూరు, ఖమ్మం

Published : 07 Dec 2021 02:25 IST

క్వింటాల్‌ రూ.20 వేలు

గంపలగూడెం, న్యూస్‌టుడే : ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని విపణిల్లో సోమవారం మిరపకు అనూహ్యమైన ధర లభించింది. వారం రోజులుగా మార్కెట్‌లో క్వింటాల్‌కు రూ.14,800 నుంచి రూ.15,300 వరకు లభించింది. సోమవారం ఒక్కసారిగా రూ.20 వేలకు చేరింది. గుంటూరు, ఖమ్మం మార్కెట్లలో రూ.19 వేలు, ఖమ్మం జిల్లా తల్లాడ శీతల గిడ్డంగుల వద్ద ఏసీ తేజ రకం మిరపకాయలకు రూ.20 వేల ధర లభించింది. అన్నదాతలు ఎర్రబంగారంగా పిలుచుకునే మిరప ధరలు క్వింటాల్‌కు ఒకేసారి రూ.5 వేలు పెరగడంతో వారి ఆనందానికి అవధుల్లేవు. ప్రపంచ మార్కెట్‌లో మిరప ఎగుమతులు ప్రారంభమవ్వడంతో ధర ఇంకా పెరిగే అవకాశం ఉందని వ్యాపార వర్గీయులు వెల్లడించారు. మరోవైపు రైతులు, వ్యాపారులు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని శీతల గిడ్డంగుల్లో లక్షలాది క్వింటాళ్ల మిరపకాయలను నిల్వచేశారు. ధర పెరుగుదల ఊపందుకోవడంతో కర్షకులు, వ్యాపారులు సోమవారం శీతల గిడ్డంగుల నిర్వాహకులతో విక్రయాలపై సంప్రదిస్తున్నారు. ఈ ఏడాది జిల్లాలో మిరప సాగు విస్తీర్ణం పెరిగింది. నెల రోజుల క్రితం వరకు ధర దిగజారి కలవరపరిచింది. ఈ సంవత్సరం సాగు చేసిన మిరప తోటలో కొత్త రకం తామర పురుగులు ఉద్ధృతంగా ఉండటంతో దిగుబడిపై తీవ్రప్రభావం చూపుతోంది. తెగుళ్లు, పురుగుల నియంత్రణ సాధ్యం కాకపోవడంతో కొందరు తోటలను నిలువునా దున్నేస్తున్నారు. ఈ నేపథ్యంలో శీతల గిడ్డంగుల్లో నిల్వ చేసిన మిరపకు అనూహ్యమైన ధర లభిస్తోందని అంటున్నారు. ఇప్పుడే కొత్త మిరపకాయలు విపణిలోకి చేరుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని