logo

ప్రత్యామ్నాయం..ఆరు తడి వైపు పయనం

ఈ రబీలో ప్రభుత్వం వరిపంటకు అవకాశం ఇవ్వకపోవడంతో రైతులందరూ ప్రత్యామ్నాయమైన ఆరుతడి పంటలవైపు మొగ్గుచూపారు. అపరాల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. ఆయా భూములకు అనువైన పంటలు సాగు చేసేదిశగా అన్నదాతలు చర్యలు

Published : 17 Jan 2022 02:06 IST

పెరిగిన మినుము విస్తీర్ణం

పెడన మండలం చేవెండ్రపాలెంలో సాగైన మినుము పంట

గొడుగుపేట (మచిలీపట్నం), న్యూస్‌టుడే : ఈ రబీలో ప్రభుత్వం వరిపంటకు అవకాశం ఇవ్వకపోవడంతో రైతులందరూ ప్రత్యామ్నాయమైన ఆరుతడి పంటలవైపు మొగ్గుచూపారు. అపరాల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. ఆయా భూములకు అనువైన పంటలు సాగు చేసేదిశగా అన్నదాతలు చర్యలు తీసుకుంటున్నారు. దీంతో జిల్లాలో ఇతర పంటల విస్తీర్ణం పెరుగుతోంది.

వరికి బదులు అపరాలు

జిల్లాలో గత రబీలో మచిలీపట్నం, పెడన, కైకలూరు, అవనిగడ్డ నియోజకవర్గాలతోపాటు విజయవాడ రూరల్‌, ఉయ్యూరు, తదితర ప్రాంతాల్లో బోర్ల కింద వరి పంట సాగు చేశారు. అలా మొత్తం 72వేల హెక్టార్ల వరకు వరి పంట సాగయ్యింది. ఈఏడాది తూర్పు, పశ్చిమకృష్ణాలోని ప్రాంతాల్లో ఎక్కువ శాతం వరి విస్తీర్ణాన్ని మినుము పంట భర్తీ చేసింది. గతేడాది జనవరి 12వ తేదీ నాటికి 1.04లక్షల హెక్టార్లలో వినుము పంట సాగైతే ఈ ఏడాది అదే సమయానికి 1.29లక్షల హెక్టార్లలో సాగైనట్లు వ్యవసాయశాఖ గణాంకాలు తెలియజేస్తున్నాయి. 25లక్షల హెక్టార్లు పెరిగింది. ఇది ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. విజయవాడ రూరల్‌, పెనమలూరు, కంకిపాడు, మైలవరం, జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు తదితర మండలాల్లో కలిపి ఇప్పటివరకు 1300హెక్టార్లకుపైగా వరి సాగు అయ్యింది.

వివిధ రకాల పంటల సాగు

మొక్కజొన్న గత రబీతో పోల్చితే ఇప్పటికే 4వేల హెక్టార్లకుపైగా ఎక్కువ సాగయ్యింది. ఇది ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. బందరు, పెడన, గూడూరు, బంటుమిల్లి మండలాల్లో వేరుసెనగ పంట విస్తీర్ణం పెరిగింది. మండవల్లి, ముదినేపల్లి, బాపులపాడు, రెడ్డిగూడెం, వత్సవాయి తదితర మండలాల్లోని గరపనేలల్లో రైతులు వేరుసెనగపంట సాగు చేశారు. ఈసారి రైతులు విభిన్న పంటలవైపు ఆసక్తి చూపారు. బంటుమిల్లి, మండవల్లి, ముదినేపల్లి, కైకలూరు మండలాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉలవ, ఇబ్రహీంపట్నం, వీరులపాడు, కంచికచర్ల, జగ్గయ్యపేట, గన్నవరం మండలాల్లో శనగలు, నందివాడతోపాటు వివిధ మండలాల్లోని పలుగ్రామాల్లో ఆవాల పంట వేశారు. గతేడాదితో పోల్చుకుంటే ఆరుతడి పంటల విస్తీర్ణం పెరగడంతోపాటు కొత్త పంటల వైపు కూడా అన్నదాతలు మొగ్గు చూపుతున్నారు.

మరింత పెరిగే అవకాశం

గత రబీతో పోల్చితే ప్రస్తుత సమయానికి 30వేల హెక్టార్ల ఆరుతడి పంటల విస్తీర్ణం పెరిగింది. ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. వరికి ప్రత్యామ్నాయంగా రైతులు ఎక్కువ మంది మినుము సాగు చేశారు. ఇంకా కొంత నమోదు చేయాల్సి ఉంది. అది కూడా పూర్తయితే మినుము విస్తీర్ణం ఇంకా పెరుగుతుంది. రైతులు ఇతర పంటలు కూడా సాగు చేయడంతోపాటు అన్నింటినీ ఈ పంటలో నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశాం. సాగులో సలహాలు, సూచనలు ఇస్తూ రైతులను ప్రోత్సహించే దిశగా అన్నివిధాలుగా కృషి చేస్తున్నాం. - మోహనరావు, వ్యవసాయశాఖ జేడీ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని