logo

పందేల జాతర

సంక్రాంతి సంప్రదాయం మాటున జిల్లా వ్యాప్తంగా మూడు రోజుల పాటు జూదక్రీడలు కొనసాగాయి. జిల్లా ఉన్నతాధికారులు, పోలీసులు ముందస్తుగా చేసిన హెచ్చరికలు నామమాత్రమే అయ్యాయి. ప్రధాన రహదారుల చెంతనే బహిరంగ బరులు, పేకాట శిబిరాలు

Published : 17 Jan 2022 02:06 IST

తిరువూరు నియోజకవర్గం పరిధిలో ఫ్లడ్‌లైట్ల వెలుగులో జరిగిన కోడిపందేలు

మచిలీపట్నం క్రైం, న్యూస్‌టుడే: సంక్రాంతి సంప్రదాయం మాటున జిల్లా వ్యాప్తంగా మూడు రోజుల పాటు జూదక్రీడలు కొనసాగాయి. జిల్లా ఉన్నతాధికారులు, పోలీసులు ముందస్తుగా చేసిన హెచ్చరికలు నామమాత్రమే అయ్యాయి. ప్రధాన రహదారుల చెంతనే బహిరంగ బరులు, పేకాట శిబిరాలు నిర్వహించారు. మూడు రోజులుగా సాగుతున్న పందేలలో రూ.పెద్దమొత్తంలో చేతులు మారాయి.

సంక్రాంతి పర్వదినాల్లో చట్టపరంగా ఎన్ని హెచ్చరికలు చేసినా చాటుమాటుగా పందేలు, పేకాట వంటివి సర్వసాధారణ విషయాలే. ప్రస్తుతం యావత్‌ దేశాన్ని ప్రస్తుతం కలవరపెడుతున్న ఒమిక్రాన్‌ విస్తరణకు జూదక్రీడలు మరింత దోహదపడే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని అధికారులు గతానికి భిన్నంగా దృష్టి సారిస్తారని భావించారు. అందుకు తగ్గ విధంగానే గ్రామస్థాయి కమిటీల ఏర్పాటుతో పాటు 144 సెక్షన్‌ అమలు చేయాలని ఉన్నతాధికారులు స్పష్టం చేసినా క్షేత్రస్థాయిలో ఆ ఆదేశాలు ఏమాత్రం ఆచరణకు నోచుకోలేదు. భోగి ముందు వరకూ పోలీసులు వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బరులను ధ్వంసం చేయడంతో పాటు పలువురిని బైండోవర్‌ చేసినా, మూడు రోజులకు అనుమతులొచ్చాయంటూ జూద నిర్వాహకులు చేసిన ప్రచారం వాస్తవమే అన్పించేలా ఫ్లడ్‌లైట్‌ల వెలుగుల్లో రాత్రి, పగలు అన్న తేడా లేకుండా పందేలు నిర్వహించారు. అన్ని నియోజకవర్గాల పరిధిలో కనీసం రెండుకు తగ్గకుండా పెద్దబరులు ఏర్పాటు చేశారు. వీటీల్లో ఒక్కో కోడిపందేనికి కనీసం రూ.లక్ష నుంచి పైచిలుకు నిర్ధారించారు. పేకాటకు ఇదే తరహాలో ఏర్పాట్లు చేసుకున్నారు. వీటికితోడు నెంబర్లాట, చిత్తాట, గుండాట, వంటి జూదక్రీడలు కూడా పెద్దమొత్తాలతో నిర్వహించారు. గుడివాడ, కైకలూరు, జగ్గయ్యపేట, తిరువూరు, పెండ్యాల కంచికచర్ల, తదితర ప్రాంతాల పరిధిలో నిర్వహించిన పందేలకు పొరుగు జిల్లాకు చెందిన వారు తరలివచ్చారు. బరి మామూళ్లు, మద్యం, ఇతర తినుబండారాల విక్రయ దుకాణాల ఏర్పాటు తదితరాల పరంగా నిర్వాహకులు సొమ్ము చేసుకున్నారు. గడచిన ఏడాది తరహాలోనే బాపులపాడు మండలం అంపాపురంలో వివిధ హంగుల నడుమ భారీ పందేలు వేశారు. నందిగామ నియోజకవర్గ పరిధిలోని గండేపల్లి, పరిటాల, మచిలీపట్నం మండలం మేకావానిపాలెం, చల్లపల్లి, కొడాలి, కొక్కిలిగడ్డ ప్రాంతాల్లో రూ.లక్షల్లో చేతులు మారాయి. కొన్ని ప్రాంతాల్లో ఎటువంటి వివాదాలు లేకుండా చూసేందుకు ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసుకున్నారు. అవనిగడ్డ, గుడివాడ, పెనమలూరు, కైకలూరు నియోజకవర్గాల పరిధిలో విరామం లేకుండా జూదం సాగే విధంగా ఫిష్ట్‌ల వారీ జూద నిర్వాహకులను ఏర్పాటు చేసుకున్నారు. మహిళలు సైతం వీటిని తిలకించేందుకు వచ్చారు. మోపిదేవి సమీపంలో పై పందేలతో సంబంధం లేకుండా గరిష్ఠంగా రూ.30 లక్షల వరకూ కోడి పందెం నిర్వహించారు. పేకాటలో పాల్గొనేందుకు రుసుములు వసూలు చేశారు. వత్సవాయి మండలం లింగాల, గుడ్లవల్లేరు మండలం అంగలూరు, మచిలీపట్నం మండలం శ్రీనివాసనగర్‌, మోపిదేవి మండలం కె.కొత్తపాలెం, తదితర ప్రాంతాల్లో నెలకొన్న ఘర్షణల కారణంగా ఉద్రిక్తతలు నెలకొన్నాయి. లింగాలలో గ్రామస్థులే పందేలను అడ్డుకున్నారు.

1,141 కేసులు.. 3,494 మంది అరెస్ట్‌

గడచిన వారం రోజులుగా నిర్వహించిన దాడుల్లో మొత్తం 1,141 కేసులు నమోదు చేసిన పోలీసులు 3,494 మందిని అదుపులోకి తీసుకున్నారు. కోడి పందేలకు సంబంధించి 464 కేసులు నమోదు చేసి రూ.6.57 లక్షలు, 44 పెట్టీ కేసుల్లో రూ.99,650, పేకాటకు సంబంధించి 355 కేసుల్లో రూ.7.05 లక్షలు, 278 పెట్టీ కేసుల్లో రూ.6.11 లక్షలతో పాటు 583 కోడిపుంజులు, 75కి పైగా బైక్‌లు, ఒక ఆటో స్వాధీనం చేసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని