logo

కోఢీ

సంప్రదాయం పేరుతో సంక్రాంతి పండగను పురస్కరించుకుని సాగిన కోడిపందేలు, జూదక్రీడల్లో నగదు పెద్దమొత్తంలో చేతులు మారింది. పోలీసుల హెచ్చరికలను సైతం పక్కనపెట్టి భారీ స్థాయిలో బరులు ఏర్పాటు చేశారు. కత్తులు కట్టి నిర్వహించిన పోటీల్లో

Published : 17 Jan 2022 02:06 IST

నెత్తురోడిన బరులు

పెడన మండలంలో పందేనికి కోళ్లను సిద్ధం చేస్తున్న దృశ్యం

పెడన, న్యూస్‌టుడే: సంప్రదాయం పేరుతో సంక్రాంతి పండగను పురస్కరించుకుని సాగిన కోడిపందేలు, జూదక్రీడల్లో నగదు పెద్దమొత్తంలో చేతులు మారింది. పోలీసుల హెచ్చరికలను సైతం పక్కనపెట్టి భారీ స్థాయిలో బరులు ఏర్పాటు చేశారు. కత్తులు కట్టి నిర్వహించిన పోటీల్లో బరులన్నీ నెత్తురోడాయి. పెడన నియోజకవర్గంలో నిర్వహించిన పందేలను తిలకించడానికి ఇతర జిల్లాల నుంచి తరలివచ్చారు. కృత్తివెన్ను, పెడన, గూడూరు మండలాల్లో బరుల వద్ద నిర్వాహకులు ఫుడ్‌స్టాళ్లు, మద్యం బెల్టుషాపులను ఏర్పాటుచేశారు.

చెదురుమదురుగా ఘర్షణలు: కొన్ని బరుల్లో చిన్నచిన్న ఘర్షణలు తలెత్తాయి. పెడన బైపాస్‌లో ఏర్పాటు చేసిన బరి వద్ద శనివారం ఒక యువకుడు మద్యం సీసాను పగులగొట్టి విధ్వంసం చేశాడు. చెన్నూరు, నందమూరు, కాకర్లమూడి, నందిగామ, నడుపూరు గ్రామాల్లోనూ ఘర్షణలు జరిగాయి. కొంకేపూడిలో రెండు వర్గాల మధ్య బరుల విషయమై తలెత్తిన వివాదంతో పోటీలను నిలిపివేశారు.

బంటుమిల్లి: మండలంలోనూ బరులు ఏర్పాటు చేసి కోడి పందేలు నిర్వహించారు.రాత్రిళ్లు జూదక్రీడలు నిర్వహించారు.

ముదినేపల్లి: గ్రామగ్రామాన కోడిపందేలు జోరుగా సాగాయి. మహిళలు సైతం ఆసక్తిగా తిలకించారు. పేరూరు, అన్నవరం, దేవపూడి, చినవాడవల్లిలో బరుల వద్ద ఘర్షణలు చోటుచేసుకున్నాయి. బరుల వద్ద ఎవరూ ఫొటోలు తీయకుండా నిర్వాహకులు యువకులను నియమించుకున్నారు.

కలిదిండి: మండలంలో కోడిపందేలు, పేకాట శిబిరాలు మూడు రోజులపాటు యథేచ్ఛగా సాగాయి. పండగ ప్రారంభానికి ముందురోజు పోలీసులు మొక్కుబడిగా నిర్వహించిన దాడుల్లో కొన్నిచోట్ల శిబిరాలను కూల్చివేశారు. అసలు జూదాలు మొదలైన తరవాత చూసీచూడనట్లుగా వదిలేశారనే విమర్శలు వినిపించాయి.

తిరువూరు: తిరువూరు నియోజకవర్గంలో కోడిపందేలకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. మహిళలు సైతం రావడం విశేషం.బరుల పక్కనే పేకాట, గుండాట, నంబర్లాట జోరుగా సాగింది. ఫ్లడ్‌లైట్లు, గ్యాస్‌ లైట్ల వెలుగులో అర్ధరాత్రి వరకు జూదాలు కొనసాగాయి. బరులన్నీ జనాలతో కిటకిటలాడుతూ కొన్నిచోట్ల జాతరను తలపించింది. వాహనాల యజమానుల నుంచి కొన్నిచోట్ల ప్రైవేట్‌ వ్యక్తులు పార్కింగ్‌ ఫీజు వసూలు చేశారు.బరిని బట్టి రూ.20 వేల నుంచి రూ.లక్ష వరకు ఒప్పందం చేసుకోగా, పై పందేలు పెద్దఎత్తున కాశారు. తిరువూరు మండలం మల్లేలలో జరిగిన కోడిపందేలకు ఎమ్మెల్యే కె.రక్షణనిధి, విస్సన్నపేట మండలంలో తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఎస్‌.దేవదత్‌ హాజరయ్యారు.

గంపలగూడెం: మండలంలో నిర్వహించిన పందేలను తిలకించేందుకు తెలంగాణ నుంచి సుడా ఛైర్మన్‌ బచ్చు విజయ్‌కుమార్‌, పలువురు డైరెక్టర్లు, ఖమ్మం నగరపాలక సంస్థకు చెందిన పలువురు కార్పొరేటర్లు ఆదివారం వచ్చారు. నెమలి సమీపంలో ఏర్పాటు చేసిన పందేలను ఆసక్తిగా తిలకించారు. జూదం(కోసు), చిత్తులాట (పట్టాలాట) లో పెద్దమొత్తంలో చేతులు మారాయి. బరుల వద్ద మద్యం అమ్మకాలూ జోరుగా సాగాయి. పలు గ్రామాల్లో ప్రధాన రహదారుల వెంట ట్రాఫిక్‌ నిలిచిపోయింది. మద్యం మత్తులో పలువురు యువకులు వాహనాలను వేగంగా నడిపి ప్రమాదానికి గురయ్యారు.

కొత్తగా బుల్లెట్‌ పందేలు: ఈ ఏడాది బుల్లెట్‌ పందేల పేరుతో కొత్త సంప్రదాయానికి నిర్వాహకులు తెరతీశారు. ఈ ప్రాంతంలో ఇది కొత్తగా ఉండటంతో పందెం ప్రియులు ఆసక్తి చూపారు.

గూడూరు: మండలంలోని బరుల వద్ద కోలాహల వాతావరణం నెలకొంది. కోడిపందేల మాటున పేకాట శిబిరాలు ఏర్పాటు చేశారు. బరుల వద్ద తినుబండారాల దుకాణాలు వెలిశాయి.

కైకలూరు గ్రామీణం: మండలంలోనూ కోళ్లకు కత్తులు కట్టి పందేలు నిర్వహించారు. వాటి మాటున గుండాట, కోతాట కొనసాగించారు. మండల వ్యాప్తంగా రూ.లక్షలు చేతులు మారాయి. రాత్రివేళ ఆటంకం లేకుండా ఫ్లడ్‌లైట్లు, జనరేటర్లను ఏర్పాటు చేశారు.

మండవల్లి, న్యూస్‌టుడే: యథేచ్ఛగా కోడిపందేలను నిర్వహించారు. రూ.5వేల నుంచి రూ.5లక్షల వరకు పందేలు కాశారు. వీటిని తిలకించేందుకు ఇతర జిల్లాల నుంచి వచ్చిన వాళ్లతో శిబిరాలు కిక్కిరిసిపోయాయి. కొల్లేరు లంక గ్రామాల్లో పశ్చిమగోదావరి జిల్లా నుంచి వచ్చిన బెట్టింగ్‌రాయుళ్లు పాల్గొన్నారు.

విస్సన్నపేట: మండలంలో విస్సన్నపేట, కొర్లమండ, వేమిరెడ్డిపల్లి, నూతిపాడు, వేమిరెడ్డిపల్లి తండా, తెల్లదేవరపల్లి గ్రామాల్లో పెద్దఎత్తున కోడిపందేలు, జూదం కొనసాగాయి. పుట్రేల, మల్లేల గ్రామాల నడుమ మామిడితోటల్లో నిర్వాహకులు తాత్కాలిక షెడ్లు, షామియానాలు ఏర్పాటు చేశారు.


చింతపాడులో నిర్వహిస్తున్న కోడిపందేలు

గంపలగూడెం మండలంలో మూడుముక్కలాట

బంటుమిల్లి: పందెం బరి వద్ద గుండాట

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని